twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అతడు..ఒకటే వారం?

    By Staff
    |

    Athade oka sainyam
    చిత్రం: అతడే ఒక సైన్యం
    నటీనటులు: జగపతిబాబు, నేహా, ప్రకాష్‌రాజు, సుమన్‌,
    బ్రహ్మానందం, ఆలీ తదితరులు
    నిర్మాత: కె.అచ్చిరెడ్డి
    స్క్రీన్‌ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి

    దర్శకుడు ఎస్వీకృష్ణారెడ్డి మళ్ళీ పూర్తిగా ట్రాక్‌ తప్పిపోయాడు. 'పెళ్ళాం ఊరెళితే' అనే రీమేక్‌ చిత్రంతో హిట్‌ ఇచ్చి మరో రెండు చిత్రాలు సంపాదించుకున్నప్పటికీ..వేణుతో 'పెళ్ళాంతో పనేంటి' అనే సినిమా తీసి ప్రేక్షకులను భయపెట్టాడు. ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టు యాక్షన్‌ సినిమా తీస్తున్నాని ప్రకటించుకున్న ఈ దర్శకుడు జగపతిబాబుతో 'అతడే ఒక సైన్యం' తీశాడు. యాక్షన్‌ సినిమాలో కామెడీ కలపడం తన ట్రేడ్‌మార్క్‌ అనుకున్నాడేమో గానీ సినిమా పెద్ద బోర్‌.

    పాయింట్‌ బాగున్నా కథ చెప్పే విధానమే మరీ రోటీన్‌గా ఉంది. హీరో తన పగను కొత్తగా తీర్చుకోవడమే అనే సింపుల్‌ కథ. ఈ కథను ఎంత నిర్లిప్తంగా తీయవచ్చో ఎస్వీ తెలియచేశాడు. ఎక్కడా పట్టు లేకుండా సాగిపోయింది. దానికి తగ్గట్టు పాటలు. 'యమలీల' కాలం వద్దే తన 'క్రియేటివిటీ' ఆగిపోయిందని చెప్పుకోవడానికి అన్నట్లుగా ఇందులోనూ 'నీ జీను..ప్యాంట్‌..' అనే పాట పెట్టాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఈ సినిమా ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

    చంటి (జగపతిబాబు) అన్నయ్య (సుమన్‌) ఒక ప్రైవేట్‌ బ్యాంకు మేనేజర్‌. ఆ బ్యాంకు ఛైర్మన్‌ (ప్రకాష్‌రాజు) డిపాజిట్‌దారుల వద్ద తీసుకున్న డబ్బును తను వాడేసుకొని బ్యాంకును దివాలాతీసి ఆ నేరం సుమన్‌ మీద నెట్టుతాడు. అంతేకాకుండా, అతన్ని చంపిస్తాడు. తన అన్నయ్యను చంపిన ప్రకాష్‌రాజుపై పగతీర్చుకునేందుకు జగపతిబాబు ఒక కంప్యూటర్‌ ఇంజనీర్‌, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్‌, ఒక మెజిషీయన్‌ల సాయం తీసుకుంటాడు. తన పగ తీర్చుకోవడమే కాకుండా ఆ డబ్బును తిరిగి డిపాజిట్‌దారులకు అందేలా చేయడం జగపతిబాబు కర్తవ్యం. కథ. ఈ పాయింట్‌ బాగున్నా, అది సరిగా చెప్పలేదు.

    హీరోగారు ఒక్కడే సైన్యంలా 'పని'ని ముగిస్తాడని టైటిల్‌ చెపుతుంది. కానీ హీరోగారు కంప్యూటర్‌ ఇంజనీర్‌ సాయం, మిమిక్రీ ఆర్టిస్ట్‌ తీసుకొని 'సైన్యాన్ని' విస్తరించడంలో ఆంతర్యం ఏమిటో? అంతేకాకుండా ప్లాష్‌బ్యాక్‌లో అంటే సుమన్‌ను ప్రకాష్‌రాజు చంపించిన ఎపిసోడ్‌లో ప్రకాష్‌రాజును క్రూరమైన విలన్‌గా చూపించాడు దర్శకుడు. కానీ మిగతా సినిమా అంతా కామెడీ విలన్‌గా ఉంటాడు. ఏమిటీ ఈ కన్ఫ్యూజన్‌? హీరో, హీరోయిన్ల మధ్య ఉన్న ప్రేమ సన్నివేశాలు చాలా ఛీఫ్‌గా ఉన్నాయి.

    సినిమాలో రిలీఫ్‌ కాస్తా ఏమైనా ఉంటే అది బ్రహ్మానందం, సునీల్‌ల పుణ్యమే. జగపతిబాబు ఫర్వాలేదనే విధంగా చేశాడు. నేహా కాస్తా అందంగానే కన్పించింది. రెండు పాటలు బాగున్నాయి. దివాకర్‌బాబు మాటలు ఎక్కడా పేలలేదు. ఎస్వీకే ఫిలింస్‌ బ్యానర్‌పై తీసిన ఈ మొదటి చిత్రం ప్రేక్షకులను హింసించిందనే చెప్పాలి. మరోసారి ఎస్వీకే తను మాస్‌ తరహా, యాక్షన్‌ చిత్రాలు చేయలేనని నిరూపించుకున్నాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X