»   »  జంప్... ( 'జంప్‌ జిలాని' రివ్యూ)

జంప్... ( 'జంప్‌ జిలాని' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
2.0/5
--- సూర్య ప్రకాష్ జోశ్యుల

అల్లరి నరేష్ కు ఈ మద్య కాలంలో హిట్ గగన కుసమమైపోయింది. స్టార్ హీరోలు సైతం కామెడీలీగ్ లోకి ప్రవేశించటంతో ప్రత్యేకంగా అల్లరి నరేష్ సినిమాకు రావాలంటే, అంతకు మించిన రెట్టింపు వినోదం కోరుకుంటున్నారు. అయితే నరేష్ అదేమీ పట్టించుకోకుండా హిట్ సినిమాల ప్యారెడీలతోనూ, తన సినిమాల్లో సీన్స్ ను రిపీట్ చేసుకుంటూ లాక్కొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సర్లే సొంత కథలు అయితే రొటీన్ గా సాగుతున్నాయని, ప్రక్క రాష్ట్రం నుంచి హిట్టైన సినిమాలు తీసుకువచ్చినా అదే రొటీన్ కథ,కథనం తప్పటం లేదు. మన నేటివిటీ కోసం, బాగా నలిగిపోయిన ఫ్యాక్షన్ సీన్స్ ని ఆ రీమేక్ లో కలిపేసి కిచిడీ చేసి, ఒరిజనల్ లో ఉన్న సోల్ ని మిస్ చేసి వదులుతున్నారు. జంపు జిలాని...అదే పరిస్ధితి ఎదుర్కొంది. పెద్దగా నవ్వించలేని కామెడీగా మిగిలిపోయింది. ముఖ్యంగా టైటిల్ కీ, సినిమాకు సంభధం ఏంటో... , హీరో చేత ద్విపాత్రాభినయం ఎందుకు చేయంచారో కూడా దర్శకుడు కంక్లూజన్ ఇవ్వలేకపోయాడు.

నిడదవోలు లో తమ తాతల నుంచి వస్తున్న హోటల్ బిజినెస్ లో నష్టబోయి అప్పులుపాలై ఉంటాడు సత్తిబాబు(అల్లరి నరేష్). హోటల్ నిలబెట్టుకోవటానికి ఏం చేయాలో అర్దం కాని స్ధితిలో ఉన్న అతని దగ్గరకు తమ్ముడు రాంబాబు(మరో నరేష్) వస్తాడు. రాంబాబు అప్పుడే జైలు నుంచి రిలీజ్ అవుతాడు. రాంబాబు ఓ దొంగ...జల్సా రాయుడు..పేకాట పిచ్చోడు. అయితే అన్నగారి కష్టం చూసి ఆ హోటల్ ని తన తాత(కోట)సలహాలతో డవలప్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఈ లోగా ఆ హోటల్ పై ఆ ఊరి పెద్దమనిషి(బెనర్జి)కన్ను పడుతుంది.

మరో ప్రక్క ఆ ఊరుకి వచ్చిన ఫుడ్ ఇన్సపెక్టర్(ఇషా ఛావ్లా)తో ప్రేమలో పడతాడు సత్తిబాబు. అయితే ఆమెకో ఫ్యాక్షన్ ప్లాష్ బ్యాక్ ఉంటుంది. పులివెందులలో ఉండే ఆమె బావ ఫ్యాక్షనిస్టు(పోసాని)ఆమెనే పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ సమస్యలనుంచి తమ్ముడు సాయింతో తన లవర్ ని ,హోటల్ ని ఎలా రక్షించుకున్నాడు అనేది మిగతా కథ. అలాగే ఈ కథలో రామాయణంలో పిడకల వేటలా రావు రమేష్ వజ్రాల వేట జరుగుతూంటుంది. అది ఏమిటి...కథ కి దానికి సంభంధం ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.


మన సీన్స్ ని తీసుకునే కొద్దిగా అటూ ఇటూ మార్చి ప్రక్క రాష్ట్రం వారు కథ తయారు చేసుకుని హిట్ కొడితే, వాటిని మనవాళ్ళు మంచి రేటుకు కొనుక్కుని రీమేక్ చేసి మళ్లీ ఇక్కడ వదులుతున్నారు. అంతేకానీ రీమేక్ కొనేటప్పుడు...అందులో సీన్స్, కంటెంట్ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసినవే కదా అని ఆలోచించటం లేదు. మసాలా నుంచి జంపు జిలాని దాకా అదే పరిస్ధితి కొనసాగుతోంది.

వాస్తవానికి కలగప్పు తమిళంలో హిట్టే కానీ, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సినంత కథా రాజం కాదు అది. సోల్ కిచెన్ అనే సినిమా ప్రేరణతో తయారైన ఆ చిత్రం దర్శకుడు సుందర్ . సి చేసిన కామెడీ మాయాజాలంతో మంచి విజయం సాధించింది. ఆ మ్యాజిక్ మరోసారి రిపీట్ చేయటం కష్టం అన్నట్లు సీన్స్ ఉంటాయి. దానిని తెలుగుకి అనువదించాలనుకున్నప్పుడు కథలో ఆత్మని సరిగ్గా పట్టుకోవాల్సింది. హోటల్ ని డవలప్ చేసే ప్రాసెస్ లో కథ ఎత్తుగడ మొదలై తర్వాత అది ఫ్యాక్షన్ సెటప్ లోకి వెళ్లిపోగానే సినిమా డల్ అవటం మొదలెట్టింది. అన్నదమ్ములు ఇద్దరూ ఆ హోటల్ ని అభివృద్ది చేసేటప్పుడు ఏ సమస్యలు వచ్చాయి..వాటినుంచి ఎలా బయిట పడ్డారనే విధంగా కథ అల్లు కుంటే బాగుండేది. దానికి తోడు సబ్ ప్లాట్ లను మెయిన్ ప్లాట్ లుగా భావించి,ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం కూడా సినిమాను విసుగొచ్చేలా చేసింది.

మిగతా రివ్యూ స్లైడ్ షోలో...

స్క్రీన్ ప్లే నే సమస్య

స్క్రీన్ ప్లే నే సమస్య

కథలో రకరకాల థ్రెడ్స్ ఉన్నప్పుడు వాటిని ముడి పెట్టే సెంట్రల్ పాయింట్ బలంగా ఉండాలి. దాన్ని పట్టుకుని మిగతా సబ్ ప్లాట్స్ ని కలుపుతూ, రన్ చేస్తే చూసేవారికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అదే ఈ సినిమాలో మిస్సైంది. హోటల్ ని డవలప్ చేయాలని మొదలైన కథ...అక్కడ నుంచి కాసేపు ప్యాక్షన్, మరికాసేపు వజ్రాల వేట అంటూ గందరగోళంగా సాగుతుంది. దాంతో ఏదో కామెడీ ఛానెల్ లో కామెడీ బిట్లు ఒక దాని తర్వాత మరొకటి చూసిన ఫీలింగ్ వస్తుంది.

వేస్టు

వేస్టు

నరేష్ లాంటి మంచి నటుడుతో ద్వి పాత్రాభినయం ప్లాన్ చేసుకున్నప్పుడు...వీలైనంత వేరియేషన్ గెటప్ లలోనూ, డైలాగు డెలవరీలోనూ చూపించగలగాలి. అలాగే ద్విపాత్రాభినయం పర్పస్ కూడా కథలో ఉండాలి. అంతేకాని ఇద్దరు నరేష్ లకు తేడా కేవలం కళ్ళజోకు మాత్రమే అంటే ఎలా సరిపోతుంది. అంత నిర్లక్ష్యంగా దర్శకుడు పాత్రలను గాలికి వదిలేస్తే ఎలా

నిడివి పెద్ద సమస్య

నిడివి పెద్ద సమస్య

ఈ సినిమా దాదాపు 165 నిమిషాలు ఉంది. మినిమం అరగంటైనా కట్ చేస్తే చూసే వారికి కొద్దిగా ఇబ్బంది తగ్గించినవారు అవుతారు. ఫస్టాఫ్ లోనూ ఇంట్రవెల్ కు ముందు ఓ పావు గంటకు పైగా నస ఉంది దాన్ని నిర్దాక్ష్యంగా కట్ చేయాలి.

మారుతి ఎఫెక్టు

మారుతి ఎఫెక్టు


అల్లరి నరేష్ మీద మారుతి సినిమాల ఎఫెక్టు పడిందేమో అని ఈ సినిమా చూస్తే డౌట్ వస్తుంది. ఎందుకంటే బూతుని దట్టించాలని బాగానే దర్శకుడు ప్రయత్నించాడు

హీరోయిన్స్

హీరోయిన్స్

ఇషాఛావ్లా...చీరకట్టుతో మురిపిస్తూ, తనకున్న పరిధిలో బాగానే చేసింది. స్వాతి దీక్షిత్...నటన కన్నా ఎక్కువ ఎక్సపోజింగ్ కే ప్రయారిటీ ఇచ్చింది. దర్శకుడు ఈ విషయంలో శ్రద్దపెట్టి మరీ బాగా వేరియేషన్ చూపించాడు. వారి నడుముల మీదే ఎక్కువ శ్రద్ద పెట్టాడు

సంగీతం

సంగీతం


కామెడీ సినిమా కదా ...ఎవరు ఆడియో కొంటారు, పాటలు ఎవరు చూస్తారు అనుకున్నారో ఏమో కానీ చాలా దారుణంగా పాటలు ఉన్నాయి...ఒక్క పాట కూడా అలరించదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంతమాత్రంగానే ఉంది

దర్శకుడు

దర్శకుడు

గతంలో అల్లరి నరేష్ తో చేసిన అనుభవం ఉన్న ఇ.సత్తిబాబు ...అతని బాడీ లాంగ్వేజ్ ని మాత్రం పట్టుకోలేకపోయాడనిపిస్తుంది. రీమేక్ సినిమాని...రీ మేకు లా సీన్ బై సీన్ తీసుకుంటూ, మధ్య మధ్యలో తన పైత్యం కలిపాడు కానీ ఎక్కడా ఆకట్టుకునే ఎలిమెంట్ అనేది లేకుండా జాగ్రత్తపడ్డాడు.

డైలాగ్స్

డైలాగ్స్

అల్లరి నరేష్ సినిమా కదా...అతని సినిమాలకు ఇలాగే డైలాగులు రాయాలి, మధ్య మధ్యలో వాళ్ల నాన్న గారు ఇవివి గారిని, ఆయన సినిమాలను స్మరించాలి అనుకున్నాడో ఏమో కానీ మాటల రచయిత చాలా పేలవంగా డైలాగులు ఇందులో రాసారు. ముఖ్యంగా అల్లరి నరేష్ సినిమాలకు ఇంతవరకూ లేని బూతుని తీసుకొచ్చి పెట్టాడు.

టెక్నికల్ గా

టెక్నికల్ గా

ఈ సినిమా టెక్నికల్ విషయాలు చెప్పుకోకపోవటమే మంచింది. ఏదో చుట్టేసినట్లు, హడావిడిగా పనిచేసినట్లు అనిపిస్తుంది. సినిమా చూస్తే ఎడిటర్ మీద పిచ్చ కోపం వస్తుంది. మరి కాస్త లెంగ్త్ తగ్గిస్తే వీడి సొమ్మేం పోయింది అనిపిస్తుంది. కెమెరామెన్ జస్ట్ ...ఓకే అనిపించుకున్నాడు.

పోసాని,జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కోట

పోసాని,జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, కోట

ఏంటి రాజా అంటూ పోసాని... చేసే కామెడీ మొదట్లో బాగానే ఉన్నా...రాను రానూ మొనాటినీ వచ్చేసింది. ఈ చిత్రంలోనూ ఫ్యాక్షనిస్టుగా పోసాని...వికారం పుట్టించాడు. అలాగే జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు అయితే మరీనూ. అంతకు ముందు ఎన్నో చిత్రాల్లో చూపిన ఎక్సప్రెషన్స్ నే ఇక్కడా వదిలారు. సీనియర్ నటుడు కోటకి విగ్ సెట్ కాకపోయినా ఆయన ఒక్కడే...ఉన్నంతలో బాగా చేసాడనిపించింది.

నరేష్

నరేష్


హీరోగా నరేష్ ...తనని తాను మార్చుకోవాల్సిన సమయం వచ్చేసిందని తెలుసుకోవాలి. అలాగే కథలు,దర్సకులు ఎంపికలోనూ అతను మారకపోతే కొంతకాలానికి క్యారెక్టర్ ఆర్టిస్టుకు షిప్ట్ అయిపోవాల్సి వస్తుంది.

ఎవరెవరు

ఎవరెవరు

పతాకం: రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్
నటీనటులు: అల్లరి నరేష్, ఇషాచావ్లా, స్వాతి దీక్షిత్‌ ,కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళి, ఎమ్మెస్‌ నారాయణ, చలపతిరావు తదితరులు
కథ: సుందర్‌ సి,
మాటలు: క్రాంతిరెడ్డి సకినాల,
రచనా సాయం: సతీష్‌ వేగేశ్న,
పాటలు: రామజోగయ్య శాస్ర్తి,
సంగీతం: విజయ్‌ ఎబెంజర్‌,
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర,
కళ: కిరణ్‌కుమార్‌,
కూర్పు: గౌతంరాజు.
నిర్మాణం: వెంకటేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ
సమర్పణ: అంబికా కృష్ణ
స్క్రీన్ ప్లే,దర్శకత్వం: ఇ.సత్తిబాబు
నిర్మాత : అంబికా రాజా
విడుదల తేదీ: 12, జూన్ 2014

ఏదైమైనా అల్లరి నరేష్ గత చిత్రాలు గుర్తు చేసుకుని, ఓ మంచి కామెడీ సినిమా చూద్దాం అని ఫిక్సై వెళితే తీవ్రమైన నిరాశ కలుగుతుంది. ఇందులో పేలిన కామెడీ బిట్లు ఎలాగూ కొద్ది రోజుల్లో టీవిల్లో కామెడీ ఛానెల్స్ లో వస్తాయి కాబట్టి మూడు గంటల విలువైన కాలాన్ని పదిలం చేసుకోవటం మేలు.


(గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

English summary
Allari Naresh's 'Jump Jilani' released today with divide talk. Jump Jilani has Allari Naresh in a dual role. This has been directed by E Satti Babu. Jump Jilani is the official remake of the Tamil film ‘Kalakalappu’. Vijay Ebenzer is scoring the music and Isha Chawla is the female lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu