»   » గతిలేకే...? ఎదురీతకు సిద్ధమైన రామ్ చరణ్!

గతిలేకే...? ఎదురీతకు సిద్ధమైన రామ్ చరణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'తుఫాన్' చిత్రం సెప్టెంబర్ 6న విడుదలకు సిద్దం అవుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సినిమాల విడుదలకు అనుకూలమైన పరిస్థితి లేక పోయినా.....'తుఫాన్' విడుదలవుతుండటం సినిమా ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర విభజన నిర్ణయం వెలువడినప్పటి నుంచి రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర రాజకీయ నేతలపై ఆగ్రహంగా ఉన్న సమైక్యాంధ్ర ఉద్యమకారులు చిరంజీవి కుటుంబానికి చెందిన సినిమాలను అడ్డుకుంటామని ఇప్పటికే బహిరంగంగా హెచ్చరించారు. దీంతో ఇప్పటికే విడుదల కావాల్సిన రామ్ చరణ్ నటించిన'ఎవడు' చిత్రంతో పాటు, పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రాల విడుదల నిలిచిపోయింది.

మరో వైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వారి సినిమాలను తెలంగాణ వాదులు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో సమైక్యాంధ్ర ఉద్యమానికి సపోర్టుగా హరికృష్ణ రాజీనామా చేయడం జూ ఎన్టీఆర్ సినిమాలకు శాపంగా మారింది.

ఓవరాల్‌గా రాష్ట్రంలో నెలకొన్న ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద హీరోల సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలను విడుదల చేసుకునే ఒక ప్రశాంతమైన, అనుకూలమైన పరిస్థితి లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితులను ఎదురీదుతూ రామ్ చరణ్ నటించిన 'తుఫాన్' చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది.

అయితే గతిలేని పరిస్థితుల్లోనే ఈ సినిమా విడుదలకు సిద్ధమైనట్లు స్పష్టం అవుతోంది. ఇది నేరుగా తెలుగు సినిమా కాక పోవడం, హిందీ మూవీకి జంజీర్‌కు అనువాదం కావడం కూడా ఓ కారణం. కోర్టు చిక్కుల కారణంగా చాలా కాలంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన 'జంజీర్'కు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. ఈ నేపథ్యంలో జంజీర్‌ను సెప్టెంబర్ 6న విడుదల చేసేందుకు డేట్ ఫిక్స్ చేసారు.

హిందీ వెర్షన్‌ 'జంజీర్'తో పాటే తెలుగు వెర్షన్ 'తుఫాన్' చిత్రాన్ని కూడా తప్పకుండా విడుదల చేయాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో పరిస్థితులు బాగోలేవని తుఫాన్ విడుదల నిలిపివేస్తే ఇతర సమస్యలు సినిమాను చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఈ రకంగా గతిలేని పరిస్థితుల్లోనే రామ్ చరణ్ సినిమా రాష్ట్రంలో నెలకొన్న ఉద్యమ తుఫానను ఎదురీదుతోందని చెప్పక తప్పదు.

English summary
Even as the multi-crore 'Zanjeer', 'Thoofan' is set for release on September 6, the Telugu film industry is keeping its fingers crossed on how the film would fare in the storm of the 'Samaikhyandhra' agitation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu