twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అధిపతి- ప్రేక్షకులకు తలనొప్పే గతి?

    By Staff
    |

    Adipathi
    - జలపతి
    చిత్రం: అధిపతి
    నటీనటులు: మోహన్‌ బాబు, నాగార్జున, ప్రీతిజింగానియా, సౌందర్య..
    సంగీతం: కోటి
    నిర్మాత: ఎం.మోహన్‌ బాబు
    స్ర్కీన్‌ ప్లే, దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి

    అధిపతి- ఈ చిత్రం టైటిల్‌ లోనే పవర్‌ ఉంది. అంతే. సినిమా అంతా ఏదో ఉందని చూస్తూ ఉండడమే. క్లైమాక్స్‌ లో గానీ తెలీదు అసలు ఏమీ లేదని. హీరోకు అనవసరమైన బిల్డప్‌ తప్ప పసలేని పక్కా మాల్‌ మసాలా చిత్రం ఇది. పెదరాయుడు తర్వాత ఓ ప్రత్యేక పాత్ర కోసం ఓ పెద్ద హీరోను తీసుకోవడంతో ఈ సినిమాపై నిజంగానే క్రేజ్‌ పెరిగింది. కానీ ఇందులో నిజానికి నాగార్జున పాత్ర అనవసరం. ఏ అచ్యుతో, మరెవరైనా చేసినా తేడా రాని పాత్ర అది. మలయాళం సినిమా నరసింహం ఆధారంగా తీసిన ఈ సినిమాలో అధిపతి పాత్ర పోషించిన మోహన్‌ బాబు పాత్ర కూడా రోటీనే. మలయాళంలో మోహన్‌ లాల్‌ లుంగీ, లాల్చీ ధరిస్తే అదే గెటప్‌ మోహన్‌ బాబు కూడా వాడుకోవడం విచిత్రం. ఇది తెలుగుతనమా?

    ఈ చిత్రంలో మరో గమ్మత్తైన విషయం ఏమిటంటే సినిమా కథ ఎక్కడో జరుగుతుందో తెలీదు. మోహన్‌ బాబు మామూలుగా మాట్లాడుతునే సడెన్‌ గా తెలంగాణ యాసలోకి దిగుతాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొందరు కోస్తా యాసలో మాట్లాడుతుంటారు. మరికొందరు తెలంగాణ యాసలో మాట్లాడుతారు. బహుశా యునివర్సల్‌ అప్పీల్‌ కోసం అలా వాడారా? మొన్నటివరకు రాయలసీమ మీద పడ్డారు. ఇప్పడు తెలంగాణ యాస సినిమా వాళ్ళకు ఫ్యాషన్‌ అయిపోయింది. ఇక కథ ప్రకారం అయితే పగ-ప్రతీకారం అనే టైటిల్‌ అయితే ఈ చిత్రానికి బాగా సూటయ్యేదేమో!

    మోహన్‌ బాబు యుపిఎస్‌ సి పరీక్షలో ఫస్ట్‌ ర్యాంక్‌ పొందుతాడు. ఐఎఎస్‌ కు సెలెక్టైన మోహన్‌ బాబును హత్యకేసులో ఇరికిస్తారు నర్రా వెంకటేశ్వరరావు బృందం. సాక్ష్యాలు అతనికి వ్యతిరేకంగా ఉండడంతో జడ్జి(విజయ్‌ కుమార్‌) ఆరేళ్ళ జైలు శిక్ష విధిస్తాడు- కొడుకని కూడా చూడకుండా. ఆరేళ్ళ తర్వాత లుంగీతో, గమ్మత్తైన రంగుల లాల్చీలతో మోహన్‌ బాబు ప్రత్యక్షమవుతాడు. రౌడీ గెటప్‌ లోనే ఉంటూ...నన్ను రెచ్చగొట్టకండి..లేదంటే నేను రెండో ఛాప్టర్‌ తెరవాల్సి ఉంటుందని బెదరిస్తూ...అందర్నీ చితగొడుతుంటాడు. జైలు నుంచి మోహన్‌ బాబు విడుదలయ్యేసరికి నర్రా చనిపోతాడు. అస్థికలు గోదావరిలో కలిపేందుకు నర్రా కొడుకు ముఖేష్‌ రుషి ప్రయత్నిస్తుంటే హీరోగారు అడ్డుకుంటారు. పవిత్ర గోదావరిలో నర్రా అస్థికలు కలిసేందుకు వీల్లేదని అడ్డుకుంటాడు- అదేదో గోదావరి హీరోగారి సొంత స్థలమైనట్లు. సో మళ్ళీ వీరిద్దరికి పగ స్టార్ట్‌.

    మరోవైపు విజయ్‌ కుమార్‌ కు మరో ఆవిడతో సంబంధం వల్ల ఓ కూతురు పుడుతుంది. ఆమెను కూతురని మాత్రం చెప్పుకోడు. ఆ కూతుర్నీ అడ్డం పెట్టుకొని ప్రతీకారం తీర్చుకోవాలని ముఖేష్‌ రుషి ప్రయత్నిస్తాడు. ఆమెను చంపి విజయ్‌ కుమారే చంపాడని జైల్లో వేయిస్తారు. మరి విజయ్‌ కుమార్‌ ను ఎవరు రక్షిస్తారు? మోహన్‌ బాబు స్నేహితుడు నాగార్జున. ఢిల్లీలో లాయర్‌. స్నేహితుడి తండ్రి కటాకటాల వెనుక ఉన్నాడని తెలిసి, పెళ్ళి చేసుకోబోతున్న నాగార్జున, పెళ్ళి ఆపి జన్మభూమికి వస్తాడు. (తాళి కట్టి ప్లైయిట్‌ ఎక్కవచ్చు కదా!). ఇంకెముంది, నాగార్జున కోర్టులో వాదించి విజయ్‌ కుమార్‌ నిర్దోషిని నిరూపిస్తాడు. నిర్దోషిగా బయటికి వచ్చాక, ఆయన చనిపోతాడు. ఇక్కడ చిన్న క్లైమాక్స్‌ ఫైటింగ్‌. ఆ తర్వాత శుభం.

    కథ పక్కన పెడితే, ఇందులో అనవసరమైన పాత్రలు మూడు- నాగార్జున, సౌందర్య(ఒకే పాట), ప్రీతి జింగానియా. మోహన్‌ బాబు ధారాళంగా సింగిల్‌ మీనింగ్‌ డైలాగ్‌ లు వదిలాడు. కోటి సంగీతం, జయరాం కెమెరా పనితనం- ఈ రెండే ఈ చిత్రంలో బాగున్న అంశాలు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X