»   »  పచ్చ నోటు ప్రదక్షిణ (‘పైసా’ ప్రివ్యూ)

పచ్చ నోటు ప్రదక్షిణ (‘పైసా’ ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nani's Paisa preview
హైదరాబాద్ : కృష్ణ వంశీ చిత్రాలంటే తన దైన సృజనాత్మకతతో , ఎంతో కొంత సమాజ స్పృహతో కొత్తగా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. ఆయన తాజా చిత్రం'పైసా' కూడా అలాగే సమాజంలో డబ్బు కి ఉన్న ప్రాధాన్యతను చర్చిస్తూ సాగుతుంది. చాలా కాలం క్రితమే చిత్రం పూర్తైనా ఫైనాన్స్ సమస్యలతో విడుదలకు నోచుకోలేదు. ఇన్నాళ్లకు ఈ చిత్రం అన్ని అడ్డంకులను అథిగమించి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ప్ర'క్యాష్' (నాని)కి డబ్బంటే పిచ్చి. ఏదోలా డబ్బు సంపాదించేయాలి. అంతే.. అందుకోసం ఏమైనా చేస్తాడు. పాత బస్తీలోని షేర్వాణీ దుకాణంలో మోడల్‌గా పనిచేస్తుంటాడు. అతనికి అనుకోకుండా కోట్ల రూపాయలు కలిసొచ్చే వ్యవహారం ఆచూకీ(హవాలా ట్రాన్సిక్షన్ ) తెలిసింది. అది ప్రకాష్‌ జీవితాన్ని ఎలా మలుపుతిప్పింది? ఆ డబ్బును సంపాదించడానికి అతను ఏం చేశాడు అన్నదే కథ. నూర్జహాన్‌ (కేథరిన్‌) సంప్రదాయక ముస్లిం యువతి. నలుగురిలో మాట్లాడ్డానికైనా భయం, మొహమాటం. ప్రకాష్‌ ప్రయాణంలో నూర్జహాన్‌ ఎక్కడ కలిసింది అన్నదీ ఆసక్తికరమే.

కృష్ణవంశీ మాట్లాడుతూ... ''పైసా.. అనేది పదకొండో అవతారం. డబ్బు మనిషితో ఏం చేయిస్తుంది? దాని కోసం మనుషులు ఎంతకు దిగజారుతున్నారు అన్నదే ఈ సినిమా. నేను అనుకొన్న పాత్రకి నాని నూటికి నూరుపాళ్లు సరిపోయాడు. కేథరిన్‌ కళ్లను చూసి ఆమెను ఈ పాత్రకి ఎంచుకొన్నా. నా సినిమాల్లో హీరోయిన్స్ చాలా గడుసుగా ఉంటారు. కేథరిన్‌ పాత్ర మాత్రం అందుకు విభిన్నంగా ఉంటుంది'' అన్నారు.

అలాగే... '' పచ్చనోటు అన్వేషణలోనే జీవితం గడిచిపోతోంది. మనిషి ఆశ.. శ్వాస.. పైసానే. అందుకోసమే ఎన్ని ఎత్తులేసినా, ఇంకెన్ని జిమ్మిక్కులు చేసినా. మా హీరో పైసల కోసమే పోరాటం చేశాడు. అది ఎందుకు? దాని వెనుక ఉన్న కారణం ఏమిటి?. డబ్బు డబ్బు డబ్బు. లేచింది మొదలు ప్రతి ఒక్కరూ పఠించేది మనీ మంత్రమే. పచ్చ నోటు చుట్టూ ప్రదక్షిణలే. వేలు, లక్షలు అనే మాటకి ఇప్పుడు విలువే లేదు. వందల కోట్లు, వేల కోట్లు అంటూ అందరూ సరదాగా మాట్లాడేస్తున్నారు. సంపాదన మోజులో మనుషులమన్న విషయాన్నే మరిచిపోతున్నారు. పచ్చ నోట్ల నీడలో అనుబంధాలు, ఆత్మీయతలు కనుమరుగైపోతున్నాయి. మన జీవనాన్ని, సామాజిక పరిస్థితుల్నీ డబ్బే శాసిస్తోంది. ఈ విషయాన్ని మా చిత్రంలో చూపించాము'' అన్నారు కృష్ణవంశీ.

నాని మాట్లాడుతూ...''ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. నా అభిమాన దర్శకుడితో పనిచేసే అవకాశం దక్కింది. కథాంశం కూడా బాగా నచ్చింది. తప్పకుండా ఓ కొత్త నాని కనిపిస్తాడు. ఈ సినిమా కోసం పాతబస్తీలో షూటింగ్‌ చేశాం. జనసంచారం ఎక్కు వగా ఉండే అలాంటి ప్రాంతాల్లో షూటింగ్‌ చేయడం కష్టం. సహజత్వం కోసం చాలా కష్టపడ్డాం'' అన్నారు.


చిత్రం: పైసా
సంస్థ: ఎల్లో ఫ్లవర్స్‌
తారాగణం: నాని, కేథరిన్‌, సిద్దికా, భరత్‌రెడ్డి, చరణ్‌రాజ్, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, ఆర్కే, తబర్, లోబో, రాజు శ్రీవాస్తవ తదితరులు.
రచన: కె.కె. బినోజీ, శ్రీనివాస్‌రెడ్డి, పాత్రికేయ,
పాటలు: సీతారామశాస్త్రి, అనంత శ్రీరామ్,
ఛాయాగ్రహణం: సంతోష్‌కుమార్ రాయ్,
సంగీతం: సాయికార్తీక్‌
నిర్మాత: రమేష్‌ పుప్పాల
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ.
విడుదల: 07,పిభ్రవరి,2014

English summary
Nani, Catherine Tresa's ‘Paisa directed by Krishna Vamsi is finally releasing today(Feb 7th). Sai Karthik scored music for the film which is touted to be a political entertainer. Ramesh Puppala is producing this film under Yellow Flower banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu