»   » సెంటిమెంట్‌ చిత్రాల దర్శకుడు కన్నుమూత

సెంటిమెంట్‌ చిత్రాల దర్శకుడు కన్నుమూత

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: కన్నడ చిత్ర పరిశ్రమ ప్రముఖ దర్శకుడిని కోల్పోయింది. పలు విజయవంతమైన సెంటిమెంట్‌ సినిమాల్ని అందించిన దర్శకుడు డి.రాజేంద్రబాబు (62) కన్నుమూశారు. ఆదివారం ఉదయం బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. కన్నడతో పాటు తెలుగు సినిమాల్లో సహాయనటిగా ప్రేక్షకుల ఆదరణను చూరగొన్న సుమిత్ర ఆయన భార్య.

కుమార్తెలు ఉమాశంకరి (లక్ష్మి సినిమాలో వెంకటేష్‌కు పెద్ద చెల్లెలి పాత్ర), నక్షత్ర కూడా సినిమాల్లో నటిస్తున్నారు. 1951, మార్చి 30న జన్మించిన రాజేంద్రబాబు కుడువలక్క ఎలిజబెత్‌రాణి సినిమాతో హీరోగా కన్నడ చిత్రసీమను ప్రవేశించారు. ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ లభించలేదు. తరువాతి కాలంలో సాంకేతిక విభాగంలో చేరారు. ప్రముఖ దర్శకులు రాజేంద్రసింగ్‌ బాబు, కె.ఎస్‌.ఆర్‌.దాస్‌, వి.సోమశేఖర్‌ల వద్ద సహాయకుడిగా పనిచేశారు.

Noted Kannada director Rajendra Babu passed away

టైగర్‌ ప్రభాకర్‌ (కన్నడ ప్రభాకర్‌), జయమాల జంటగా నటించిన జిద్దు సినిమాతో స్వతంత్ర దర్శకుడిగా మారారు. 1984లో దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టిన ఆయన ఇప్పటి వరకు 50 సినిమాలకు దర్శకత్వం వహించారు. వీటిలో అధిక శాతం సినిమాలు ప్రేక్షకాదరణను చూరగొన్నాయి. ఈ కారణంగా ఆయన నిర్మాతను ఆదుకునే దర్శకుడుగా పేరుపొందారు.

ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు బ్లాక్ బస్టర్‌లుగా నిలిచి ఆయనకు విశేష పేరుప్రఖ్యాతులను తెచ్చిపెట్టాయి. 'నాను నన్న హెందతి', 'జిద్దు', 'యుగపురుష', 'రామాచారి', 'అన్నయ్య', 'హాలుంద తావరు', 'అప్పాజీ', 'జీవనది', 'జోడీ హక్కీ', 'కురవాన రాణీ', 'యార నన్ను చెలువ' 'హబ్బ', 'దిగ్గజారు', 'నంది', 'స్వాతి ముత్తు', 'ఆటో శంకర్', 'ఉప్పిదాదా ఎంబిబిఎస్', 'బిందాస్', 'ఆర్యన్' తదితర చిత్రాలతో ఆయన బాగా గుర్తింపును తెచ్చుకున్నారు.

వివిధ భాషల్లో ఘనవిజయం సాధించిన సినిమాల్ని కన్నడలోకి రీమేక్‌ చేశారు. ఒలవిన ఉడుగోరె, రామాచారి, రామరాజ్యదల్లి రాక్షసరు, హాలుండ తవరు, అప్పాజి, దిగ్గజరు, అమ్మ తదితర సినిమాలకు దర్శకత్వం వహించారు. ప్రముఖ హీరోతో కలిసి ఆయన రూపొందించిన హబ్బ సినిమా ఘనవిజయం సాధించింది. 1987లో హిందీ చిత్రం ప్యార్‌కర్కె దేఖో, మలయాళంలో రెక్తభిక్షకమ్‌ సినిమాకు దర్శకత్వం వహించారు. సెంటిమెంట్‌ సినిమాలకు ఆయన పెట్టిందిపేరు. మలయాళంలో ఓ సినిమాకు దర్శకత్వం వహించారు.

హ్యాట్రిక్‌ హీరో శివరాజ్‌కుమార్‌, లోక్‌సభ సభ్యురాలు రమ్య జంటగా రూపొందుతున్న ఆర్యన్‌ సినిమా చిత్రీకరణ సగంలో ఉండగానే ఆయన హఠాన్మరణం చెందారు. సోమవారం నుంచి షూటింగ్ కొనసాగాల్సి ఉండింది. కుచికో సినిమా కూడా చిత్రీకరణ దశలో ఉంది.

కన్నడ చిత్ర పరిశ్రమకు చేస్తున్న విశిష్ట సేవలకు గుర్తింపుగా ఆయనకు 2011లో కర్ణాటక ప్రభుత్వం జీవన సాఫల్య పురస్కారం, 2012లో పుట్టణ్ణ కణగాల్‌ స్మారక పురస్కారంతో సన్మానించింది. రాజేంద్రబాబు హఠాన్మరణం పట్ల సీఎం సిద్ధరామయ్యతోపాటు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఓ అద్భుత దర్శకుడిని కోల్పోయామని నటుడు, దర్శకుడు రమేష్‌ అరవింద్‌ పేర్కొన్నారు. రాజేంద్రబాబు మృతి కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటని నిర్మాత సా.రా.గోవిందు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ధట్స్ తెలుగు ఆయన మృతికి సంతాపం తెలియచేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటోంది.

English summary
D. Rajendra Babu (62), Kannada filmmaker and screenplay writer, died of a heart attack . He is survived by his wife and two daughters. According to his daughter Nakshatra, who is also an actor, Mr. Babu was rushed to a private hospital after he suffered a heart attack, where doctors declared him “brought dead.” He even directed Hindi, Malayalam and Telugu films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu