twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సుడి తిరిగింది (‘సుడిగాడు’ రివ్యూ)

    By Srikanya
    |

    'కరెంటు తీగ కూడా నాలా సన్నగా ఉంటుంది. ముట్టుకొంటే షాకే...' అని హీరో అంటే.. 'మరి కరెంటు పోతేనో...' అంటూ కౌంటర్ వస్తే నవ్వుతాం... అలాంటి స్టార్ హీరోల డైలాగుల సెటైర్లలతో, గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ చిత్రాల ప్యారెడీలతో, మంచి ఓపినింగ్స్ తో అల్లరి నరేష్ తాజా చిత్రం 'సుడిగాడు'థియేటర్లలలో దిగింది. సాధారణంగా అల్లరి నరేష్ చిత్రాలు అంటే హిట్ సినిమాల ప్యారెడీలు కథలో కలిసిపోయి అప్పుడప్పుడూ వచ్చి నవ్విస్తూంటాయి. అలాంటిది పూర్తిగా ప్రతీ సీనూ ప్యారడీలతో రూపొందితే ఎలా ఉంటుంది. Thamizh Padam టైటిల్ తో 2010లో తమిళంలో రూపొందిన హిట్ చిత్రం రీమేక్ గా వచ్చిన 'సుడిగాడు'అదే పంథాని అనుసరించింది. ట్రైలర్స్ ద్వారా, పోస్టర్స్ ద్వారా విపరీతమైన ఆసక్తి రేపిన ఈ చిత్రం థియేటర్లలోనూ ఏ మాత్రం తగ్గకుండా నవ్వులు పూయించి టిక్కెట్ డబ్బుకు న్యాయం చేసేసింది.

    పతాకం: అరుంధతీ మూవీస్
    నటీనటులు: చంద్రమోహన్, అలీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, చలపతిరావు, పోసాని కృష్ణమురళి, వేణు మాధవ్, జీవా, కృష్ణ్భగవాన్, రఘుబాబు తదితరులు
    సంగీతం: శ్రీవసంత్,
    పాటలు: సిరి వెన్నెల, చంద్రిబోస్, రామజోగయ్యశాస్ర్తీ,
    కెమెరా: విజయ్ ఉలగనాథ్,
    ఎడిటింగ్: గౌతంరాజ్,
    నిర్మాత: డి.చంద్రశేఖర్,
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు.

    సీమలో... కామేష్ (అల్లరి నరేష్), హేమ దంపతులకు సిక్స్ ప్యాక్ బాడీతో పవర్ ఫుల్ గా పుట్టిన బిడ్డ శివ(అల్లరి నరేష్ డబుల్). పుట్టగానే వాడిపై పగ పెచ్చుకున్న తిక్కలరెడ్డి (జయప్రకాష్ రెడ్డి) వాడ్నిఆ పసి పిల్లాడ్ని పొత్తిళ్లలోనే చంపాయాలనుకుంటాడు. ఆ ప్రమాదం నుంచి కాపాడి ,భావి తెలుగు హీరోని బ్రతికించటానికి కామేష్ తన తల్లి (కోవై సరళ)కి ఇచ్చి తప్పించి హైదరాబాద్ పంపేస్తాడు. తెలుగు సినీ పరిశ్రమ రాజధాని హైదరాబాద్ వచ్చిన శివ స్టార్ హీరోలకే సొంతమైన బుల్లెట్స్ కు ఎదురెళ్లటం, కాలాన్ని శాసించటం వంటి అద్బుత లక్షణాలతో పెరిగి పెద్దవుతాడు. ఓ ప్రక్క తన తెలివితేటలతో మాఫియాని ఎదుర్కొంటూ.. ప్రియ(మోనాల్ గజ్జల్)తో ప్రేమలో పడతాడు. అనితర సాధ్యమైన ఆమె ప్రేమను ఎలా పొందాడు.. చిన్నప్పుడే విడిపోయిన తన తల్లి తండ్రులను ఎలా కలిసాడు... పనిలో పనిగా తన భాధ్యత అయిన దేశాన్ని రక్షించటం అనే కర్తవ్యాన్ని ఎలా నెరవేర్చాడు అనేది మిగతా కథ.

    హాలీవుడ్ చిత్రం హాట్ షాట్స్ ప్రేరణతో వచ్చిన Thamizh Padam తమిళంలో ఘన విజయం సాదించింది. ముఖ్యంగా తమ అభిమాన స్టార్ హీరోల మ్యానరిజంస్, బిల్డప్ లపై సెటైర్స్ ను వారు బాగా ఎంజాయ్ చేసారు. అయితే తెలుగుకు వచ్చేసరికి హీరోల మీద సెటైర్స్ లేకుండా కేవలం హిట్ చిత్రాల సీన్స్, డైలాగులనే ప్యారెడీ చేసారు. అయితే ఆ ప్యారెడీలను మనం చాలా సినిమాల్లో ఇప్పటికే చూసాం.. చూస్తున్నాం... ముఖ్యంగా టీవిల్లో కామెడీ షోలు వచ్చాక కామన్ అయ్యిపోయింది. ఈ నేపథ్యంలో ఇలాంటి కథను డీల్ చేయటం కత్తి మీద సామే. అయితే దర్సకుడు భీమినేని శ్రీనివాసరావు తన సీనియార్టితో చాలా వరకూ ఆ రిపీట్ నెస్ ఫీల్ లేకుండా చేయగలిగారు. ఇక ఫస్టాఫ్ ఫన్ తో నడిచిపోయినా సెకండాఫ్ వచ్చేసరికి అయినా కథలోకి ప్రవేశిస్తారనిచాలా మంది ఆశించారు. అయితే ఫస్టాఫ్ తరహాలోనే అదే ప్యారెడీ తో ముందుకు వెళ్లటం కాస్త ఇబ్బందిగా సాగిన ఫీలింగ్ వచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్ తేలిపోవటం, క్లైమాక్స్ ఫైట్ అయ్యాక కూడా ఇంకా కోర్టు సీన్స్ రావటం విసుగు తెప్పించాయి. దాంతో దర్శకుడు స్పూ ఫ్ ల మీద, పబ్లిసిటీ మీద పెట్టిన శ్రధ్ద సినిమా కథ, కథనంపై పెట్టలేదనిపిస్తుంది.

    ఇక నటీనటుల్లో అల్లరి నరేష్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. అదే ప్లస్.. అదే మైనస్... ఎన్నో సార్లు ఇలాంటి పాత్రలు చేసి ఉండటంతో సునాయసంగా చేసుకుంటూ పోయాడు. అదే సమయంలో అనేక సార్లు ఈ స్పూఫ్ లు చేసి ఉండటంతో అప్పటికప్పుడు నవ్వించినా... కొత్తగా అనిపించలేదు. అదే తమిళంలో ..కొత్త హీరోని పరిచయం చేస్తూ సినిమా చేయటంతో జనం కొత్తగా ఫీలయ్యారు. హీరోయిన్ గా మోనాల్ గజ్జల్ తన పాత్రకు తగినట్లుగా బాగానే చేసింది. హీరో నాయనమ్మగా కోవై సరళ బాగానే నవ్వించింది. అలాగే హీరో ప్రెండ్స్ గా చేసిన ఎమ్ ఎస్ నారాయణ, ఎల్ బి శ్రీరాం, కొండవలస ఎపిసోడ్స్ తమిళంలో పేలినట్లు పేలలేదు. ఇక జెఫ్పారెడ్డి పాత్రలో బ్రహ్మానందం బాగానే నవ్వించాడు. తిక్కరెడ్డిగా జయప్రకాష్ రెడ్డి చేసిన క్యారెక్టర్ ఓకే అనిపిస్తుంది. అలాగే అల్లరి నరేష్ సైతం కొంతకాలం పాటు ప్యారెడీలకు దూరంగా ఉంటే మంచిది... ఇందులో పరాకాష్టకు చేరిపోయిన ఫీలింగ్ వచ్చింది.

    సినిమా హైలెట్స్ విషయానికి వస్తే.. హీరో పుట్టుకతోనే సిక్స్ ప్యాక్ బాడీతో పుట్టడం నవ్విస్తుంది. అలాగే ఓంకార్ రియాల్టీ షో స్పూఫ్ పెట్టి పోసాని, సుందరం మాస్టర్, శివ శింకర్ మాస్టర్ లపై కామెడీ చేసారు. బాలకృష్ణ పల్నాటి బ్రహ్మనాయుడు చిత్రంలోని ట్రైన్ ని వెనక్కి పంపే సీన్ పై చేసిన ప్యారెడీ కూడా నవ్వించింది. పెదరాయుడు పాత్రను స్ఫూఫ్ చేస్తూ ధర్మవరపు పై చేసిన సీన్స్ బాగున్నాయి. రాజమౌళి తన సినిమాల్లో హీరోల కోసం ప్రత్యేకంగా తయారు చేయించే వెపన్స్ పై చేసిన స్పూఫ్ పెద్దగా పేలలేదు. పాటల్లో ఫింకీ.. పింకీ పాంకీ పాట అలరిస్తుంది. కెమెరా వర్క్,ఎడిటింగ్ మరింత షార్పుగా ఉంటే బాగుండేది. దర్శకుడుగా సీనియర్ అయిన భీమినేని గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. అలాగే ఏమి మాయ చేసావే, ఖుషీ వంటి ప్యారెడీలు పెట్టినా సరిగ్గా ఎస్టాబ్లిష్ కాకపోవటం పేలలేదు.

    ఏదైమైనా ఇవివి సత్యనారాయణ వంటి దర్శకులు గతంలో ఇంతకన్నా గొప్పగా ప్యారెడీ లు చేసి నవ్వించినా ఇలా పూర్తి ప్యారెడీలతో సినిమా ఎవరూ తీయలేదు. కాబట్టి... ఈ కొత్త ప్రయోగాన్ని ఓసారి చూసి నవ్వుకోవచ్చు. ప్రోమోలు, పోస్టర్స్ చూసి మరీ ఏదో అద్బుతం చూడబోతున్నాం... అని పిక్స్ అయి సినిమాకు వెళ్లకపోతే మంచి టైం పాస్ వ్యవహారమే... ఫైనల్ గా 'సుడిగాడు'కి సుడి ఉంది.

    -సూర్య ప్రకాష్ జోశ్యుల

    English summary
    Allari Naresh’s Sudigadu film released today with hit talk. From the beginning of the title cards to end credits, Sudigaadu is complete spoof. It is remake of Tamil hit, Thamizh Padam (2010)directed by Bheemineni Srinivasa Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X