Arjun Chakravarthy Movie Review: అర్జున్ చక్రవర్తి మూవీ రివ్యూ అండ్ రేటింగ్
నటీనటులు: విజయ రామరాజు, సిజా రోజ్, హర్ష రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద రెడ్డి, దుర్గేష్ తదితరులు
దర్శకత్వం: విక్రాంత్ రుద్ర
నిర్మాత: శ్రీని గుబ్బాలా
మ్యూజిక్ డైరెక్టర్: విగ్నేష్ భాస్కర్
సినిమాటోగ్రఫి: జగదీష్ చీకటి
ఎడిటర్: ప్రదీప్ నందన్
రిలీజ్ డేట్: 2025-08-29
అర్జున్ చక్రవర్తి (విజయ రామరాజు) అనాథ. తనలోని ప్రతిభను చూసి కబడ్డీ ఆటగాడు (దయానంద్ రెడ్డి) చేరదిసి కబడ్డీ క్రీడలో తిరుగులేని ఆటగాడిని చేస్తాడు. తన గ్రామానికి చెందిన అగ్ర కులానికి చెందిన దేవిక ( సిజా రోజ్)తో ప్రేమలో పడుతాడు. అయితే కొన్ని కారణాల వల్ల అర్జున్‌ను వదిలేసి మరో వ్యక్తిని దేవిక పెళ్లి చేసుకొంటుంది. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్తాడు. కబడ్డీ పోటీలకు దూరమవుతాడు. అంతర్జాతీయ పోటీల నుంచి విరమించుకొంటాడు.

అర్జున్ చక్రవర్తి గతమేమిటి? అర్జున్‌ను రంగయ్య కబడ్డీ ప్లేయర్‌గా ఎలా తీర్చిదిద్దాడు? దేవికతో అర్జున్ ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? అర్జున్ కాకుండా మరో వ్యక్తితో దేవిక ఎందుకు వివాహం చేసుకొన్నది? దేవిక పెళ్లితో అర్జున్ పరిస్థితి ఎలా మారింది? అర్జున్‌కు స్పోర్ట్స్ అథారిటీ అధికారి (అజయ్ ఘోష్) చేసిన మోసం ఏమిటి? కబడ్డీ నుంచి విరమించుకొన్న తర్వాత మళ్లీ అర్జున్ బరిలోకి దిగాడు? అర్జున్ నిర్ధేశించుకొన్న లక్ష్యం ఏమిటి? అర్జున్ తన కలను సాకారం చేసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే అర్జున్ చక్రవర్తి సినిమా కథ.
సినిమా తెర మీద ఇప్పటి వరకు స్పోర్ట్స్ డ్రామాలు చాలానే వచ్చాయి. కబడ్డీ ఆట నేపథ్యంగా కూడా తెలుగులో సినిమాలు వచ్చినప్పటికీ.. ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో అర్జున్ చక్రవర్తిని విక్రాంత్ రుద్ర డీల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే ఈ కథలో కొత్తదనం ఏమీ కనిపించదు. కానీ ఎమోషనల్ డ్రైవ్‌ను పక్కాగా కొనసాగించడం ఈ సినిమాకు ప్రత్యేకం. అర్జున్ క్యారెక్టర్‌ను, రంగయ్య పాత్రల డిజైన్ ఈ సినిమాకు బలంగా కనిపిస్తాయి. అయితే స్పోర్ట్స్ రంగంలో ఉండే పాలిటిక్స్‌ను కొత్త కోణంలో చూపించకుండా.. రెగ్యులర్ కాన్‌ఫ్లిక్ట్‌తో ముందుకెళ్లడం ఈ సినిమా రొటీన్‌గా మార్చింది. అయితే ఈ సినిమా కోసం విజయ రామరాజు ప్రాణం పెట్టి నటించడం అత్యంత పాజిటివ్ అంశంగా చూడొచ్చు. లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. పలు సీన్లు నేచురల్‌గా కాకుండా సినిమాటిక్‌గా ఉండటం ఈ సినిమాలో కనిపిస్తాయి.
అర్జున్ చక్రవర్తిగా విజయ రామరాజు తన పాత్రలో లీనమై నటించడం ఈ సినిమాకు ప్రత్యేకంగా మారింది. కబడ్డీ ప్లేయర్‌గా మారడానికి చేసిన కఠోర శ్రమ, తెరపైన కనిపించిన విధానం బాగుంది. తన వరకు ఈ సినిమాకు, తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. ఇక రంగయ్యగా దయానంద్ రెడ్డి తన కెరీర్‌లో బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషనల్ పాత్రలో జీవించి ఈ సినిమాను మరింత భావోద్వేగంగా మార్చారు. సిజా రోజ్, అజయ్, అజయ్ ఘోష్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. విఘ్నేష్ భాస్కరన్ మ్యూజిక్ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. జగదీష్ చీకటి చిత్రీకరించిన సన్నివేశాలు బాగున్నాయి. హిమలయాల్లో షూట్ చేసిన ఎపిసోడ్ గానీ.. అలాగే కబడ్డీ గేమ్‌ను చూపించిన విధానం బాగుంది. ప్రదీప్ నందన్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాత శ్రీని గుబ్బాలా అనుసరించిన ప్రొడక్షన్ వాల్యూస్, ఈ సినిమా నిర్మాణ విలువలు భాగున్నాయి.
కబడ్డీ ఆట, స్పోర్ట్స్ రంగంలో ఉండే రాజకీయాలు, లవ్, ఎమోషన్స్ అంశాలతో రూపొందిన చిత్రం అర్జున్ చక్రవర్తి. విజయ రామరాజు, దయానంద్ రెడ్డి, టెక్నికల్ అంశాలు పాజిటివ్ అంశాలుగా కనిపించాయి. కొత్తదనం లేకుండా రెగ్యులర్ స్పోర్ట్స్ డ్రామాగా ఉండటం మైనస్‌గా కనిపిస్తుంది. స్పోర్ట్స్ అభిమానులకు, క్రీడా నేపథ్యంగా వచ్చే సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఈ వారం ఈ సినిమాపై ఓ లుక్ వేయండి.


Click it and Unblock the Notifications











