For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  గెలిచిన 'సింహా' (రివ్యూ)

  By Srikanya
  |
  Simha
  Rating
  -జోశ్యుల సూర్య ప్రకాష్
  సినిమా: సింహా
  సంస్థ: యునైటెడ్‌ మూవీస్‌
  నటీనటులు: బాలకృష్ణ, నయనతార, నమిత, స్నేహావుల్లాల్‌, కె.ఆర్‌.విజయ,
  సాయికుమార్‌ (మలయాళ నటుడు), హేమంత్‌, శ్రావణ్‌, జీవీ, కిన్నెర, కోట శ్రీనివాసరావు,
  బ్రహ్మానందం, అలీ, కృష్ణభగవాన్‌, వేణుమాధవ్‌, ఎల్బీ శ్రీరామ్‌, ఆనందభారతి తదితరులు.
  సంగీతం: చక్రి
  ఆర్ట్స్: ఎ.ఎస్.ప్రకాష్
  కెమెరా: విల్సన్
  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
  రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను
  నిర్మాత: పరుచూరి కిరీటి
  విడుదల తేది: 30, ఏప్రియల్ 2010

  "చరిత్ర సృష్టించాలన్నా తిరగ రాయాలన్నా మా వంశం వారికే చెల్లు" అంటూ బాలకృష్ణ..'సింహా' వచ్చేసింది. బాలయ్య గత హిట్ చిత్రాలు 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు','లక్ష్మీ నరసింహ' టైటిల్స్ లో కామన్ గా ఉన్న 'సింహా' ని తీసుకుని సెంటిమెంట్ గా టైటిల్ పెట్టారని సినిమా రిలీజ్ ముందు వరకూ అంతా అనుకున్నాం. అయితే ఆ హిట్ చిత్రాల్లోని కీలకమైన సీన్స్,స్క్రీన్ ప్లే ను కూడా తీసుకుని సినిమాను రూపొందించారు అని చిత్రం చూసాక అర్ధమవుతుంది. ఇక విడుదలకుముందే విపరీతమైన అంచనాలు పెరిగిన సింహా...ఆ రేంజి అంచనాలు అందుకుందా అంటే కొంత మేరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. నిజానకి వరస ఫ్లాపులతో దూసుకుపోతున్న బాలకృష్ణకు ఈ చిత్రంతో రిలీఫ్ దొరికినట్లే. కానీ పాత కథ, ఎన్నో సినిమాల్లో ఇప్పటికే చూసిన సీన్లతో దర్శకుడు అల్లిన కథనమే కాస్త ఇబ్బంది పెడుతుంది. అయితే బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగులు, ఎమోషన్స్ పండించే తీరు ఆ లోటు తెలియనివ్వదు. అలాగే హీరోయిన్స్ లో నమిత మరీ లావై ఇబ్బంది పెడితే, స్నేహా ఉల్లాల్..బాలకృష్ణ నిండైన విగ్రహం ముందు తేలిపోయింది. ఉన్నంతలో నయనతారే ఎపిసోడ్ బావుందనిపిస్తుంది. అయితే బాలకష్ణ ద్విపాత్రలలో వేరియేషన్ చూపుతూ...వయస్సును లెక్కచేయకుండా చేసే యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు ప్రాణమై నిలుస్తాయి. ముఖ్యంగా బాలకృష్ణ అభిమానులుకు ఈ చిత్రం బాగా నచ్చే అవకాశం ఉంది.

  కాలేజీ ప్రొపిసర్ శివన్నారాయణ (బాలకృష్ణ) అన్యాయాలను ఎదిరిస్తూ స్ట్రిక్ గా ఉంటున్న బ్యాచిలర్. అతన్ని కాలేజీలో ఉండే తోటి లెక్చరర్ (నమిత) ప్రేమిస్తూంటుంది. ఈ లోగా అక్కడ కొత్తగా చేరిన స్టూడెంట్ జానకి (స్నేహా ఉల్లాల్) కూడా ప్రేమలో పడుతుంది. అయితే జానకికి విలన్స్ తో కూడిన ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుంది. నిజానకి ఆమె వారి నుంచి దాక్కోవటానకే అక్కడికి వచ్చిందని తర్వాత రివిల్ అవుతుంది. ఆ విలన్స్ జానికిని ఎత్తుకుపోవటానకి ప్లాన్ చేసి, వెంబడిస్తూంటే సేవ్ చేసిన శివన్నారాయణకు వారి గురించి మరో నిజం తెలుస్తుంది. అది...ఆమె తండ్రి శత్రువు, తన తండ్రి శత్రువు ఒకటేనని, అలాగే ఆమె మరెవరో కాదు..తన మామయ్య కూతురేనని. అసలు ఇంతకీ ఆ విలన్ ఎవరు..అతని తండ్రి నరసింహ(రెండో బాలకృష్ణ) కి ముప్పై ఏళ్ళక్రిందట ఏం జరిగింది..అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

  ఎలాగైనా హిట్ కొట్టాలని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఫార్ములా ప్రకారం ఏరి కూర్చి వండిన కథ సింహా అని మొదటి సీన్ నుంచే మనకు అర్ధమవుతూంటుంది. అయితే బాలకృష్ణ అభిమానులకు ఏమి కావాలో వాటిని తెరపై పండించటంలో దర్శకుడు సక్సెస్ అవ్వటం ప్లస్ పాయింట్. కథ పాత బాలకృష్ణ చిత్రాల పంధాలోనే మొదలై ఇంటర్వెల్ చేరి ఆ తర్వాత రెగ్యులర్ గానే అందరూ ఊహించనట్లే ప్లాష్ బ్యాక్ వస్తుంది. అయితే ప్లాష్ బ్యాక్ లో ఉండే కథలో బాలకృష్ణ నరసింహ పాత్రను డాక్టర్ ని చేయటం, ఎమోషనల్ గా డైలాగులు చెప్పించటంతో మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ అదే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్...ముప్పై ఏళ్ళ క్రిందట జరిగనట్లు స్క్రీన్ పై పండించటంలోనే దర్శకుడు ఆ నేటివిటీని, కాలాన్ని ప్రెజెంట్ చేయటంలోనే ఫెయిలయ్యాడు.

  ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రాణమై నిలిచింది. అలాగే హింసను అంత విపరీతమైన రేంజిలో చూపటం కూడా సమంజసనీయంగా అన్పించదు. ఇక చిత్రం ఫస్టాఫ్ కన్నా సెకెండాఫ్ బాగుండి ఈ చిత్రాన్ని నిలబెడుతుంది. చిత్రంలో "నేను మాట్లాడుతున్నప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి..అది తప్ప వేరే ఏదైనా పని చేస్తే నీకు నెక్ట్స్ బర్తడే ఉండదు" అంటూ బాలకృష్ణ హైలెట్ హై ఓల్టెజ్ తో చెప్పే డైలాగులుకు టప్పట్లు పడ్డాయి. నటుల్లో కోట ఎప్పటిలాగే అదరకొడితే విలన్ గా చేసిన మళయాళ నటుడు సాయికుమార్ తమ పాత్రలను ఒప్పించారు. అలాగే కృష్ణ భగవాన్, వేణుమాధవ్, ధర్మవరపు, ఝాన్సీ సినిమాలో నవ్విద్దామని చాలా ప్రయత్నం చేసి దారుణంగా ఫెయిలయ్యారు. కెమెరా అదరకొడితే.. చక్రి మరింత మ్యూజిక్ ఇవ్వవచ్చు అనిపిస్తుంది. డైరక్టర్ గా బోయపాటి సేఫ్ గేమ్ ఆడారని స్పష్టంగా అర్ధమవుతుంది.

  ఏదైమైనా సింహా బాలకృష్ణ అభిమానులకు విపరీతంగా నచ్చితే, మిగిలిన వారికి బాలకృష్ణ గతంలో వచ్చిన హిట్ సినిమాను మరో సారి చూసిన ఫీలింగ్ వస్తుంది. బి, సి సెంటర్లలో బాగా ఆడుతుందనిపించే ఈ చిత్రం హింస మోతాదు తగ్గితే ఫ్యామిలీలను కూడా ఎక్సపెక్ట్ చేయవచ్చు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X