Don't Miss!
- Lifestyle
Today Rasi Phalalu : ఈ రోజు మీకు శుభమా లేదా అశుభమా ఎలా ఉంటుంది? ఏఏ రాశులకు ఎలా ఉంటుంది
- News
ఆపరేషన్ ఆకర్ష్: తెలంగాణ బీజేపీలో కీలక పాత్ర పోషించనున్న ఈటల రాజేందర్!
- Sports
IND vs ENG: ఇదెక్కడి పిచ్ రా అయ్యా.. ఇన్నింగ్స్ బ్రేక్‌లో రోలర్‌తో తొక్కించారా? వసీం జాఫర్ సెటైర్!
- Finance
20,000 డాలర్లకు దిగువనే బిట్ కాయిన్, క్రిప్టో మార్కెట్ ఇంకా ఆ స్థాయిలోనే
- Travel
అద్భుత కళాకృతుల నిలయం.. రఘురాజ్‌పూర్..
- Technology
భారత్‌లో 46 వేల ఖాతాలపై నిషేధం విధించిన Twitter!
- Automobiles
భారత మార్కెట్లో సుజుకి కటానా Suzuki Katana స్పోర్ట్స్ బైక్ విడుదల; ధర రూ.13.61 లక్షలు
సిరివెన్నెల నిశ్శబ్ద పాటల విప్లవం.. తుదిశ్వాస వరకు పాట కోసమే.. వెంకయ్యనాయుడు భావోద్వేగం
దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు 'సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం సంపుటి-1' పుస్తకాన్ని ఆవిష్కరించారు. మొదటి పుస్తకాన్ని సిరివెన్నెల గారి సతీమణి పద్మావతి గారు అందుకున్నారు. గరికపాటి నరసింహారావు, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తోటకూర ప్రసాద్ విశిష్ట అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమంలో పలువురు సినీ దర్శకులు, సంగీత దర్శకులు, రచయితలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాన్య భారతదేశ ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ.. "సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం మొదటి సంపుటి ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. సీతారామశాస్త్రి గారు నాకు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆయన ప్రతిభ అప్పుడే నాకు తెలుసు. ఇంతింతై వటుడింతయై అన్నట్లు ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన సీతారామశాస్త్రి గారితో గడిపిన ఆ క్షణాలు ఎంతో మధురమైనవిగా భావిస్తున్నాను. సినిమా పాటల రూపంలో తెలుగుతల్లికి పాటల పదార్చన చేసిన సీతారామశాస్త్రి గారికి నివాళులు అర్పిస్తున్నాను. పాట విలువను ఆర్థికంగా గాక, అర్థవంతంగా కొలిచే వారిలో సీతారామశాస్త్రి గారు అగ్రగణ్యులు. సినిమా పాటలలో విలువలని రాసులుగా పోశారాయన. సిరివెన్నెల గారు ఒక గొప్ప కవి అనేదాని కన్నా.. ఒక అద్భుతమైన ఆలోచనలు కలిగించి, ఆనందింపచేసే మహా మనిషి ఆయన. మనం సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా రచనలకు, పద్యాలకు, ప్రవచనాలకు సమయం కేటాయించాలి. పాటలు మనల్ని రంజింపజేయడంతో పాటు మనకి దారిని చూపిస్తాయి. చీకటిలో వెన్నెలలా.. అది కూడా సిరివెన్నెలలా. మనస్సుని తట్టిలేపేలా ఆయన సాహిత్యం ఉంటుంది. కర్తవ్యం బోధింపచేస్తుంది. సిరివెన్నెల గారిని సినిమా పాటల రచయితగానే చూడలేం. నా అభిప్రాయం ప్రకారం ఆయనొక నిశ్శబ్ద పాటల విప్లవం. నవ్య వాగ్గేయకారుడు. ప్రపంచానికి చెప్పాలనుకున్న మాట పాట ద్వారానే చెప్పారు. ఆఖరి వరకు పాట కోసమే బ్రతికారు అని అన్నారు.

అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిరివెన్నెల సన్నిహితులు మండలి బుద్ధ ప్రసాద్, జొన్నవిత్తుల, సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, థమన్,, జాగర్లమూడి క్రిష్, ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ సిరివెన్నెల గొప్పతనం గురించి, సిరివెన్నెలతో వారికున్న అనుబంధం గురించి పంచుకున్నారు. సిరివెన్నెలకు నివాళిగా ఈ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన 'తానా ప్రపంచ సాహిత్య వేదిక' మున్ముందు మరిన్ని అద్భుత కార్యక్రమాలకు వేదిక అవుతుందని తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి, తానా మాజీ అధ్యక్షులు తోటకూర ప్రసాద్ తెలిపారు. ప్రదీప్ - నిహారిక ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పలువురు గాయనీ గాయకులు సిరివెన్నెల పాటలను ఆలపించి అలరించారు.