»   » నన్ను నరకం దాకా తీసుకెళ్లింది :హీరో రామ్

నన్ను నరకం దాకా తీసుకెళ్లింది :హీరో రామ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'చాలా కష్టపడి చేసిన సినిమా. కానీ... ఫలితం లేకపోయిందే' అని ఎక్కువగా బాధపడిన సందర్భం ఉంది. ప్రతి సినిమానీ కష్టపడే చేస్తాం. అయితే సినిమా ఫలితానికీ, కష్టానికీ సంబంధం ఉండదు. 'ఒంగోలుగిత్త' ఈ మధ్యే చేశాను కాబట్టి నాకు బాగా గుర్తుంది. ఒక రకంగా ఆ సినిమా నన్ను నరకం దాకా తీసుకెళ్లి ట్రైలర్‌ చూపించి పంపింది అన్నారు హీరో రామ్. వెంకటేష్‌తో కలసి 'మసాలా'లో నటించాడు. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోందీ చిత్రం. ఈ సందర్భంగా రామ్‌ ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడారు.

వెంకటేశ్, రామ్ హీరోలుగా నటించిన 'మసాలా' చిత్రం సెన్సార్ పనుల్ని పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. డి. రామానాయుడు సమర్పణలో సురేశ్ ప్రొడక్షన్స్ ప్రై. లిమిటెడ్, శ్రీ స్రవంతి మూవీస్ పతాకాలపై డి. సురేశ్‌బాబు, రవికిశోర్ సంయుక్తంగా నిర్మించారు. అంజలి, షాజన్ పదంసీ నాయికలు. బాలీవుడ్ సూపర్‌హిట్ ఫిల్మ్ 'బోల్ బచ్చన్'కు ఇది రీమేక్.

రామ్ మాట్లాడుతూ "టైటిల్‌కు తగ్గట్లే ఇది ఎంటర్‌టైన్‌మెంట్ మేళవించిన మంచి మసాలా చిత్రం. ఆద్యంతం వినోదాన్ని పంచే ఈ చిత్రంలో చక్కని ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. వెంకటేశ్, రామ్ పాత్రలు ప్రేక్షకుల్ని బాగా అలరిస్తాయి. తమన్ సంగీతం సమకూర్చగా ఇటీవల విడుదల చేసిన పాటలకు చాలా చక్కని స్పందన లభించింది. చిత్రీకరణ పరంగానూ అవి బాగా ఆకట్టుకుంటాయి. రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్లు మాస్ ప్రేక్షకులతో పాటు ఆబాల గోపాలాన్ని అలరించడం ఇందులోని ప్రత్యేకత. ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

పర్శనల్,ప్రొఫిషనల్ లైఫ్ తో కూడిన ఇంటర్వూ స్లైడ్ షోలో...

కథల ఎంపికలో....

కథల ఎంపికలో....

ఒక సక్సెస్ లభించగానే... అదే తరహాలో మరో సక్సెస్ అందుకోవాలి, వీలైనంతగా మార్కెట్‌ పెంచుకోవాలి అనే తాపత్రయం నాలో ఎప్పుడూ ఉండదు. 'కందిరీగ' పక్కా వాణిజ్య సూత్రాలతో తెరకెక్కిన చిత్రం. ఆ తరహాలో మరిన్ని సినిమాలు చేసి విజయాల శాతం పెంచుకోవచ్చు. కానీ ఎప్పుడూ ఒకే దారిలో ప్రయాణం చేయడం నాకు ఇష్టముండదు. అందుకే ఎప్పటికప్పుడు కొత్త తరహా కథల కోసం ప్రయత్నిస్తుంటా. సరైన కథ దొరక్కపోతే కొన్నాళ్లు ఖాళీగా ఉన్నా ఫర్వాలేదనుకొంటా అన్నారు రామ్.

నైట్ పార్టీల గురించి చెప్తూ...

నైట్ పార్టీల గురించి చెప్తూ...

''పార్టీలు మనకి నచ్చవు . రిలాక్సేషన్‌ కోసమే పార్టీలు అంటుంటారు. నాకైతే సినిమాల కంటే పార్టీల మీదే ఎక్కువ టెన్షన్‌. అక్కడికి వెళ్లాలి, కూర్చోవాలి, మాటలు చెప్పాలి... ఇవన్నీ నాకు నచ్చవు. పుట్టినరోజు వేడుకలకు కూడా నేను వెళ్లను. అందుకే బయట చాలా తక్కువగా కనిపిస్తుంటా. చిత్ర పరిశ్రమలో అందరితోనూ నేను స్నేహంగా ఉంటాను. నాకు బాగా దగ్గరి స్నేహితులు అంటే మాత్రం రెండో తరగతి నుంచి నాతో కలిసి చదువుకొన్నవాళ్లే. ఎక్కడికెళ్లినా వాళ్లతోనే'' అన్నారు రామ్.

గ్యాప్ తీసుకోవటం గురించి...

గ్యాప్ తీసుకోవటం గురించి...

నేను చిన్న వయసులో నేను పరిశ్రమలోకి అడుగుపెట్టాను. మరో పదిపదిహేనేళ్ల తర్వాత 'నా మార్కెట్‌ని ఈ స్థాయిలో పెంచుకొన్నాను' అని నాకు నేను సంతృప్తి చెందడం కంటే... ఫలానా వయసులో చేయాల్సిన ఫలానా పాత్రని అవనసరంగా కోల్పోయానే అనే బాధే నన్ను ఎక్కువగా వేధిస్తుంటుంది. అందుకే ఈ వయసులో ఏ పాత్రలు చేయాలో అవన్నీ చేయాలనుకొంటున్నాను. మరో పదేళ్ల తర్వాత ఇంతకంటే మంచి మార్కెట్‌ని నేను సొంతం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు చేయాల్సిన పాత్రల్ని ఇంకొన్నేళ్లకు చేయలేను కదా అన్నారు.

పూర్తి నిరాశ...

పూర్తి నిరాశ...

'ఒంగోలుగిత్త' గురించి వివరిస్తూ... మిర్చి యార్డులో దగ్గి, తుమ్మి, గాయాలపాలై... ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆ సినిమా చేశాను. చివరలో ఆస్పత్రికి సంబంధించిన కొన్ని సన్నివేశాలుంటాయి. అందులో నేను కుంటుతూ కనిపిస్తాను. అప్పుడు నిజంగానే నాకాలికి గాయమైంది. అంత కష్టపడి చేసిన ఆ సినిమా నిరాశ కలిగించింది. నా వరకు ప్రతి సినిమా ఓ పాఠమే అనుకొంటా అన్నారు.

కెరీర్ గురించి ....

కెరీర్ గురించి ....

స్టాక్‌ మార్కెట్‌లాగా అనిపిస్తుందండీ. ఒక సినిమా విజయం సాధిస్తే, మరోసారి పరాజయం ఎదురవుతుంటుంది. ఒక రకంగా ఇదీ మంచిదే అనిపిస్తుంది. జయాపజయాల భారం జీవితంపై ఎక్కువగా పడదు. ఇప్పుడు నా సినిమా ఎలాంటి ఫలితం సాధించినా... దాని గురించి ఒకట్రెండు రోజులే ఆలోచిస్తా. ఆటుపోట్లకు ఎదురొడ్డి నిలుస్తున్నా కాబట్టి... భవిష్యత్తులో ఇది నాకు బాగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నా అన్నారు.

లేటెస్ట్ ఫిల్మ్

లేటెస్ట్ ఫిల్మ్

'మసాలా' ఘాటు అదిరిపోతుంది. నవ్వించడమే పనిగా పెట్టుకొని చేసిన సినిమా ఇది. థియేటర్‌లో కూర్చున్నంతసేపూ ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. రెండు గంటలపాటు నవ్వుతూనే ఉంటే కడుపుబ్బిపోయి నొప్పి పుడుతుంది కదండీ (నవ్వుతూ), అందుకే మధ్యలో ఓ పది నిమిషాలు విరామం ఇస్తాం. ఆ తర్వాత మామూలే.

ఆలోచించాల్సి వచ్చింది...

ఆలోచించాల్సి వచ్చింది...

హిందీ వాతావరణం వేరు. అక్కడ తెరపై హీరో ఏం చేసినా, ఎలాంటి పాత్రలో కనిపించినా వినోదం కోసమే అనుకొంటారు ప్రేక్షకులు. ఇలాంటి పాత్రలు చూడటానికి సిద్ధంగా ఉంటారు. తెలుగులో అలా కాదు. మన ప్రేక్షకులు ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకొంటారు. తమకు నచ్చిన కథానాయకుడిని తెరపై ఎప్పుడూ ఒక 'హీరో'లాగే చూడాలనుకొంటారు. అందుకు భిన్నంగా కనిపిస్తే అస్సలు ఒప్పుకోరు. అందుకే కాస్త ఆలోచించా. ఇటీవల తెలుగులో ఏ హీరో చేయని పాత్ర ఇది. మళ్లీ ఎవరైనా చేస్తారో లేదో కూడా నాకు తెలియదు.

తొలి రీమేక్...

తొలి రీమేక్...

హిందీ చిత్రం 'బోల్‌బచ్చన్‌' ఆధారంగా రూపొందిన సినిమా ఇది. మీరిలా ఓ రీమేక్‌ చిత్రంలో నటించడం ఇదే తొలిసారి. ప్రశాంతంగా అనిపించింది. ఇంత స్పష్టతతో నేను ఎప్పుడూ ఏ సినిమా చేయలేదు. ఒక సన్నివేశం తర్వాత మరో సన్నివేశం. ఎక్కడా గందరగోళం లేకుండా పనిచేశాం. నాకైతే చాలా సౌకర్యంగా అనిపించింది. వ్యక్తిగతంగా మాత్రం నాకు రీమేక్‌ సినిమాకంటే నేరుగా ఓ కొత్త కథలో నటించడమే ఇష్టం.

శివ శంకర్ మాస్టర్ సహకారంతో..

శివ శంకర్ మాస్టర్ సహకారంతో..

'మసాలా' లో రెండో రకం పాత్ర కోసం ప్రత్యేకంగా ఏమైనా తర్ఫీదు పొందటంలాంటిదేమీ లేదు . అయితే ఆ పాత్ర విషయంలో శివశంకర్‌ మాస్టర్‌ నాకు బాగా సహకరించారు. సినిమాలో ఆ పాత్రపై ఓ పాట ఉంటుంది. దాంతోనే సినిమా చిత్రీకరణ ప్రారంభించాం. శివశంకర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చడంతో నా పని సులువైంది. సినిమా మొత్తం ఆయన్ని అనుకరిస్తూ నటించా. రెండు కోణాల్లో సాగే పాత్ర అది. రెండో రకం పాత్ర కాస్త తేడాగా ఉంటుంది. దీంతో ఈ సినిమా చేద్దామా వద్దా? అని రెండు రోజులు ఆలోచించాను. ప్రేక్షకులకు కొత్త తరహా వినోదాన్ని అందించొచ్చనే అభిప్రాయంతో చివరికి సినిమా చేయాలని నిర్ణయించుకొన్నా. ఈ పాత్రని హిందీలో అభిషేక్‌బచ్చన్‌ పోషించారు. సినిమా పూర్తయ్యాక తెరపై నన్ను నేను చూసుకొన్నప్పుడు నటుడిగా ఎంతో సంతృప్తిచెందా. ఈ సినిమా చేయకపోతే ఒక విభిన్నమైన పాత్రని కోల్పోయేవాడిననిపించింది.

వెంకటేష్‌తో కలిసి....

వెంకటేష్‌తో కలిసి....

వెంకటేష్ గారితో చేయటం ...అదొక గొప్ప అనుభవం. నేను పుట్టకముందే వెంకటేష్‌గారు నటుడు. తెలుగు చిత్ర పరిశ్రమకు నాలుగు మూల స్తంభాలుంటే అందులో వెంకీగారు ఒకరు. వాళ్లు వేసిన పునాదులపైనే మా తరం కథానాయకులు ప్రయాణం చేస్తున్నాం. మేమిద్దరం కలిసి ఓ సినిమాలో నటించడం ఎంతో సంతృప్తినిఇచ్చింది. ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదిస్తూ చేశాం. విజయ్‌భాస్కర్‌గారు చిత్రాన్ని చాలా బాగా తీర్చిదిద్దారు.

లవ్ లెటర్స్...

లవ్ లెటర్స్...

''తొలి ప్రేమ లేఖ ఎప్పుడొచ్చిందో పక్కాగా గుర్తులేదు కానీ... దాదాపుగా కెరీర్‌ ప్రారంభం నుంచే ప్రేమలేఖలు అందుకొంటున్నా. మనకి సంబంధం లేని వ్యక్తులు మనల్ని ప్రేమించడమంటే ఆషామాషీ కాదు కదండీ? మన తెలుగు సినిమాల్లోనే... హీరోయిన్ కి ఐ లవ్‌ యూ అని చెప్పగానే లాగి ఒకటి చెంపపై ఇస్తుంది. అయినా... ప్రేమిస్తే తప్పేంటి? దానికంటే హద్దుమీరి ప్రవర్తిస్తే తప్పు. అందుకే నేను ఖాళీ సమయాల్లో ప్రేమలేఖల్ని తీరిగ్గా చదువుతుంటాను. మనల్ని ఒకరు ఇష్టపడుతున్నారంటే అదొక గొప్ప అభినందనగా భావిస్తుంటా. ఇక పెళ్లి గురించి అంటారా? హిట్టు, ఫ్లాపు, పెళ్లి ఇవన్నీ మన చేతుల్లో ఉండవు. జరిగిపోయాక... అరే అయిపోయిందా అనుకోవాలంతే ''.

తమిళంలోనూ...

తమిళంలోనూ...తమిళంలో చేయబోతున్నా. తెలుగులో చిన్న బడ్జెట్‌తో కూడిన సినిమాల్లో నటిస్తానో లేదో తెలియదు కానీ... తమిళంలో మాత్రం తప్పకుండా చేస్తాను. ఇక్కడితో పోలిస్తే అక్కడ వైవిధ్యమైన చిత్రాలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఇక హిందీలో అయితే 'రెడీ' తర్వాత అవకాశాలు వచ్చాయి. అప్పట్లో చేయలేకపోయా. మంచి కథ దొరికితే అక్కడ కూడా నటిస్తా. ప్రస్తుతానికి తెలుగులో సినిమా కోసం కథలు వింటున్నా. మంచి స్క్రిప్ట్‌ అనిపిస్తే కొనేస్తున్నాను. ఆ తర్వాత దర్శకులను ఎంచుకొని వాటిని తెరపైకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నాను.

English summary
Masala is an upcoming Indian Telugu Movie.Directed by K.Vijaya Bhaskar and Produced by Daggubati Suresh Babu, Sravanthi Ravi Kishore under Suresh Productions, Sravanthi Movies. Music by S.Thaman. Victory Venkatesh and Ram Pothineni, Anjali and Shazahn Padamsee plays female lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu