Baahubali 2: The Conclusion Review: బాహుబలి: ది కన్‌క్లూజన్ రివ్యూ
నటీనటులు: ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్ తదితరులు
దర్శకత్వం: ఎస్ఎస్ రాజమౌళి
కథ: విజయేంద్ర ప్రసాద్
నిర్మాత: శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్
సినిమాటోగ్రఫి: సెంథిల్ కుమార్
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
మ్యూజిక్: కీరవాణి
రిలీజ్ డేట్: 2017-04-28
కాలకేయులతో భీకర యుద్ధం తర్వాత అమరేంద్ర బాహుబలి (ప్రభాస్)కు రాజమాత శివగామి దేవీ (రమ్యకృష్ణ) మహిష్మతీ సామ్రాజ్యానికి రాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించుకొంటుంది. పట్టాభిషేకానికి ముందు ప్రజల బాగోగులు తెలుసుకోవడానికి దేశాటన చేయాలని సూచిస్తుంది. సామాన్యుడిగా చేపట్టిన ఆ దేశాటన సమయంలో కుంతల దేశ యువరాణి దేవసేన (అనుష్క శెట్టి)తో ప్రేమలో పడుతాడు. అయితే దేవసేనతో పెళ్లి అంశం శివగామి, భళ్లాల దేవ, బిజ్జాల దేవుడుకి మధ్య విభేదాలు చోటు చేసుకొంటాయి. ఆ విభేదాలు పెరిగి బాహుబలి దంపతులపై అంత:పురం బహిష్కరిస్తూ శివగామి ఆదేశాలు జారి చేస్తుంది.

దేవసేనతో పెళ్లి అంశం మషిష్మతీ సామ్రాజ్యంలో ఎలాంటి కలతలు సృష్టించింది? భళ్లాలదేవ పట్టాభిషేకం సమయంలో బాహుబలికి కలిగిన అరుదైన గుర్తింపు ఏమిటి? బాహుబలిపై భళ్లాలదేవుడు ద్వేషం పెంచుకోవడానికి కారణం ఏమిటి? దేవసేనను అంత:పురంలో ఎలా అవమానించారు? తన భార్యకు జరిగిన అవమానంపై బాహుబలి ఎలా స్పందించాడు? అంత:పుర బహిష్కరణ తర్వాత బాహుబలి జీవితంలో ఏం జరిగింది? బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాల్సి వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానమే బాహుబలి 2: ది కన్‌క్లూజన్ సినిమా కథ.
బాహుబలి 2 కోసం దర్శకుడు రాజమౌళి ఎంచుకొన్న సన్నివేశాలు, యుద్ద ఎపిసోడ్స్ సినిమాకు హైలెట్‌గా మారాయి. శివగామి పూజకు బయలుదేరిన సమయంలో మహేంద్ర బాహుబలికి ఇచ్చిన ఎలివేషన్, అలాగే ఏనుగు సీన్ అందర్నీ కట్టిపడేస్తుంది. బాహుబలిపై అనుమానంతో దేవసేన ప్రశ్నించిన సమయంలో కట్టప్ప ఇచ్చే ఎలివేషన్ సినిమాకు హైలెట్‌గా అనిపిస్తుంది. అమరేంద్ర బాహుబలి సైన్యాధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకొనే సీన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐకానిక్ సీన్‌గా మారిపోయింది.
ఇక అమరేంద్రుడిపై బిజ్లాలదేవ, భళ్లాలదేవ కుట్రలు, కుతంత్రాలు, దేవసేన శ్రీమంతం సీన్, మహేంద్ర బాహుబలి పుట్టిన సమయంలో కట్టప్పతో దేవసేన సంభాషణ మరో హైలెట్‌గా మారింది. భళ్లాల దేవపై మహేంద్ర బాహుబలి ప్రతీకారం తీర్చుకోవడం, వారి మధ్య జరిగే పోరాట సన్నివేశాలు ఉద్వేగభరితంగా ఉంటాయి. మొత్తంగా బాహుబలి2 కథ ప్రారంభమైన దగ్గరి నుంచి చివరి వరకు ప్రతీ సన్నివేశాన్ని ఆసక్తి కలిగించే విధంగా జక్కన చెక్కిన తీరు అమోఘంగా ఉంటుంది.
రాజమౌళి చెక్కిన క్యారెక్టర్లలో ప్రతీ నటుడు చక్కగా ఒదిగిపోయి తమ పాత్రల్లో జీవించారు. ప్రభాస్ ఈ సినిమాలో అమరేంద్ర, మహేంద్ర బాహుబలిగా వన్ మ్యాన్ షో. దేవసేనగా అనుష్క పాత్రను మరోకరిని ఊహించుకోలేం. ఇక శివగామి పాత్రను రమ్యకృష్ణ తప్ప మరొకరు చేయలేరనే విధంగా నటించింది. బిజ్లాల, భళ్లాలదేవగా రానా, నాజర్, కట్టప్పగా సత్యరాజ్ ఎప్పటికీ తీసిపోని తీరుతో నటించారు.
అద్బుతమైన సాంకేతిక విలువలను రాజమౌళి జొప్పించాడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి, కీరవాణి మ్యూజిక్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో హైలెట్‌గా నిలిచాయి. శోభు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ అనుసరించిన నిర్మాణ విలువల గురించి ఎంత చెప్పిన తక్కువే అనే విధంగా ఉంటుంది. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ సందర్భంగా బాహుబలి 2 లోని గొప్పతనాన్ని, వారి కష్టాన్ని ప్రేక్షకులకు మరోసారి గుర్తు చేయడానికి ఈ రివ్యూను ఫిల్మీబీట్ అందించడం జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











