For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బలివాడ ('బెజవాడ' రివ్యూ)

  By Srikanya
  |

  -జోశ్యుల సూర్య ప్రకాష్
  సంస్థ: శ్రేయ ప్రొడక్షన్స్‌
  నటీనటులు: నాగచైతన్య, అమలా పాల్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, ప్రభు, ముకుల్‌దేవ్‌, అజయ్‌, అభిమన్యు సింగ్‌, సత్యప్రకాష్‌, అంజనాసుఖాని, శుభలేఖ సుధాకర్‌ తదితరులు
  సంగీతం: అమర్ మోహ్లి, ప్రదీప్ కోనేరు, ధరమ్ సందీప్, విక్రమ్, భూపి తతుల్
  ఛాయాగ్రహణం:ఎస్.కె.భూపతి
  ఎడిటింగ్: గౌతమ్ రాజు
  ఫైట్స్ :జావేద్
  ఆర్ట్: కృష్ణ మాయ
  నిర్మాతలు: రామ్‌గోపాల్‌ వర్మ, కిరణ్‌ కుమార్‌ కోనేరు
  కధ,స్క్రీన్ ప్లే,మాటలు,దర్శకత్వం: వివేక్‌కృష్ణ
  విడుదల తేదీ:డిసెంబర్ 1, 2011

  1989లో విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ తో 'శివ'చేసి నాగార్జున కి బ్రేక్,కెరీర్ కి ఊపు ఇచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఆయనే మళ్సీ ఇరవై సంవత్సరాల తర్వాత అదే హీరో కొడుకుతో అదే బ్యాక్ డ్రాప్ లో 'బెజవాడ'సినిమా చేస్తున్నాడంటే అందరికీ ఆసక్తే. దానికి తోడు బోనస్ లా ఈ సారి కాంట్రావర్శిని కూడా రగలించి సినిమాకు ప్రారంభం రోజు నుంచే క్రేజ్ తెచ్చాడు. అయితే అవన్నీ సినిమాకు మంచి ఓపినింగ్స్ తేవటం వరకే పనికివస్తాయని,విషయం లేకపోతే ఇవన్నీ ఎందుకూ కొరగావని మరో మారు తేలిపోయింది. వర్మకు ప్లాప్ లు అలవాటే కానీ,నాగచైతన్యే రెండో సారి సైతం యాక్షన్ హీరోగా నిలదొక్కుకోలేని స్ధితిని ఈ సినిమా మిగిల్చింది.

  శివకృష్ణ(నాగచైతన్య)ఓ కాలేజి స్టూడెంట్(ఎప్పుడూ క్లాసులుకి వెళ్లినట్లు చూడలేదేం అని అడగొద్దు).అతను సిటీ కమీషనర్(ఆహుతి ప్రసాద్)కూతురు గీతాంజలి(అమలా పౌల్)ని ప్రేమిస్తూంటాడు.ఈ ప్రేమాయణం ఇలా ఉంటే శివకృష్ణ అన్నయ్య విజయ కృష్ణ(ముకుల్ దేవ్) విజయవాడ గాడ్ ఫాదర్ కాళి (ప్రభు)కి నమ్మిన బంటు.అయితే కాళికి తన తమ్ముడు శంకర్(అబిమన్యు సింగ్)కంటే కూడా విజయ కృష్ణ అంటే నే అబిమానం.దాంతో రగిలిపోయిన శంకర్ తన అన్న కాళిని,ఆ తర్వాత విజయకృష్ణని చంపేసి తనే గాడ్ ఫాధర్ అవుతాడు. అప్పుడు తన అన్నని చంపిన వారిపై పగ తీర్చుకోవటానికి మన కాలేజి స్టూడెంట్ శివకృష్ణ ఆవేశంగా బయిలు దేరతాడు. అప్పుడు ఏం జరిగింది.ఎలా తన ప్రతీకార జ్వాలలలో సిటిని మండించాడు అనేది మిగతా కథ.

  "కొత్త దర్శకుడిగా నాపై చాలా మంది దర్శకుల ప్రభావం ఉంది. అందులో వర్మ కూడా ఒకరు తప్ప, ఆయన ఒక్కరే కాదు. అక్కడక్కడా నాకు నచ్చిన షాట్స్, సీన్లను 'బెజవాడ'లో కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నించాను'' అంటూ దర్శకుడు వివేక్ కృష్ణ ఈ చిత్రం గురించి చెప్పుకొచ్చారు. ఆయన తనను తర్వాత ఎవరూ వేలు పెట్టి చూపకూడదని చెప్పారో మరెందుకో కానీ..ఈ సినిమాలో మొదటి సీన్ చూసినప్పుడే అతను చెప్పింది అక్షరాలా నిజమని అర్దమవుతుంది. ఎందుకంటే సినిమా ప్రారంభమే గాఢ్ ఫాధర్ లోని తొలి సన్నివేశం బెజవాడలో కనిపిస్తుంది.అలాంటివి ఈ సినిమాలో ప్రతీ నాలుగు సీన్స్ కి ఒకటి పంటిక్రింద రాయిలాగ తగిలి మన జ్ఞానపశక్తి మీద మనకు అపారమైన నమ్మకం కలిగిస్తూంటాయి.అవన్నీ తెలుగు సినిమాలు కామనే,మాకు తెలిసిన బెజవాడ రాజకీయాల మీద సినిమాకదా అని ఉత్సాహపడితే...ఈ సినిమాకీ,బెజవాడ రౌడీ రాజకీయాలకు ఏమీ సంభందం లేకుండా చేసి తుస్సుమనిపిస్తాడు.

  ఆ విషయం ప్రక్కన పెడితే సినిమా కథ,మాటలు సమకూర్చుకున్న ఈ దర్శకుడు వాటిని గ్రిప్పింగ్ గా తెరపై ప్రెజెంట్ చేయటంలో విఫలమయ్యాడు. ఎక్కడో ఒకటి రెండు డైలాగులు తప్ప ఆసక్తి కలిగించవు .అందులోనూ తొలిసగంలో అస్సలు హీరో కనపడేది చాలా తక్కువ సేపు..మొత్తం కథను సెటప్ చెయ్యటంలో హీరోని పాటలకు తప్ప కథలోకి తీసుకురాలేకపోయారు. ఇక ద్వితీయార్దం విషయానకి వచ్చేసరికి..విలన్ పరిస్ధితి దారుణంగా తయారవుతుంది. హీరో కొట్టిన దెబ్బకు మందు రాసుకోవటమూ, డైలాగులు చెప్పటంతో క్లైమాక్స్ కు చేరువ అవుతుంది. అలా విలన్ నీరసపడి,హీరోను ఏమీ చెయ్యలేక,భయపడుతూ,హీరోని అంత గొప్పవాడు..ఇంత గొప్పవాడు అని భజన చేస్తూ కూర్చోవటంతో హీరో కి ఏం చేయాలో పాలుపోదు. కాస్సేపు విజయవాడలో రౌడీయిజం లేకుండా చేస్తానని శపధాలు చేస్తాడు. ఆ కాస్సేపటికే విలన్ అంతు చూడాలి అని మళ్లీ డైలాగులు చెప్తూంటాడు.ఇలా ఇద్దరూ సినిమాకు కీలకమైన సెకండాఫ్ సమయాన్ని డైలాగులు చెప్పుకోవటంతో గడిపేయటంతో,క్యారెక్టర్ ప్యాసివ్ గా మారి బోర్ కొట్టడం మొదలైంది.

  ఇదిలా ఉంటే దీనికి తోడు కథకు సంభందం లేకుండా బ్రహ్మానందం,ఎమ్ ఎస్ నారాయణ ల కామెడీ,హీరో,హీరోయిన్స్ డ్యూయిట్స్ అసందర్భంగా వచ్చి విసిగిస్తాయి. హీరోయిన్ క్యారెక్టర్ అయితే కేవలం పాటలకే పరిమితం చేసారు.ఆమె వచ్చిదంటే గ్యారెంటిగా పాటో, లేకపోతే హీరోకు హితభోధలు చేయటానికో అన్నట్లు తయారైంది. ఆ పాటలైనా వినసొంపుగా ఉన్నాయా అంటే అన్నీ సిగరెట్ కు జనం బయిటకు పారిపోయే పాటలే. ఇక కెమెరా వర్క్ గురించి,ఎడిటింగ్ సినిమాకు తగ్గట్లే నాశిరకంగా ఉన్నాయి.దర్శకత్వం గురించి చెప్పాలంటే తెలుగులో వచ్చే సి గ్రేడ్ సినిమాల తరహాలో ఉంటుంది.

  ఏదైమైనా రామ్ గోపాల్ వర్మ ఎప్పటిలాగే జన్నాల్ని మోసం చేసారు.'బెజవాడ'పూర్తిగా నిరాశపరిచే సినిమా.అయితే అర్ధం లేని హింస,సిట్యువేషన్ లేని పాటలు,నవ్వురాని కామిడీ లని సినిమాలో ఎలా ఇమర్చవచ్చు అనే విషయాలను సోదాహణంగా తెలుసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా చూడాల్సిన సినిమా.

  English summary
  RGV's latest Bejawada released today with negative talk.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X