»   » అన్నయ్య చిరు ఒంటరి పోరుపై పవన్ కళ్యాణ్ ఆవేదన

అన్నయ్య చిరు ఒంటరి పోరుపై పవన్ కళ్యాణ్ ఆవేదన

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజకీయాల్లో అన్నయ్య చిరంజీవి ఒంటరి పోరు సాగిస్తున్నారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొమరం పులి ఆడియో క్యాసెట్ విడుదల కార్యక్రమంలో ఆయన ఆదివారం ఉద్వేగంగా మాట్లాడారు. అన్నయ్య చిరంజీవిని స్తుతిస్తూ... రెహమాన్‌ ని కీర్తిస్తూ సాగిన పవన్‌ ఇలా మాట్లాడారు - ''సాధారణంగా నేను సినిమా వేడుకలకు దూరంగా ఉంటాను. కానీ ఈసారి రెహమాన్‌ కారణంగానే ఈ వేడుకకు రావడానికి ఒప్పుకొన్నాను. రెండు ఆస్కార్‌ లు అందుకొన్న తరవాత ఆయన చేస్తోన్న మొదటి తెలుగు సినిమా ఇదే. అందుకొన్న రెండు ఆస్కార్‌ లను కూడా భగవంతుడికి పుష్పంలా సమర్పించుకున్నారు. ఆయనలో నాకు ఓ త్యాగరాజు, ఓ రామదాసు కనిపిస్తారు. మారాలంటే నువ్వు, నమ్మకు వీరాస్వామి ఈ పాటలు విని ఎంతో ఏడ్చాను. నా జీవితంలో జరిగిన వివిధ సంఘటనలు గుర్తొచ్చాయి. అన్నయ్య ఈ వేడుకకు రాకపోవడం ఎంతో లోటుగా ఉంది. సినిమాలు వదిలేసి రాజకీయాల్లో ఒంటరి పోరాటం చేస్తున్నారు. తప్పకుండా ఏదో ఒకరోజు అన్నయ్య ఉన్నత స్థానంలో ఉంటారు. అన్నయ్య మరో సినిమాలో నటించాలని ఉంది. మేమందరం స్వశక్తితో ఎదిగినవాళ్లం. మధ్య తరగతి నుంచి వచ్చాం. ఒకరిని తొక్కి రాలేదు. అందుకే ప్రజల కష్టాలు తెలుసు. ఇక సినిమా విషయానికొస్తే... నాకు రికార్డుల మీద నమ్మకం లేదు. ఈ రోజు రికార్డు రేపుండదు. మంచి కథలు రావడం లేదు.. అనే విరక్తితో ఉన్నప్పుడు సూర్య 'పులి' కథ వినిపించాడు. మేమందరం మిమ్మల్ని సంతోషపెట్టడానికి చేసిన ప్రయత్నం ఇది''. ఈ కార్యక్రమంలో నాగబాబు, అల్లు అరవింద్‌, శ్రియ, నికిషా పటేల్‌, సి.కల్యాణ్‌, సత్యరామ్మూర్తి, చంద్రబోస్‌, బి.గోపాల్‌, జయంత్‌ సి.పరాన్జీ, గణేష్‌బాబు, ఆనంద్‌సాయి, అరుణ్‌పాండ్యన్‌, తనికెళ్ల భరణి, తదితరులు పాల్గొన్నారు. పాటలు సోనీ మ్యూజిక్‌ ద్వారా విడుదలయ్యాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu