»   » విశ్వనాధ్ సినిమా సెట్టింగ్ పై మరో వివాదం

విశ్వనాధ్ సినిమా సెట్టింగ్ పై మరో వివాదం

Subscribe to Filmibeat Telugu

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం వద్ద పంపాతీరంలో దర్శకులు కె.విశ్వనాథ్‌ సినిమాకోసం వేసిన సెట్టింగు తొలగింపుపై మరో వివాదం చోటుచేసుకుంది. తన బోట్లను షూటింగ్‌లో వాడుకున్నందుకు రూ.36 వేలు చెల్లించాలని, ఆ మొత్తం చెల్లించకుండానే సెట్టింగు తొలగిస్తున్నారని బోటు షికార్‌ యజమాని, ఆ బోట్లను తమ సినిమాలో పబ్లిసిటీ నిమిత్తం ఉపయోగించినందుకు అతనే తమకు రూ. లక్షా 50 వేలు చెల్లించాలని యూనిట్‌వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే ఈ నెల ఒకటి నుంచి 16 వరకు ఇక్కడ జరిగిన షూటింగ్‌కు రూ.నాలుగు లక్షలతో హీరో ఇంటి సెట్టింగును కళాత్మకంగా నిర్మించారు. షూటింగ్‌ అనంతరం ఈ సెట్టింగును తొలగించాలని దేవస్థానం, ఉంచాలని ఇరిగేషన్‌శాఖ కోరడంతో ఈ విషయమై మీమాంస ఏర్పడిన విషయం విదితమే.

అయితే సెట్టింగుకు దగ్గరలో దేవస్థానానికి మంచినీటి సరఫరా చేసే బోర్లు ఉన్నందున వీటిని తొలగించాల్సిందేనని దేవస్థానం పట్టుబట్టడంతో నిర్మాతలు అంగీకరించారు. ఈ సెట్టింగు మెటీరియల్‌ తీసుకెళ్లేందుకు రూ.లక్షకు విక్రయించారు. శనివారం సాయంత్రం సెట్టింగును తొలగించేందుకు కొనుగోలుదారులు రాగా దీనిపై వివాదం ఉందని, తొలగించడానికి వీల్లేదని పోలీసులు అభ్యంతరం చెప్పారు. దీంతో ఆర్ట్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు బోటు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే రెండు ఫిర్యాదులు విచారించేవరకు తొలగించవద్దని పోలీసులు కోరడంతో పనులు నిలిపివేశారు. శనివారం రాత్రి నిర్మాతల్లో ఒకరైన తిలక్‌ స్థానిక పోలీసులతో చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తామెవరికీ బకాయిలు లేమన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu