For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'కృష్ణం వందే జగద్గురుమ్‌' ఆడియో విడుదల విశేషాలు

  By Srikanya
  |

  హైదరాబాద్ : రానా, నయనతార జంటగా నటించిన చిత్రం 'కృష్ణం వందే జగద్గురుమ్‌'. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఆడియో విడుదల ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని సినీమ్యాక్స్‌లో జరిగింది. ఈ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్ తొలి సీడీని ఆవిష్కరించారు. ఎస్‌.ఎస్‌.రాజమౌళి స్వీకరించారు. ఆడియో ఆవిష్కరణ అనంతరం డి.రామానాయుడు మాట్లాడుతూ ''ఏం చేసినా నిజాయతీతో చేయాలని రానాతో చెబుతుంటాను. 'లీడర్‌' సమయంలో రానాను చూసి సంతోషపడ్డాను. తెలుగులో అమితాబ్‌ అంతటివాడివి కావాలని అప్పుడే అన్నాను. ఈ సినిమా ట్రైలర్‌ చూశాక నా ఆశ నెరవేరుతుందనే నమ్మకం కలిగింది'' అన్నారు.

  దర్శకుడు క్రిష్‌ మాట్లాడుతూ ''రెండు సంవత్సరాల క్రితం మా గురువు సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పిన చిన్న మాటను కథగా అల్లుకొన్నాను. రానా మాత్రమే చేయదగిన సినిమా ఇది. అతని ఉచ్ఛారణ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో ఓ పెద్ద సంభాషణ ఉంది. దాన్ని సింగిల్‌ టేక్‌లో చెప్పి సెట్‌లో అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రంలో తొమ్మిది నిమిషాల పాటు సాగే ఒక పాట ఉంది. అది దశావతార రూపకంగా వస్తుంది. అలాంటి పాట నా సినిమాలో ఉన్నందుకు గర్వంగా ఉంది. 'ఎవరు వింటారు ఈ పాట' అని కొంతమంది నన్ను ప్రశ్నించారు. ఆ పాట వినేవాళ్ల కోసమే ఈ సినిమా. తొమ్మిది నిమిషాలు మాత్రమే ఇందులో నాటక నేపథ్యం ఉంటుంది. మిగిలినదంతా ఓ అడ్వంచర్. చిరంజీవికి ఒక 'ఖైదీ'లా రానాకి 'కృష్ణం వందే జగద్గురుమ్' నిలిచిపోతుంది. ఇది విలువలతో కూడుకున్న సినిమా. 'భగవద్గీత'లోని సారాంశం ఈ చిత్రం ప్రధాన ఇతివృత్తం'' అన్నారు.

  రాజమౌళి మాట్లాడుతూ ''ట్రైలర్‌లో రానా వేసిన ఒక్కో గెటప్‌ చూస్తుంటే నా అంచనాలు పెరిగిపోయాయి. దేవుడంటే.. రాత కాదు సాయం అని చెప్పడం బాగుంది. ఈ సినిమా కోసం నేను కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. రానాని ఎలా ఉపయోగించుకోవాలో వందశాతం అలాగే ఉపయోగించుకొన్నారు''అన్నారు. నయనతార మాట్లాడుతూ ''సినిమా పట్ల ప్రేమ ఉన్న దర్శకుడు క్రిష్‌. అతని సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తెలుగులో నా మొదటి సినిమా వెంకటేష్‌తో చేశాను. మళ్లీ నా రీ ఎంట్రీ రానాతో జరగడం ఆనందంగా ఉంది'' అన్నారు.

  సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ '' గమ్యం నుంచి ప్రయాణం మొదలై, వేదంతో ఊపందుకుని, ఇప్పుడు 'కృష్ణం వందే జగద్గురుమ్' అంటున్నాడు. తన ఆర్తిని అద్భుతంగా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకు తెలిసి సినిమాలు మూడు రకాలు. ఒకటి గొప్పది, రెండోది మంచిది, మూడోది చెత్తది. ఇది గొప్ప సినిమా కేటగిరిలోది. దశావతార రూపకం రాశాను. ఈ పాట రాయడానికే 28యేళ్ల నుంచి ఈ రంగంలో ఉంటున్నానేమో అనిపించింది. ఈ పాట తర్వాత మరే పాట రాయలేనేమో, రాయనవసరం లేదేమో.. అనిపిస్తోంది. నేనెప్పుడూ పాటను పదాలతో రాయలేదు. ఆత్మస్పందనతో రాశాను. దైవత్వానికి నిర్వచనం చెప్పే సినిమా ఇది'' అన్నారు.

  దగ్గుపాటి రానా మాట్లాడుతూ.. ''చేసిన కథను చేయకుండా ప్రేక్షకులకు ఇంకేదైనా ఇవ్వాలని కొత్త తరహా సినిమాలు చేశాను. రెండున్నర సంవత్సరాలపాటు నాలో నేను యుద్ధం చేసుకొంటే వచ్చిన పాత్ర ఇది. నా గత చిత్రం ఫలితం నుంచి ప్రేక్షకులకు ఇంకా ఏదో కావాలని అనిపించింది. అప్పుడు తాత అన్నారు.. 'వాళ్లకి కావల్సింది తెలుగు సినిమారా' అని. ఇది అసలు సిసలైన తెలుగు సినిమా'' అన్నారు. ''రానా ఎంతో పరిణతితో నటిస్తున్నాడు. క్రిష్‌ ఓ మంచి చిత్రం తీశాడనే నమ్మకం నాకు కలిగింది. మంచి సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది'' అన్నారు వెంకటేష్‌. కోట శ్రీనివాసరావు, దిల్‌రాజు, సురేష్‌బాబు, మణిశర్మ, ఎల్బీ శ్రీరామ్‌, పోసాని కృష్ణమురళి తదితరులు పాల్గొన్నారు.

  English summary
  
 Rana's new film, Krishnam Vande Jaga dgurum, had its music launch on Sunday evening (Oct 7th) in Hyderabad. Venkatesh unveiled the music and Rajamouli graced the event as the other chief guest. Dil Raju, D Ramanaidu, Sirivennela, Posani and others were also present. Music is by Manisharma.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X