Sirivennela death దిగ్గజ రచయిత మరణం వెనుక కారణాలు ఇవే.. వెల్లడించిన కిమ్స్ ఎండీ
లెజెండరీ సినీ గేయరచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆకస్మిక మరణంతో తెలుగు సినిమా పరిశ్రమ మూగబోయింది. దశాబ్దాలుగా సినీ సాహిత్యంతో తెలుగు వారి గుండెల్లో గూడుకట్టుకొన్న దిగ్గజ రచయిత ఇకలేరనే విషయంతో సినీ ప్రముఖులంతా తల్లడిల్లిపోతున్నారు. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించే సిరివెన్నెల భౌతికంగా దూరం కావడం వెనుక కారణాలను కిమ్స్ వైద్యులు వెల్లడించారు. ఆయన మరణం వెనుక అసలు కారణం ఏమిటంటే..

నవంబర్ 24వ తేదీన న్యూమోనియాతో
కిమ్స్ వైద్యులు వెల్లడించిన ప్రకారం.. సిరివెన్నెల సీతారామశాస్త్రి నవంబర్ 24వ తేదీన న్యూమోనియాతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో చేరారు. ఆ రోజు నుంచి ఆయనను ఊపిరితిత్తులకు సపోర్ట్ అందిస్తూ ఎక్మో ద్వారా ఐసీయూలో చికిత్స అందించారు. నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణతో చికిత్స జరిగింది. చికిత్స స్పందిస్తూ.. కోలుకొన్నట్టే కనిపించారు అని వైద్యులు తెలిపారు.

మంగళవారం మధ్యాహ్నం కన్నుమూత
కానీ మంగళవారం మధ్యాహ్నం తర్వాత సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ సంబంధింత సమస్యలతో ఆయన మధ్యాహ్నం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారు అని కిమ్స్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సంబిత్ సాహు ఓ ప్రకటనలో అధికారికంగా తెలిపారు.

క్యాన్సర్ వ్యాధి కారణంగా
సిరివెన్నెల ఆకస్మిక మరణానికి కారణాలను కిమ్స్ హాస్పిటల్ ఎండీ భాస్కరరావు వెల్లడిస్తూ.. ఆరేళ్ల క్రితం క్యాన్సర్ వ్యాధి కారణంగా సగం ఊపిరితిత్తులను తీసివేశారు. తర్వాత బైపాస్ పరీక్ష కూడా జరిగింది. ఇటీవల మరో ఊపిరితిత్తికి క్యాన్సర్ వ్యాధి సోకడంతో అందులో సగం తీసేశారు. ఆ సర్జరీ తర్వాత సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు రోజులు బాగున్నారు అని చెప్పారు.

45 శాతం ఊపిరితిత్తులను తీసివేశాం
అయితే ఊహించని విధంగా సిరివెన్నెలకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయనను కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. కిమ్స్‌లో చికిత్స అందిస్తున్న సమయంలో బాగా స్పందించి కోలుకొన్నట్టు కనిపించారు. 45 శాతం ఊపిరితిత్తులను తీసివేశాం కాబట్టి.. మిగితా 55 శాతం భాగానికి ఇన్‌ఫెక్షన్ వచ్చింది. ఆక్సినైజన్ కోసం ఎక్మో మిషన్ మీద పెట్టాం. గత ఐదు రోజులు నుంచి ఎక్మో మిషిన్‌పై ఉంచి చికిత్స అందించాం అని భాస్కరరావు తెలిపారు.
Recommended Video
కిడ్నీ డామేజ్ కావడంతో
ఎక్మో మిషన్‌పై చికిత్స అందుతున్న సమయంలో క్యాన్సర్, పోస్ట్ బైపాస్ సర్జరీ సమస్యలు తలెత్తాయి, కిడ్నీ డామేజ్ అయింది. దాంతో శరీరమంతా ఇన్‌ఫెక్షన్ సోకింది. దాంతో మంగళవారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో మరణించారు అని కిమ్స్ ఎండీ భాస్కరరావు వివరించారు.


Click it and Unblock the Notifications











