twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బర్త్‌డే బాయ్‌ మహేశ్‌బాబు

    By Staff
    |

    పోకిరి చిత్రం ద్వారా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాసిన ప్రిన్స్‌ మహేశ్‌బాబు పుట్టిన రోజు ఆగస్ట్‌ 9. ప్రస్తుతం వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి. అశ్వినీదత్‌, గుణశేఖర్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్న సైనికుడు చిత్రం షూటింగ్‌లో మహేశ్‌బాబు బిజీగా ఉన్నారు. తెలుగు చిత్రసీమలో తాజా సూపర్‌స్టార్‌గా అవతరించిన నేపథ్యంలో జరుపుకోనున్న ఈ పుట్టినరోజు అభిమానుల సందడి మధ్య వైభవంగా జరగబోతుందా? ఇదే ప్రశ్న మహేశ్‌బాబుని అడిగితే ఆయన సమాధానంగా చిన్నగా నవ్వారంతే!

    ఇంతవరకూ ఏ పుట్టినరోజునా కేక్‌లు కట్‌ చేయడం, సెలబ్రేట్‌ చేసుకోవడం లాంటివి లేవు. ఆ రోజున కేవలం మా కుటుంబ సభ్యుల మధ్య గడపడానికే ఇష్టపడతాను. ఇంతవరకూ అలాగే జరిగింది కాబట్టి రేపు పుట్టినరోజు ఏం చేయాలన్నది ప్లాన్‌ చేయలేదు అని చెప్పారు మహేశ్‌బాబు.

    పోకిరి చిత్రం ద్వారా క్లాస్‌, మాస్‌ అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరించడమే కాదు. అమితాబ్‌, చిరంజీవి, రజనీకాంత్‌ వంటి సూపర్‌, మెగాస్టార్‌ల అభినందనలు అందుకున్న మహేశ్‌బాబు తదుపరి చిత్రం సైనికుడు ఎలా ఉండబోతోంది?

    పెద్దగా ఏమీ ఉండదు అంటారు మహేశ్‌బాబు. పోకిరి చిత్రం చేసినప్పుడు ఇంత పెద్ద విజయం సాధిస్తుందని వూహించలేదు. నా పని నేను చేశానంతే. ఆ షూటింగ్‌ పూర్తయ్యాక సైనికుడు చిత్రంలో నిమగ్నమైపోయాను. నాకేదీ కాలుక్యులేటెడ్‌గా చేసే అలవాటు లేదు.

    పెళ్లయ్యాక మీకు కలిసొచ్చిందని అంతా అనుకుంటున్నారు. మీరూ అదే నమ్ముతున్నారా అన్న ప్రశ్నకూ ఆయన నవ్వేసి.. బహుశా పెళ్లయ్యాక నేను కొంత పరిణతి సాధించి ఉంటాను. అందువల్లనే ఏమో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాను. అంతమాత్రాన్న నేను చేసే అన్ని సినిమాలూ సూపర్‌హిట్లు సాధిస్తాయని చెప్పలేను. కానీ ఇప్పుడు గడించిన అనుభవంతో ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఇదివరకూ చేసిన చెత్త సినిమాల్లాంటివి మాత్రం ఇక నా నుంచి రావు అంటారు మహేశ్‌బాబు.

    సినిమా పరిశ్రమకు వచ్చి గడచిన ఏడేళ్లలో మీ సినిమాల జయాపజయాలను సమీక్షించుకుంటే మీరెలా స్పందిస్తారు అని అడిగినప్పుడు.. ఒక్కడు చిత్రంతో నేను మొదటిసారి భారీ సక్సెస్‌ చవిచూశానన్నారు. ఇప్పుడు పోకిరి అటువంటి ఫీలింగ్‌ కలిగిస్తోంది. కానీ నిజం చెప్పాలంటే.. మురారి, అతడు సినిమాలు చేస్తున్నప్పుడు మాత్రం బాగా ఎంజాయ్‌ చేశాను అంటారాయన.

    మీ కెరీర్‌లో నటశేఖర కృష్ణ గారి పాత్ర ఎంతవరకూ ఉంది అన్న ప్రశ్నకు .. నాన్నగారి ఫ్యాన్స్‌ మొదటి నుంచి నా వెన్నంటే ఉన్నారని, వారి ఆదరాభిమానాలే లేకుంటే పోకిరి వంటి సక్సెస్‌ సాధించడం సాధ్యం కాదని మహేశ్‌ వినమ్రంగా చెప్పారు. పోకిరి చిత్రం మొదటి షో చూసిన వెంటనే మా నాన్నగారు ఇది 40 కోట్లు వసూలు చేస్తుందని చెప్పారు. మమ్మల్ని ఎంకరేజ్‌ చేయడానికి ఆయన ఆ మాటలు అన్నారని అనుకున్నాం కానీ.. తర్వాత ఆయన మాటే నిజమైంది. అప్పుడు తెలిసింది ఆయన అంచనాలు ఎంత కచ్చితంగా ఉంటాయో. 330 సినిమాల అనుభవం ఆయనది. ఆయన వారసుడిగా ఆ స్థాయికి చేరుకోవడానికి నేనింకా చాలా దూరం ప్రయాణించాలి.. అని చెప్పారు మహేశ్‌బాబు.

    సైనికుడు చిత్రం విశేషాలు చెబుతూ నవంబర్‌లో విడుదల అవుతుంది. తరువాత సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ ప్రొడక్షన్స్‌ చిత్రం ఉంటుంది. దాన్ని వచ్చే ఏడాది మే 31, మా నాన్నగారి పుట్టినరోజునాడు విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఆ తరువాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో హరే రామ.. హరే కృష్ణ సినిమా ఉంటుంది. పూరీ జగన్‌తో మాత్రం ఎప్పుడు చేస్తానో ఇంకా నిర్ణయం కాలేదు. కానీ ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్‌ చేయాల్సి ఉంటుంది. మా కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయని మా అందరికీ తెలుసు. ఇవి కాకుండా దుర్గా ఆర్ట్స్‌ కోసం హేమంబర్‌ దర్శకత్వంలో ఒక సినిమా, రోజా మూవీస్‌ అర్జునరాజు నిర్మాతగా ఒకటి, దిల్‌ రాజు చిత్రం, ఎన్‌.వి. ప్రసాద్‌ - పరాస్‌ జైన్‌లు నిర్మించే చిత్రాలు, మరో రెండు ప్రాజెక్టులు కమిట్‌ అయ్యాను అని వివరించారు మహేశ్‌బాబు.

    మరిన్నికథనాలు

    Read more about: prince maheshbabu birthday boy
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X