»   » తెలుగువారి క్లాసిక్ 'తెనాలి రామకృష్ణ' దర్శకుడు మృతి

తెలుగువారి క్లాసిక్ 'తెనాలి రామకృష్ణ' దర్శకుడు మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని నాగేశ్వరావు, ఎన్టీ రామారావు కాంబినేషన్ లో రూపొందిన తెనాలి రామకృష్ణ దర్శకుడు బిండిగణవలే శ్రీనివాస అయ్యంగార్ రంగా (బి.ఎస్.రంగా-93) ఆదివారం చెన్నైలోని ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొన్ని రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిర్మాతగా, దర్శకుడిగా సినిమాటోగ్రాఫర్‌ గా పలు చిత్రాలకు పనిచేసిన రంగా 1917 నవంబర్ 11న బెంగళూరు సమీపంలోని మగది గ్రామంలో జన్మించారు. 17వ ఏటనే ఫొటోగ్రఫీపై మక్కువతో రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీని ఏర్పాటు చేశారు. విక్రమ్ ప్రొడక్షన్ అనే సంస్థను ఏర్పాటు చేసి నిర్మాతగా, దర్శకుడిగా తెలుగు, కన్నడ భాషలలో పలు విజయవంతమైన చిత్రాలను తీశారు. కన్నడంలో తొలి కలర్ సినిమాగా అమరశిల్పి జక్కనాచారి చిత్రాన్ని రూపొందించి రాష్టప్రతి అవార్డును అందుకున్నారు. అలాగే ఆయన నిర్మించిన మహిషాసురమర్ధిని, మహాసాధ్వి అనసూయ చిత్రాలు ఘన విజయం సాధించాయి.

విక్రమ్ ప్రొడక్షన్స్ ను స్థాపించిన బి.ఎస్.రంగా మొదట మా గోపి చిత్రం తరువాత రెండవ చిత్రంగా తెలుగు, తమిళంలలో తెనాలి రామకృష్ణ సినిమాను ప్రారంభించాడు. తమిళంలో ఈ సినిమాను తెనాలి రామన్ గా విడుదల చేశారు. నిర్మాతగా, దర్శకుగా, ఛాయాగ్రాహకుడిగా తెనాలి రామన్ (తమిళం) లో అన్ని పనులు చక్కగా నెరవేర్చాడు. బ్రహ్మాండమైన సెట్స్, అలంకరణలు సమకూర్చడానికి అయ్యే వ్యయానికి రంగా వెనుకాడలేదు. తెలుగులో సముద్రాల రాఘవాచార్యుల సంభాషణలు చిత్రానికి వన్నె తెచ్చాయి. ఎన్టీ రామారావు తమిళ, తెలుగు రెండు భాషల్లోనూ శ్రీకృష్ణదేవరాయల పాత్ర పోషించాడు. తెనాలి రామకృష్ణుని పాత్ర మాత్రం తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు, తమిళంలో శివాజీ గణేశన్ వేశారు. కృష్ణసాని పాత్రను ఇరు భాషల్లోనూ భానుమతి పోషించింది. జమునకు కమల పాత్రను, జయలలిత తల్లి సంధ్యకు తిరుమలాంబ పాత్రను ఇచ్చారు. అత్రేయకు రాజసభలో ఒక చిన్నపాత్రను ఇచ్చారు. కానీ అది నచ్చని ఆత్రేయ తన చదువుకు, స్థాయికి తగిన పాత్ర కాదని నిరాకరించి వెళ్ళిపోయాడు. విశ్వనాథన్, రామమూర్తి ద్వయం ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు. తెలుగు వారికి మరుపురాని చిత్రం అందించిన ఈ దర్శకుడు మృతికి ధట్స్ తెలుగు సంతాపం తెలియచేస్తూ నీరాజనాలు అర్పిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu