అక్కినేని మల్టీస్టారర్ ‘మనం’ ప్రారంభం, నాగ్ ట్వీట్
హైదరాబాద్ : చాలా కాలంగా ఎదురు చూస్తున్న అక్కినేని ఫ్యామిలీ మూవీ 'మనం' మొత్తానికి ఈ రోజు మొదలయింది. ఈ చిత్రంలో అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో నటించబోతున్నారు.
ఇది వరకు 'ఇష్క్' లాంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విక్రమ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈచిత్ర ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో చాలా సింపుల్ గా జరిగింది. ఈ చిత్రంలో నాగార్జున సరసన శ్రీయ, నాగ చైతన్య సరసన సమంత హీరోయిన్లుగా నటించనున్నారు.

ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం గురించి హీరో నాగార్జున తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'ఈ రోజు మనం సినిమా పూజా కార్యక్రమం జరిగింది. అమ్మ గుర్తుకు వచ్చింది. కాస్త ఎమోషనల్ అయ్యా' అంటూ ట్వీట్ చేసారు . ఈచిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించనున్నారు. పిఎస్ వినోద్ కెమెరామెన్. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.
ఈ సినిమాలో వీరు ముగ్గురూ నిజ జీవితంలో మాదిరి అక్కినేని, నాగ్, చైతు ఈ చిత్రంలో తాత, తండ్రి, కొడుకు పాత్రలు పోషిస్తారు. అన్నపూర్ణా స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. మూడు తరాల నటులు కలిసి నిజజీవిత పాత్రల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


Click it and Unblock the Notifications











