twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రిష-నితిన్‌ 'అల్లరి బుల్లోడు'

    By Staff
    |

    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: అల్లరి బుల్లోడు
    విడుదల తేదీ: 15 సెప్టెంబర్‌ 2005
    నటీనటులు: నితిన్‌, త్రిష, రతి, కోట శ్రీనివాసరావు, సౌరవ్‌ శుక్లా,
    వైజాగ్‌ ప్రసాద్‌, కృష్ణభగవాన్‌, వేణుమాధవ్‌, ఎమ్మెస్‌ నారాయణ,
    బ్రహ్మానందం, తెలంగాణ శకుంతల, జయలలిత తదితరులు
    సంగీతం: ఎంఎం కీరవాణి
    పాటలు: చంద్రబోస్‌
    సినిమాటోగ్రఫీ: భూపతి
    నిర్మాత: కె.అనిల్‌కుమార్‌
    స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు

    యువ దర్శకులు వైవిధ్యమైన కథ, కథనాలతో కదం తొక్కుతుంటే సీనియర్‌ దర్శకులు తమ కాలం నాటి హిట్స్‌ తాజా రీమేక్‌ చేసుకుంటూ ఫ్లాపుల పాలవుతున్నారు. గతంలో చిరంజీవి మెగా హిట్‌ 'రౌడీ అల్లుడు'ను మళ్ళీ అదే విధంగా కె.రాఘవేంద్రరావు తీసిన సినిమా 'అల్లరి బుల్లోడు'. పాతచింతకాయ పచ్చడి వంటి కథతో వచ్చిన ఈ సినిమా ఈ తరానికే కాదు పాత తరాలకు కూడా బోర్‌ కొట్టిస్తుంది.

    లక్ష్మీ కన్ర్‌స్టక్షన్స్‌ యజమాని మాధవరావు (వైజాగ్‌ ప్రసాద్‌)ను ఒక కాంట్రాక్టు కోసం సత్యేంద్ర, కోట శ్రీనివాసరావు యాక్సిడెంట్‌కు గురి చేస్తారు. ఆయన బతికి బయట పడినా దీర్ఘకాలం విశ్రాంతి తీసుకోవలసి రావడంతో ఆయన కూతురు (త్రిష) అమెరికా నుంచి వచ్చి వ్యాపార వ్యవహారాలు చూసుకుంటూ ఉంటుంది. ఆమెకు వ్యాపార విషయాలు అర్ధం కాకుండా చేసేందుకు ప్రత్యర్ధులు సీనియర్‌ మేనేజర్‌ (తనికెళ్ళ భరణి) కుట్ర చేసి తొలగించేలా చేస్తారు. ఆ సమయంలో భరణి కొడుకు యువరాజు (నితిన్‌) రంగంలోకి దిగుతాడు. త్రిష వ్యాపార సమస్యలను తీర్చి ఆమె మనసులో చోటు సంపాదిస్తాడు. ఇంతలో త్రిష చెల్లెలు రతి తెర మీదికి వస్తుంది. అనుకోని పరిస్ధితుల్లో నితిన్‌ రౌడీ గెటప్‌లో ఆమెను అల్లరి పెడతాడు. అక్క త్రిషకు ఎక్కడ చెబుతుందోనని తనకో రౌడీ తమ్ముడు ఉన్నాడని అబద్ధం చెబుతాడు. కానీ అప్పటికే రతి నితిన్‌ను ప్రేమించేస్తుంది. కంగారు పడ్డ నితిన్‌ మరో అబద్ధం ఆడి రౌడీ నితిన్‌ ఊరు వెళ్ళాడని చెబుతాడు. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ నమ్మేస్తారు. ఊపిరి తీసుకున్న నితిన్‌ నిజంగా మరో నితిన్‌ రావడంతో కంగారు పడతాడు. ఇంతకీ కొత్త నితిన్‌ ఎవరంటే 'రౌడీ అల్లుడు' లో లాగా బొంబాయి నుంచి విలన్స్‌ చేత తీసుకురాబడతాడు. ఆ పరిస్ధితిలో రాజు ఏంచేస్తాడు? విలన్ల నుండి తన ప్రేయసి త్రిషని ఎలా రక్షించాడన్నది మిగితా కథ.

    పాతకథను కొత్తగా అందించేటప్పుడు కనీసం సరికొత్త స్క్రీన్‌ప్లేను ఆశ్రయించాలి. కానీ రాఘవేంద్రరావు పాత కథను మళ్ళీ అదే స్క్రీన్‌ప్లేతో అందించడంతో పాత చిత్రాలను చూస్తున్న అనుభూతి కలుగుతుంది. కథలో త్రిష తన తండ్రిని గాయపరిచిన వారి గురించి ఆలోచించక పోవడం విచిత్రంగా ఉంటుంది. నితిన్‌ తన ఆఫీసులో పనిచేసిన సీనియర్‌ మేనేజర్‌ కొడుకని ఎవరూ గుర్తించకపోవడం మరో విచిత్రం. అలాగే తనికెళ్ళను ఇరికించే సన్నివేశంలో ఒక అమ్మాయి సూట్‌కేసులో డబ్బు పట్టుకొచ్చి ఇస్తుంది. త్రిష ఎదురుగా ఈ సంఘటన జరుగుతుంది. ఎవరైనా యజమాని ఎదురుగా ఉద్యోగికి లంచం ఇస్తారా? అమెరికాలో చదువుకుని వచ్చిన త్రిషకు ఇంత చిన్న విషయం తెలియదా? ఇలా కథ ప్రారంభమైన సెటప్‌ తప్పుల తడకలా సాగింది. ఇక స్క్రీన్‌ప్లేకి రెండో మలుపు లేకపోవడంతో సెకండాఫ్‌ సాగదీసినట్టుగా అనిపిస్తుంది. క్లెయిమాక్స్‌లో బ్రహ్మానందం దంపతులను కిడ్నాప్‌ ఎందుకు చేస్తారో అర్ధం కాదు. వినోదమే ప్రధానంగా తీసిన ఈ చిత్రంలో ఎన్ని లోపాలు ఉన్నా పాటలు, వాటి చిత్రీకరణలో దర్శకుడి ప్రతిభ మెచ్చుకోదగినది. నితిన్‌ డబుల్‌ యాక్షన్‌ను కెమెరామన్‌ బాగా చిత్రీకరించగలిగారు. నటీనటులు తమ పాత్రల మేరకుఉ బాగానే నటించారు. ఊహకు అందే కథా కథనం సినిమాను ఘోరంగా దెబ్బతీసినా కామెడీ పాటలు బాగుండడంతో బి,సి సెంటర్లలో కొన్నిరోజులు ఆడవచ్చు.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X