నారా రోహిత్ ‘ప్రతినిధి’ ఎక్కడున్నాడు?
'18/ సంవత్సరాల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకుంటే జీవితం పాడైపోతుందని అందరూ అంటారు. అదే 18/ సంవత్సరాల వయసులో ఓటేస్తే ప్రభుత్వం పాడైపోతుందని ఎవరూ అడగరే...వస్తున్నా...అడగడానికే వస్తున్నా..' అని నారా రోహిత్ ప్రశ్నిస్తున్న సినిమా టీజర్‌ను ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని ఆ మధ్యన విడుదల చేశారు. సమకాలీన రాజకీయాంశాల్ని చర్చిస్తూ సందేశాత్మకంగా ఈ సినిమా తెరకెక్కుతోందని, ప్రజా శ్రేయస్సును కాంక్షించే సిసలైన ప్రజా ప్రతినిధి ఎలా వుండాలో సినిమాలో చూపిస్తున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
రాజకీయ వ్యవస్థను ఎదుర్కునే ఒక సాధారణ వ్యక్తి కోణంలో రోహిత్ పాత్రను రూపొందించారని తెలుస్తుంది. సుధా సినిమాస్ పతాకంపై సాంబశివరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రశాంత్ మండవ దర్శకుడు. సాయికార్తీక్ సంగీతాన్నందిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
మరో ప్రక్క నారా రోహిత్, రెజీనా జంటగా శ్రీ లీలా మూవీస్ పతాకంపై తాతినేని సత్యప్రకాష్ దర్శకత్వంలో ఆర్వీ చంద్రవౌళీ ప్రసాద్ నిర్మిస్తున్న 'శంకర' చిత్రానికి సంబంధించి ఒక పాట మినహా షూటింగ్ పూర్తయ్యింది. ఈ సందర్భంగా నిర్మాత చంద్రవౌళి మాట్లాడుతూ ఈ చిత్రానికి సంబంధించిన పాట త్వరలో చిత్రీకరిస్తామని, ప్రస్తుతం రీరికార్డింగ్ జరుపుతున్నామని తెలిపారు. వచ్చేనెలలో ఆడియో విడుదల చేసి నెలాఖరుకు చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. దర్శకుడు మంచి కథతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, కొత్త నిర్మాత అయిన చంద్రవౌళి చక్కగా నిర్మించారని, తన కెరీర్‌లో ఓ మంచి చిత్రంగా ఈ సినిమా నిలబడుతుందని హీరో రోహిత్ తెలిపారు.


Click it and Unblock the Notifications












