»   » ఫిల్మ్ చాంబర్ వద్ద తెలంగాణ లొల్లి

ఫిల్మ్ చాంబర్ వద్ద తెలంగాణ లొల్లి

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ డైరెక్టర్‌ అసోసియేషన్‌లో తెలంగాణ ప్రాంతంవారికి అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఫిలింఛాంబర్‌ ఎదుట తెలంగాణవాదులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫిలింఛాంబర్‌లో దర్శకుల సంఘం సమావేశం జరుగుతుండగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

దర్శకుడు శంకర్‌ను తిరిగి ఏపీ సినీ దర్శకుల మండలికి అధ్యక్షుడిని చేయాలని తెలంగాణా వాదులు డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా ఏపీ సినీ దర్శకుల మండలి అధ్యక్షునిగా వ్యవహరించిన శంకర్ పదవీకాలం గతనెలలో పూర్తయింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో శంకర్ పోటీ చేసేందుకు ప్రయత్నించగా.. సినీ పెద్దలు జోక్యం చేసుకొని నామినేటెడ్ పదవి ఇస్తాం పోటీ చేయవద్దని కోరారు. దీనికి శంకర్ అంగీకరించడంతో దర్శకుడు సాగర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

ఎన్నికలు పూర్తయి నెలరోజులవుతున్నా.. శంకర్ గురించి ఎవరూ పట్టించుకోకపోవడంతో తెలంగాణవాదులు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం ఫిలిం చాంబర్‌లో మండలి సర్వసభ్య సమావేశం జరుగుతుండగా ఓయూ విద్యార్ధి జేఏసీ, కేపీహెచ్‌బీ కాలనీ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నాయకులు భారీ సంఖ్యలో ఫిలిం చాంబర్ వద్దకు తరలివచ్చి ముట్టడికి ప్రయత్నించారు. పథకం ప్రకారమే కొంత మంది పెద్దలు తెలంగాణ ప్రాంత వాసులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు 14మంది జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu