»   » పెదరాయుడు: రజనీకాంత్ గురించి మోహన్ బాబు ఏమన్నారు?

పెదరాయుడు: రజనీకాంత్ గురించి మోహన్ బాబు ఏమన్నారు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: విశేష ప్రజాదరణ పొందిన పెదరాయుడి చిత్రాన్ని తాను రజనీకాంత్ వల్లనే నిర్మించానని కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు చెప్పారు. పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ఉద్వేగానికి గురి చేశాయి. సినిమా వచ్చి రెండు దశాబ్దాలవుతోంది. ఇప్పటికీ ఆ డైలాగులను తెలుగు ప్రజలు మరిచిపోలేరు.

ఈ సినిమాలో మోహన్ బాబు ద్విపాత్రాభియనం చేయగా, రజనీకాంత్ అతిథి పాత్ర పోషించారు. 1995 జూన్‌ 15న ఆ సినిమా విడుదలైంది. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్‌ పతాకంపై మోహన్‌బాబు స్వయంగా నిర్మించి ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో పెదరాయుడి తండ్రి పాపారాయుడిగా రజనీకాంత్‌ ఓ ప్రత్యేక పాత్రను చేసి అలరించారు. భానుప్రియ, సౌందర్య నాయికలు. కోటి సంగీతం అందించారు. ‘పెదరాయుడు' ప్రేక్షకుల ముందుకొచ్చి సోమవారం నాటికి సరిగ్గా రెండు దశాబ్దాలు. ఈ సందర్భంగా ఆ సినిమా విశేషాలను పత్రికలవారితో పంచుకున్నారు మోహన్‌బాబు.

"తమిళంలో 1994లో విడుదలైన ‘నట్టమై' సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమా చెయ్యడానికి ముఖ్య కారణం నా మిత్రుడు రజనీకాంత్‌. తమిళ వర్షన్‌ చూడమని, సినిమా బాగా ఆడుతుందని చెప్పాడు. చూసొచ్చి ‘బావుందిరా' అన్నాను. రీమేక్‌ రైట్స్‌ తీసుకోమని సూచించాడు. తన మాట కాదనకుండా రైట్స్‌ తీసుకొన్నా. అందులో ‘పాపారాయుడు' పాత్ర తానే చేస్తానని గెటప్‌ వేసుకొచ్చి చూపించాడు" అని మోహన్ బాబు వివరించారు.

Rajinikanth behind the Pedarayudu film: Mohan Babu

"చిత్రాన్ని రవిరాజా పినిశెట్టి మలచిన తీరు అద్భుతం" అని ఆయన మెచ్చుకున్నారు. "భారత, భాగవత, రామాయణాల్లో చెప్పిన విలువలనే ఈ సినిమాలో చెప్పాం. ఆ రోజుల్లో 25 వారాలు ఆడి రికార్డులు బద్దలుకొట్టింది అనడం అతిశయోక్తి కాదు" అని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

"కోటి సంగీత సారథ్యంలో అన్ని పాటలు చక్కగా కుదిరాయి. సినిమాకు నేపథ్య సంగీతం కూడా అంతే ఎసెట్‌గా నిలిచింది. ఇందులో ‘కదిలే కాలమా' పాట నా ఇంట్రెస్ట్‌తో చేయించా. నిర్మాతకు సినిమా గురించి కొన్ని కోరికలు ఉంటాయి. మంచి అనుకున్న సన్నివేశాన్ని జోడించే హక్కూ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే రవిరాజాతో మాట్లాడి ‘కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ' పాటను పెట్టించాను. అది ఎంతగానో పాపులర్‌ అయింది" అని ఆయన చెప్పారు..

రజనీకాంత్‌ ఈ సినిమా కోసం రెమ్యునరేషన్‌ అడగలేదని, తానూ ఇవ్వలేదని, ఆ తర్వాత డబ్బు రూపంలో కాకుండా తాను ఇచ్చిందేదో తను స్వీకరించాడని చెప్పారు. షూటింగ్‌ కోసం తాను అడగకపోయినా డబ్బిచ్చాడని, తర్వాత వెనక్కి ఇచ్చేశానని, అలాంటి స్నేహితుడు ఉండడం అదృష్టంగా భావిస్తానని ఆయన చెప్పారు.

"నా సంస్థ నుంచి వరుసగా వచ్చిన ఎనిమిది హిట్‌ సినిమాలో ఇదొకటి. ‘పెదరాయుడు' సినిమా విడుదలై 20 వసంతాలు పూర్తి చేసుకుదంటే ఆశ్చర్యంగా ఉంది. కాలం అలా గడిచిపోయింది అంతే. ఆ రోజుల్లో నందమూరి తారకరామారావు సమక్షంలో ఈ సినిమా 200 రోజుల వేడుక చేశాం. ఎన్ని లక్షలమంది హాజరయ్యారో అందరికీ తెలిసిందే. నా కెరీర్‌లో ఇదొక మైలురాయిగా చెబుతాను" అని మోహన్ బాబు ఆనందంగా చెప్పారు.

English summary
Collection King Mohan Babu said that he produced Pedarayudu film with the suggestion of Rajinikanth.
Please Wait while comments are loading...