twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పదోతరగతిలో 'ఎన్టీఆర్‌' జీవితంపై పాఠం

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్‌.టి.రామారావు జీవిత చరిత్రను పదోతరగతిలో పాఠ్యాంశంగా చేర్చారు. ఈ ఏడాది నూతనంగా రూపొందించిన పదోతరగతి సాంఘికశాస్త్రంలో ఎన్టీఆర్‌ జీవితంలోని ముఖ్య అంశాలను పొందుపరిచారు.

    సాంఘికశాస్త్రంలోని 268వ పేజీలో అప్పట్లో ఢిల్లీ పెద్దలు చేస్తున్న చేష్టలకు వ్యతిరేకంగా పార్టీ పెట్టారని, అప్పటికే ఆయన ప్రముఖ కథానాయకుడిగా తెలుగు సినీరంగంలో ఉన్నారని వివరించారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతికాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని, అధికారంలోకి వచ్చాక పేద ప్రజల కోసం కిలో రూ.2 బియ్యం, మద్యపాన నిషేధం వంటి పలు కార్యక్రమాలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

    ఇక తెలుగువారు "అన్నగారు" అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు (1923 మే 28 - 1996 జనవరి 18) ఒక గొప్ప నటుడు, ప్రజానాయకుడు. తన పేరులోని పదాల మొదటి ఇంగ్లీషు అక్షరాలైన ఎన్.టి.ఆర్, ఎన్.టి.రామారావు గా కూడా ప్రసిద్ధుడైన ఆయన, తెలుగు, తమిళం మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. తన ప్రతిభను కేవలం నటనకే పరిమితం చేయకుండా పలు చిత్రాలను నిర్మించి, మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.

    మిగతా విశేషాలు...స్లైడ్ షోలో....

    ఆరాధ్య దైవం

    ఆరాధ్య దైవం

    విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా బిరుదాంకితుడైన ఆయన, అనేక పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి మెప్పించడమేగాక, రాముడు, కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగు వారి హృదయాలలో శాశ్వతంగా,ఆరాధ్య దైవంగా నిలచిపోయాడు.

    మొత్తం..

    మొత్తం..

    తన 44 ఏళ్ళ సినిమా జీవితంలో ఎన్.టి.ఆర్ 13 చారిత్రకాలు, 55 జానపద, 186 సాంఘిక మరియు 44 పౌరాణిక చిత్రాలు చేసారు.

    ఆవిర్భావం

    ఆవిర్భావం

    రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ రంగప్రవేశం చేసాడు. పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నాడు.

    రికార్డు

    రికార్డు

    ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా నిలచాడు.

    పిల్లలు...

    పిల్లలు...

    తారక రామారావు, బసవతారకం దంపతులకు 11 మంది సంతానం. పదకొండు మందిలొ ఏడుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ కుమారులు కాగా; గారపాటి లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి కుమార్తెలు.

    ఆ పేరే..

    ఆ పేరే..

    మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది.

    మీసాల నాగమ్మ

    మీసాల నాగమ్మ

    ఒకసారి రామారావును ఒక నాటకములో ఆడవేషం వేయమన్నాడు. అయితే రామారావు తన మీసాలు తీయటానికి 'ససేమిరా' అన్నాడు. మీసాలతోటే నటించడం వలన ఆయనకు "మీసాల నాగమ్మ" అనే పేరు తగిలించారు. 1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకంను పెళ్ళి చేసుకున్నాడు.

    ఆస్ది మొత్తం పోయినా...

    ఆస్ది మొత్తం పోయినా...

    రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్నికారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు.

    ఉద్యోగంలో చేరినా

    ఉద్యోగంలో చేరినా

    రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం ఆయన మద్రాసు సర్వీసు కమీషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు ఆయనకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.

    మక్కువతో..

    మక్కువతో..

    సినిమా రంగంపై మక్కువతో... సినిమా రంగంపై మక్కువతో మంగళగిరిలో సబ్‌ రిజిస్ట్రార్‌గా చేస్తోన్న ఎన్‌టిఆర్‌ చెన్నై ట్రేన్‌ ఎక్కేశారు. తొలి అవకాశం 'పల్లెటూరి పిల్ల' సినిమాకు వచ్చినా విడుదలైంది మాత్రం 'మనదేశం' చిత్రం. షావుకారు చిత్రం తరువాత నివాసాన్ని చెన్నై థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతానికి మార్చుకున్నారు.

    తిరుగులేని నటుడు

    తిరుగులేని నటుడు

    విజయావారి బ్యానర్‌పై వచ్చిన పాతళబైరవి, మల్లీశ్వరి, పెళ్లిచేసి చూడు, చంద్రహారం చిత్రాలు ఎన్‌టిఆర్‌ను తిరుగులేని నటుడిగా నిరూపించాయి. మాయాబజార్‌, లవకుశ, శ్రీకృష్ణార్జున యుద్దం, భీష్మ, భూకైలాష్‌, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీ వెంకటేశ్వరస్వామి మహత్యం, మహామంత్రి తిమ్మరుసు, దానవీరశూరకర్ణ చిత్రాలు విశ్వ విఖ్యాత ఎన్‌టిరామారావును మకుటం లేని మహారాజుగా నిలబెట్టాయి.

    విలక్షణ నటన

    విలక్షణ నటన

    కన్యాశుల్కం, గుండమ్మకథ, అడవిరాముడు, వేటగాడు, గజదొంగ, డ్రైవర్‌ రాముడు, సర్ధార్‌ పాపారాయుడు, కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి, బొబ్బిలిపులి చిత్రాల్లో ఆయన విలక్షణ నటనను ప్రేక్షకులు ఎప్పటికీ మరిచిపోరు. ఎన్‌టిఆర్‌ నటించిన చివరి చిత్రం మేజర్‌ చంద్రకాంత్‌. తన కెరీర్లో ఆయన దాదాపు 320కి పైగా చిత్రాల్లో నటించారు.

    తెలుగుదేశం పార్టీ

    తెలుగుదేశం పార్టీ

    చిత్ర సీమలో నెంబర్‌ వన్‌గా నిలిపిన అభిమానులకు, ప్రజలకు సేవ చేయాలని తలిచిన ఎన్‌టిఆర్‌ తెలుగుదేశం అనే రాజకీయపార్టీ స్థాపించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల కాలంలోనే వటవృక్షం లాంటి కాంగ్రెస్‌ పార్టీని మట్టికరిపించి ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తెలుగువాడి ఆత్మగౌరవం పేరుతో ప్రచార రథంపై సుడిగాలి పర్యటన చేశారు. అంతర్గత కుమ్ములాటలో కొట్టుమిట్టాడే కాంగ్రెస్‌ నాయకులు ఢిల్లీ అధిష్టానం చేతిలో కీలుబొమ్మలుగా మారడాన్ని ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఆయన చేసిన ప్రసంగాలు తెలుగువారి గుండెల్లో పౌరుషాగ్నిని నిలిపాయి.

    పేదవాడి కోసం...

    పేదవాడి కోసం...


    పేదవాడి కడుపు నింపే రెండు రూపాయలకు కిలోబియ్యం, సగం ధరకే చేనేత వస్త్రాలు, రైతన్నకు సబ్సిడీపై విద్యుత్‌ తదితర ప్రజాకర్షక, ప్రజాసంక్షేమ పథకాలు తిరుగులేని విజయాన్ని అందించాయి. ఆడిన మాట తప్పని "అన్న"ఎన్‌టిఆర్‌ అధికారంలో కొనసాగినంత కాలం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారు. నాదేండ్ల బాస్కర రావు నుంచి వెన్నుపోటు ఎదుర్కొన్న ఎన్‌టిఆర్‌ మరోసారి ప్రజా తీర్పు కోరి తిరుగులేని మెజార్టీ సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు.

    చిరస్మరణీయ స్థానం

    చిరస్మరణీయ స్థానం

    1994లో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాల్లో విజయ దుందుబి మోగించి అఖండ మెజార్టీతో అధికారం చేపట్టారు. తెలుగు దేశం పార్టీలో అంతర్గత పరిస్థితుల కారణంగా ఎన్‌టిఆర్‌ నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీఠాన్ని హస్తగతం చేసుకున్నారు. 1996 జనవరి 18న ఎన్‌టిఆర్‌ గుండెపోటుతో మరణించారు. భౌతికంగా ఆయన దూరమైనా ప్రజలు, అభిమానుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.

    English summary
    This year 10th syllabus has changed. In 10th social text book ,part 2 ( contemporary world and India )lesson no 19 ( Emerging political Trends
 1977 to 2000) page no 268 it is given about Sr.Nandamuri Taraka Ramarao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X