twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్‌ 'నా అల్లుడు' రివ్యూ

    By Staff
    |

    Naa Alludu
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినివూ: నా అల్లుడు
    నటీనటులు: ఎన్టీఆర్‌, రమ్యకృష్ణ, శ్రీయ, జెనీలియా,
    బ్రహ్మానందం, సుమన్‌ తదితరులు
    సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
    కథ: విజయేంద్ర ప్రసాద్‌
    మాటలు: ఎం రత్నం
    కెమెరా: రవీంద్ర బాబు
    దర్శకత్వం: వర ముళ్ళపూడి
    నిర్మాత: గిరి

    ప్రముఖ రచయిత ముళ్ళపూడి వెంకటరమణ కుమారుడు వర ముళ్ళపూడి దర్శకత్వంలో (తొలి ఛాన్స్‌) మాస్‌ హీరో ఎన్టీఅర్‌తో 'ఆంధ్రావాలా' నిర్మాతలు తీసిన మాస్‌ హాస్య ప్రయోగం 'నా అల్లుడు'.

    కమల్‌హసన్‌ 'ఒక రాధ ఇద్దరు కృష్ణులు' సినిమాను గుర్తుకు తెచ్చే ఈ సినిమా ఎన్నో హిట్‌ చిత్రాల మెచ్చుతునకలను ఇముడ్చుకుని మెగా మిక్స్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగునాట విడుదలైన ఎన్నో అత్తాఅల్లుళ్ళ సినిమాల్లో ఇదొకటి.

    కథ: భానుమతీదేవి (రమ్యకృష్ణ) పెద్ద మహిళా పారిశ్రామిక వేత్త. ఆమె కూతుళ్ళు మేఘన (శ్రీయ), గగన (జెనీలియా). ఒక రోజు కార్తీక్‌ (ఎన్టీఆర్‌) భానుమతి సంస్ధలో జనరల్‌ మేనేజర్‌గా ఇంటర్వ్యూకి వస్తాడు. సినిమా ఫక్కీలో సెలక్ట్‌ అయిపోతాడు. ఒక సంఘటన కారణంగా ఇంటర్వ్యూకి ముందు రోజే భానుమతీ దేవి కూతుళ్ళతో ఎన్టీఆర్‌ గొడవపడతాడు. ఉద్యోగంలో చేరిన రోజే ఘర్షణ జరగడంతో రమ్యకృష్ణతో ఎన్టీఆర్‌ 'నేను నీ అలుడినై, నీ ఆస్ధికి మొగుడినవవుతా' అంటాడు.

    ఈ సంభాషణంతా రమ్యకృష్ణ ఇంట్లో జరుగుతుంది. ఆ సమయంలో ఎన్టీఆర్‌ ఆఫీసులో ఉండకుండా అక్కడికి ఎందుకు వస్తాడన్నది అడగవద్దు. అక్కడి నుంచి హీరో ఛాలెంజ్‌ దిశగా ప్రయత్నాలు చేస్తాడు. ఆమె ఫ్యాక్టరీలో కూలీగా చేరి ఒక్కరోజులోనే కార్మికుల తిరుగుబాటు తీసుకొస్తాడు. రమ్యకృష్ణ ఆ విప్లవానికి భయపడి, కార్మికులతో మాట్లాడుతుంది. కార్మికులకు బోనస్‌ ఎర వేసి ఎన్టీఆర్‌ను ఉద్యోగం నుంచి తీసేస్తానని చెబుతుంది. ఎన్టీఆర్‌ ఉద్యోగం పోతుంది. తర్వాత ఆమె కూతుళ్ళతో న్యూజీల్యాండ్‌ వెళ్తుంది. అక్కడ హీరో ప్రత్యక్షం. అక్కడి ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌ బ్రహ్మానందం సహాయంతో ఇద్దరు హీరోయిన్లతో డ్యూయట్లు. ఈ హడావుడిలో శ్రీయ అతనితో ప్రేమలో పడిపోతుంది. ఈ బాధ పడలేక రమ్య ఇండియా వస్తే మురుగన్‌ అనే కొబ్బరికాయల వ్యాపారస్తుడు (ఎన్టీఆర్‌ మారు వేషం) పరిచయం. అతడిని తన ఇంటికి కాపాలా ఉంచుకుంటుంది. ఇంటర్వల్‌ బ్రేక్‌.

    ఒకరోజు శ్రీయను కలుసుకోడానికి వచ్చిన ఎన్టీఆర్‌ పైకి మురుగన్‌ను రమ్య ఉసిగొలుపుతుంది. ఇద్దరూ ఫైట్‌ చేసుకున్న తర్వాత అసలు ఎన్టీఆర్‌ను మురుగన్‌ చంపి రమ్య ఇంటి ఆవరణలోనే పాతిపెడతాడు. ఈ లోపు ఎలా సమాచారం తెలుస్తుందో కానీ న్యూజీల్యాండ్‌నుంచి ఇండియాకు ఇంటర్‌పోల్‌ ఆఫీసరు బ్రహ్మానందం దర్యాప్తునకు వస్తాడు. దీనిని ఆసరాగా తీసుకుని మురుగన్‌ రమ్యకృష్ణను బ్లాక్‌మెయిల్‌ చేస్తాడు. ఈ లోపు రెండో హీరోయిన్‌ జెనీలియా మురుగన్‌తో ప్రేమలో పడిపోతుంది. బ్లాక్‌మెయిల్‌కు భయపడి రమ్య ఇల్లు వదిలి రోడ్డెక్కుతుంది. ఈలోపు ఆమె భర్త సుమన్‌ను ఆమెతో కలిపి మురుగన్‌ సెభాష్‌ అనిపించుకుంటాడు. రమ్య అన్న విలన్‌ చరణ్‌ రాజ్‌ రూపంలో దిగుతాడు. ఆ తర్వాత హీరోదే పైచేయి కావడం మామూలే.

    ఇంతకీ మొదటి ఎన్టీఆర్‌ ఏమయ్యాడు? రమ్యపై పంతం తీర్చుకోవడం కోసం మురుగన్‌ వేషంలో మాస్క్‌ వేసుకుని నాటకమాడుతాడు.

    ప్లస్‌ పాయింట్స్‌: మురుగన్‌ క్యారక్టర్‌ మంచి మాస్‌ ఎలిమెంట్‌తో సరదాగా సాగింది. రెండు పాటలు బాగున్నాయి. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ మాస్‌ను అలరిస్తాయి.

    మైనస్‌ పాయింట్స్‌: కథ అసహజంగా ఉంది. స్క్రీన్‌ప్లే అంతంత మాత్రం. సినిమాలో పాత వాసనలు ఎక్కువగా ఉన్నాయి. మంచి మాస్‌ ఎంటర్‌టైనర్‌ తీర్చిదిద్దుదామన్న తాపత్రయంతో కథను కావడి బద్దలా ఎక్కడబడితే అక్కడ వంచడం చాలా అసహజంగా ఉంది. ఓపెనింగ్‌ సీన్‌ 'అల్లుడా మజాకా' లోదైతే, అత్త క్యారక్టరైజేషన్‌ 'అనసూయమ్మ గారి అల్లుడు' సినిమాలోనిది. నారీ నారీ నడుమ మురారి సినిమాలోని హీరోయిన్ల మాదిరి ఈ సినిమాలోని హీరోయిన్లు ఉంటారని నిర్మాతలు ప్రకటించారు కానీ అంత సీన్‌ లేదు. ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర విలన్‌లా ఎందుకు వ్యవహరిస్తుందన్నది అర్ధం కాదు. సుమన్‌ రమ్యలు ఎందుకు విడిపోయారన్న సీన్లు ఎస్టాబ్లిష్‌ కాలేదు. ఫస్టాఫ్‌ స్పీడుగా ఉన్నా సెకండాఫ్‌ ప్రేక్షకులకు బోర్‌కొట్టిస్తుంది. హీరోను తెలివైన వాడిగా ఎస్టాబ్లిష్‌ చేసే సీన్లు లేకపోవడంతో క్లెయిమాక్స్‌ పండలేదు. ఫ్లాష్‌బ్యాక్‌ సీన్లు ముక్కలు ముక్కలుగా చూపించడం మంచి ప్రయోగమే కానీ దాని నుంచి రావలసిన ఫలితం ప్రేక్షకుడికి అందలేదు. బ్రహ్మానందం పాత్ర ఇంటర్‌పోల్‌ పరువు తీయడానికి తప్ప హాస్యానికి పనికి రాలేదు. మురుగన్‌ పాత్ర నుంచి కథ ఊపందుకోవాలి కానీ ఆ క్యారెక్టర్‌ పాత హలో బ్రదర్‌ తరహాలో కామెడీ ప్రయత్నం చప్పట్లు కొట్టించినా సినిమాకు ఉపయోగపడలేదు. ఒంటి చేత్తో అన్ని ఫ్యాక్టరీలను నడిపే ఇండష్ట్రియలిస్టు రమ్య చిన్న బ్లాక్‌ మెయిల్‌కు భయపడడం, బెదిరింపులకు లొంగడం, తన ఇన్‌ఫ్లుయెన్స్‌ను వాడుకోక పోవడంతో ఆ క్యారెక్టర్‌ బలం పోయింది. మంచి నటుడు కోట శ్రీనివాసరావు (రమ్య పిఎ)ను సరిగా వాడుకోలేదు. ఫోటోగ్రఫీ పాత సినిమా ఫీలింగ్‌ను కలిగించింది.

    దట్స్‌తెలుగు రిమార్క్స్‌: సగం సాలెనేత.. సగం మరో నేత లాంటి సినిమా. కథ, కథనం పాత చింతకాయ పచ్చడి లాంటి సినిమా. ఎన్టీఆర్‌ అభిమానులు పెద్ద మనసుతో చూస్తే వారికి మాత్రమే నచ్చే సినిమా.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X