కంటతడి పెట్టిస్తున్న సిరివెన్నెల చివరి ఫోన్ కాల్.. ఆ యువ దర్శకుడితో సరదాగా, చలాకీగా..
మహా రచయిత, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి ఈ లోకాన్ని వీడి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో యావత్ తెలుగు సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ఆయన పాటతో ఉన్న రిలేషన్‌ను గుర్తుచేసుకొంటున్నారు. ఆయన చలాకీతనం, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆయన ఇక లేరంటే నమ్మలేకపోవడమే కాకుండా ఆ దుర్వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే సిరివెన్నెల చివరి ఫోన్ కాల్‌గా భావిస్తున్న ఆడియో మీడియాలో వైరల్ అయింది.. ఆ వివరాల్లోకి వెళితే..

సర్జరీకి ముందు కూతురు ఇంటిలో
తాజాగా తన ఆరోగ్యం సహకరించడం లేదని తెలిసినా తర్వాత జోకులు వేస్తూ యువ దర్శకుడు కూచిపూడి వెంకట్‌తో మాట్లాడిన విషయాలు అందర్నీ కంటతడి పెట్టేలా చేస్తున్నాయి. వాసు చిత్ర దర్శకుడు కూచిపూడి వెంకట్‌తో సీతారామశాస్త్రి మాట్లాడిన ఫోన్ కాల్‌లో తాను సర్జరీకి ముందు మణికొండలోని తన కూతురు ఇంటిలో ఉంటున్నాడు చెప్పారు. వెంకట్ కూచిపూడి ఫోన్ చేయడంతో ఎలా ఉన్నావు అమ్మా అంటూ పలకరించాడు.

సోమవారం ఆపరేషన్ ఫిక్స్..
ఆ తర్వాత కూచిపూడి వెంకట్‌తో సిరివెన్నెల మాట్లాడుతూ.. సోమవారం నాడు ఆపరేషన్ ఫిక్స్ అయింది. నాకు ఊపిరితిత్తులకు సర్జరీ జరుగుతుంది. సర్జరీ తర్వాత డిసెంబర్ మొత్తం నేను విశ్రాంతిలోనే ఉంటాను అని సిరివెన్నెల చెప్పారు. అయితే ఏం జరిగింది సార్ అని కూచిపూడి వెంకట్ అడిగితే.. నీకు తెలియదా అంటూ 2015లో నాకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది అని తెలిపారు.

ఎడమవైపు ఊపిరితిత్తులను తీసేశారంటూ
వెంకట్‌తో మాట్లాడుతూ.. 2015లో క్యాన్సర్ సోకడంతో ఎడమవైపు ఊపిరితిత్తులను తీసేశారు. ఇప్పుడు కుడివైపు వచ్చింది. అయితే ఇచ్చేస్తున్నాను కదా అని వాడు మొత్తం తీసుకొంటున్నాడు. ఇచ్చేవాడినే కదా అడుగుతుంటాడు. అందుకే ఈసారి కుడివైపు ఊపిరితిత్తును కూడా ఇవ్వడానికి సిద్దమయ్యాను అని సరదాగా నవ్వుతూ సిరివెన్నెల తన విషయాలను షేర్ చేసుకొన్నాను.

నీ సినిమాకు పాటలు రాయాలి కదా..
నీ సినిమా వాసుకు పాటలు రాయాలి కదా.. ఈనెల, రెండు నెలల్లో రాయలేదు కదా.. రాయలేకపోతే చూడు. నేను రెండు తీసుకొన్నాను. తిరిగి ఇవ్వను అంటూ హాహా అంటూ నవ్వాడు. మళ్లీ జనజీవన స్రవంతిలోకి వచ్చాక నేను రాస్తాను అని సిరివెన్నెల చాలా చలాకీగా నవ్వుతూ ఫోన్‌లో సంభాషించారు. అయితే స్మోకింగ్ మానేశారా సార్ అని వెంకట్ అడిగిన ప్రశ్నకు ఎప్పుడో మానేశాను అంటూ సరదాగా సమాధానం చెప్పారు. ఈ ఆడియో సిరివెన్నెల పాజిటివ్ నేచర్‌కు సాక్ష్యంగా మిగిలింది.
Recommended Video

బుధవారం మహాప్రస్థానంలో అంత్యక్రియలు
ఇదిలా ఉండగా, సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్ధీవ దేహాన్ని కిమ్స్ హాస్పిటల్‌లోనే ఉంచారు. బుధవారం తెల్లవారు జామున 5 గంటలకు హాస్పిటల్ నుంచి ఆయన భౌతిక కాయాన్ని తీసుకెళ్తారు. 7 గంటల తర్వాత సిరివెన్నెల దేహాన్ని తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ప్రజలు, ప్రముఖులు, సినీ నటులు సందర్శనార్థం పెడుతున్నట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆ తర్వాత మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు అని సన్నిహితులు చెప్పారు.


Click it and Unblock the Notifications











