»   » ‘నాన్నకు ప్రేమతో’ చిత్ర యూనిట్‌కు నోటీసులు!

‘నాన్నకు ప్రేమతో’ చిత్ర యూనిట్‌కు నోటీసులు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల విడుదలైన ఓ పోస్టర్ కారణంగా ‘నాన్నకు ప్రేమతో' చిత్రం వివాదంలో పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి మైనారిటీ కమీషన్ నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా పోస్టర్ ముస్లింల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఫిర్యాదు అందడంతో చిత్ర నిర్మాతలు, నటీనటులు ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఫిర్యాదులకు సంబంధించి ఎందుకు మీపై చర్యలు తీసుకోకూడదో ఈ నెల 18లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

Nannaku Prematho

జనగామలో కేసు...
వరంగల్ జిల్లా జనగామ కోర్టులో కూడ ఈ సినిమాపై కేసు నమోదైంది. ఈ సినిమా పోస్టర్ ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని, అల్లా, మహ్మద్ ప్రవక్త పేర్లపై డాన్స్ చేస్తున్నట్లు పోస్టర్లు ఉన్నాయని మైనార్టీ యువజన సంఘం నాయకులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దర్శకుడు సుకుమార్ తో పాటు నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, జూ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, విజయ్ చక్రవర్తిల పేర్లను ఫిర్యాదులో పేర్కొన్నారు. మత సామరస్యాన్ని చాటి చెప్పే మన దేశంలో ఇలాంటి సంఘటనలు జరుగడం బాధాకరం, వెంటనే వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇప్పటికే క్షమాపణలు చెప్పిన నిర్మాత...
నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - '''నాన్నకు ప్రేమతో' చిత్రానికి సంబంధించిన ఒక సాంగ్‌ పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్‌ ముస్లిం సోదరుల మనో భావాలను కించపరిచే విధంగా వుందని మా దృష్టికి వచ్చింది. మేం అన్ని మతాల సంప్రదాయాలను గౌరవిస్తాం. అందుకే ఆ పోస్టర్‌లోని బ్యాక్‌గ్రౌండ్‌ని తొలగించి కొత్త పోస్టర్‌ను విడుదల చేశాం. అలాగే సినిమాలోని ఆ సాంగ్‌లో కూడా బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చేస్తున్నాం. మేం విడుదల చేసిన పోస్టర్‌ వల్ల ముస్లిం సోదరుల మనోభావాలు దెబ్బతిన్నందుకు వారికి మేం బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నాం. మేం ఏ మతానికీ వ్యతిరేకం కాదు. వారి మనోభావాలను దెబ్బతియ్యాలనికానీ, వారికి చెడు తలపెట్టాలని కానీ మా ఉద్దేశం కాదు. అన్ని మతాల వారికి స్వేచ్చ, గౌరవంగా జీవించే హక్కు వుంది. ఆ పోస్టర్‌ అనుకోకుండా వచ్చిందే తప్ప ముస్లిం సోదరులను బాధ పెట్టాలన్న ఉద్దేశంతో రిలీజ్‌ చేసింది కాదు'' అన్నారు.

యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ భారీ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌, సితార, అమిత్‌, తాగుబోతు రమేష్‌, గిరి, నవీన్‌ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫోటోగ్రఫీ: విజయ్‌ చక్రవర్తి, ఆర్ట్‌: రవీందర్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, పాటలు: చంద్రబోస్‌, డాన్స్‌: రాజు సుందరం, శేఖర్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సుధీర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్‌.

English summary
The State Minorities Commission has issued notices to the team of Telugu film 'Nannaku Prematho'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu