»   » ‘కేశవ’: కేక పెట్టించిన టీజర్, దుమ్ము రేపిన ప్రీరిలీజ్ బిజినెస్... డిటేల్స్

‘కేశవ’: కేక పెట్టించిన టీజర్, దుమ్ము రేపిన ప్రీరిలీజ్ బిజినెస్... డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న 'కేశవ' సినిమా టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్‌కి జోడీగా రీతు వర్మ నటిస్తోంది. సంప్రదాయ కట్టుబట్టలతో కనిపించిన నిఖిల్.. క్రమంగా హత్యలు చేస్తూ టీజర్‌లో కనిపించడంతో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. మీరూ ఓ లుక్కేయండి

'భూతాన్ని.. యజ్ఞోపవీతాన్ని.. వైప్లవ్య గీతాన్ని నేను.. స్మరిస్తే పద్యం.. అరిస్తే వాద్యం.. అనల వేదిక ముందు అస్ర నైవేద్యం' అంటూ శ్రీశ్రీ చెప్పిన వాక్యాలతో ఈ టీజర్ ప్రారంభం అవటంతో కొత్త లుక్ వచ్చేసింది. రక్తపాతాన్ని తలపించిన ఈ టీజర్‌లో నిఖిల్‌పై డైలాగ్‌ చెబుతూ ఆసక్తికరంగా కనిపించారు. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో నిఖిల్ లుక్‌ చాలా విభిన్నంగా ఉంది.

ఇక ఈ చిత్రం టీజర్ చూసిన వారంతా...నిఖిల్ ఖాతాలో మరో హిట్ ఖాయమని భావిస్తున్నారు. మరో ప్రక్క 'కేశవ' సినిమా బిజినెస్ నిఖిల్ కెరీర్‌లో సరికొత్త రికార్డు సృష్టించిందనే ట్రేడ్ వర్గాల్లో టాక్. కేవలం రూ.7 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా 11 కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం.

Nikhil's Keshava Teaser released

హీరో, దర్శకుడి రెమ్యునరేషన్‌తో పాటు సినిమా బడ్జెట్ అంతా ఏడు కోట్ల లోపు ఫినిష్ చేసి ఇస్తానని అభిషేక్ పిక్చర్స్ సంస్థకు మాటిచ్చిన డైరెక్టర్ సుధీర్ వర్మ.. చెప్పినట్టుగానే సినిమాను తీసి వారికి ఇచ్చాడట.

ఇక ఈ సినిమా రైట్స్‌ను ఆంధ్ర, నైజాం రీజియన్‌లో నాలుగున్నర కోట్లకు అమ్మేసిన నిర్మాతలు.. ఓవర్సీస్, కర్ణాటకలో కలిపి మరో రెండు కోట్లు రాబట్టుకున్నారట. ఇంకా సీడెడ్, శాటిలైట్ రైట్స్ నిర్మాతల దగ్గరే ఉండటంతో.. ఈ సినిమా ఓవరాల్‌గా రూ.18 కోట్ల బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

"పగ అనే వంటకాన్ని చల్లగా ఉన్నప్పుడు వడ్డిస్తే .. ఆ కిక్కే వేరు" అనే క్యాప్షన్ తో ఈ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో నిఖిల్ కి గుండె కుడివైపున ఉంటుంది. ఆవేశపడితే అతని ప్రాణాలకే ప్రమాదం. ఆ పరిస్థితుల్లో అతను ఒకరిపై రివేంజ్ తీర్చుకోవలసి వస్తుంది. ఆ పగని ఆయన ఎలా కూల్ గా తీర్చుకున్నాడనేదే సస్పెన్స్ అంటున్నారు.

నిర్మాత మాట్లాడుతూ...'స్వామి రారా' తరహాలో ఈ 'కేశవ' కూడా టాలీవుడ్‌లో ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది. నిఖిల్‌-సుధీర్‌వర్మ కాంబినేషన్, డిస్ట్రిబ్యూషన్‌లో మా సంస్థకున్న మంచి పేరు దృష్ట్యా బిజినెస్‌ పరంగా మంచి క్రేజ్‌ వచ్చింది. నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను 'ఏసియన్‌ ఫిల్మ్స్‌' సునీల్‌ నారంగ్‌ ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నారు. మిగతా ఏరియాల నుంచి కూడా ఫ్యాన్సీ రేట్లు ఆఫర్‌ చేస్తున్నారు. '' అన్నారు.

హీరో నిఖిల్‌ మాట్లాడుతూ - ''సుధీర్‌వర్మ, నేనూ మంచి స్నేహితులం. 'స్వామి రారా'తో మా ఇద్దరి కెరీర్‌ కొత్త టర్న్‌ తీసుకుంది. ఆ సినిమా తరహాలో 'కేశవ' కూడా సూపర్‌ హిట్టవుతుంది. సుధీర్‌వర్మ టేకింగ్‌ ఈ సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. నా క్యారెక్టర్‌ చాలా కొత్తగా డిజైన్‌ చేశాడు'' అన్నారు.

దర్శకుడు సుధీర్‌ వర్మ మాట్లాడుతూ - ''పగ, ప్రతీకారం నేపథ్యంలో సాగే సరికొత్త కథతో తెరకెక్కుతోన్న సినిమా ఇది. నిఖిల్, రితూ వర్మ, ఇషా కొప్పికర్‌ క్యారెక్టరైజేషన్‌లు చాలా కొత్తగా ఉంటాయి'' అన్నారు.

అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, అజయ్, బ్రహ్మాజీ, 'పెళ్లి చూపులు' ఫేమ్‌ ప్రియదర్శి, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్. , కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సుధీర్ వర్మ.నిర్మాత: అభిషేక్‌ నామా, సమర్పణ: దేవాన్ష్‌ నామా.

English summary
Nikhil is very much excited about his upcoming project “Keshava.” . This crazy film has released a trailer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu