For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బెండు అప్పారావు(రివ్యూ)

  By Srikanya
  |

  Bendu Apparao RMP

  Rating

  --జోశ్యుల సూర్య ప్రకాష్
  సంస్థ: సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి. నటీనటులు: అల్లరి నరేష్, కామ్న జెఠ్మలానీ, మేఘన, ఆహుతి ప్రసాద్‌, కృష్ణభగవాన్‌, చలపతిరావు, రఘుబాబు, ధర్మవరపు, ఎల్బీ శ్రీరామ్‌, శకుంతల, అనితానాథ్‌.
  నిర్మాత:ఆర్ట్: బి.వెకటేశ్వరరావు
  కెమెరా: వి.జయరామ్
  ఎడిటింగ్: గౌతంరాజ్
  సంగీతం: కోటి
  నిర్మాత: డి.రామానాయుడు
  దర్శకత్వం: ఇ.వి.వి.సత్యనారాయణ

  ఏ డాక్టరూ లేనిచోట ఆర్.ఎంపి డాక్టర్ దేముడు అన్నట్లు..వరసగా వస్తున్న చెత్త చిత్రాల మధ్య ఏ మాత్రం కాస్త రిలీఫ్ దొరికే సినిమా కనపడినా ఫరవాలేదనిపిస్తుంది. అదే కోవలో ఈ బెండు అప్పారావు ఆర్.ఎంపి చేరుతుంది. అయితే ఈ చిత్రంలో డైలాగులు మీద పెట్టిన శ్రధ్ద కథ,కథనాల మీద పెడితే మరింత బావుండనిపిస్తుంది. అలాగే సిట్యువేషన్ కామిడీ కన్నా డైలాగ్ కామిడీనే ఎక్కువ ఆశ్రయించటంతో కొన్ని చోట్ల సినిమా వింటున్నట్లు ఫీల్ కలగుతూంటుంది. అయినా సురేష్ ప్రొడక్షన్ లాంటి పెద్ద బ్యానర్ నుంచి రాదగ్గ సినిమా కాకపోయినా ఇవివి స్కూల్ నుంచి మాత్రం ఇలాంటి సినిమానే ఎక్సపెక్ట్ చేయవచ్చు.

  బొబ్బర్లంక అనే పల్లెలో బెండు అప్పారావు(అల్లరి నరేష్) అనే ఆర్.ఎంపి డాక్టర్ తనకు తెలిసిన వైధ్యం చేస్తూ అడ్డదిడ్డంగా సంపాదిస్తూ వెలిగిపోతూంటాడు.అఫ్ కోర్స్ అతని అడ్డదిడ్డ సంపాదనకు కట్నం కోసం వేధించే బావ(కృష్ణ భగవాన్)అనే రీజన్ ఉంటుంది(గృహహింస చట్టం ఇంకా రాని రోజుల్లో రాసుకున్న కథ కావచ్చు). ఇక ఈ అప్పారావుకి అతి మర్యాదలు చేసి బెదరకొట్టే ఆ ఊరి రాజుగారు(ఆహుతి ప్రాసాద్)గారి కూతురు పద్మ ప్రియ (కామ్నా)తో లవ్ ఇంట్రస్టు ఉంటుంది. అలాగే పనిలో పనిగా ఓ బేవార్స్ బ్యాచ్ (శ్రీనివాసరెడ్డి, ఉత్తేజ్)తో ప్రెండ్ షిప్ ఉంటుంది.ఇలా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ మెంట్ పూర్తయ్యాక కథలో అతిధి లాంటి మలుపు వస్తుంది. ఎప్పుడో ఇంట్లోంచి పారిపోయిన ఓ వ్యక్తి డబ్బు సంపాదించి ఇంటికి తిరిగి వస్తూ యాక్సిడెంట్ కి గురి అవుతాడు. అతను మరణిస్తూ మన అప్పారావు అతని ప్రెండ్స్ కి తగులుతాడు. అంతేగాక తన దగ్గర ఉన్న పదిహేను లక్షలు తన కుటుంబానికి అప్పచెప్పమని వారికి అప్పచెబుతాడు. అయితే వారి ఎడ్రస్ తెలియని అప్పారావు తప్పనిసరి స్ధితిలో ఆ డబ్బుని తమ అవసరాలకి,ఊరి అవసరాలకి ఖర్చు పెడతాడు. ఈలోగా మనమూహించినట్లే ఆ చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ ఆ ఊళ్లో దిగుతుంది. అప్పుడు అప్పారావు ఏం చేస్తాడు..అనేది మిగతా కథ.

  ఈ చిత్రంలో కథ సమస్యలోకి పడేసరికి(చనిపోయిన వ్యక్తి ప్యామిలీ ఆ ఊరు రావటం)సెకెండాప్ సగం జరిగిపోతుంది. దాంతో ఆ సమస్యని పరిష్కరించటానికి స్క్రీన్ టైమ్ సరిపోలేదు. అయినా సమస్య వచ్చిన తర్వాత దాన్ని హీరో ఎలా ఫేస్ చేసాడు..ఆ క్రమంలో ఏ ఇబ్బందులు పడ్డాడు అనే దిశగా కథనం నడవదు.సమస్యకు పరిష్కారం ఆ చనిపోయిన వ్యక్తి చెల్లెని పెళ్లి చేసుకోవడమే అని హీరో నిర్ణయించుకోవటం విచిత్రంగా అనిపిస్తుంది. ఇది స్క్రీన్ ప్లే లోపమే. అనుకున్న పాయింట్ ని పూర్తి స్ధాయి కధగా విస్తరింపచేయలేదు. ఈ విషయాన్ని ప్రక్కన పెడితే వెలగొండ శ్రీనివాస్ డైలాగులు చాలా వరకూ లాక్కొచ్చాయి. అలాగే ఇవివి మార్క్ క్యారెక్టరైజేషన్స్ బావున్నాయి. ఆహుతి ప్రసాద్ అతి మర్యాదలు అలరిస్తాయి. ఇక ఎల్.బి.శ్రీరాం పందెం కోడి వ్యవహారం సగంలో తేల్చకుండా ముగించేసారు. లెంగ్త్ ఎక్కువై ఎడిటింగ్ లో పోయినట్లుంది. అలాగే శ్రీనివాసరెడ్డి, ఉత్తేజ్ దుబాయి ట్రిప్ కామిడీ ట్రాక్ కూడా పండలేదు. అయితే ఉన్నంతలో రఘుబాబు బాగా చేసాడు. అల్లరి నరేష్ ఒక్క ఎక్సప్రెషన్ కూడా కొత్తది ఇవ్వలేదు. హీరోయిన్ కామ్నా ఓవర్ స్లిమ్ అయి అసలు అందం పోగొట్టుకుంది. ఎడిగింగ్ ఓ మాదిరిగా ఉంది. దర్శకుడుగా ఇవివి ఆరోగ్యం బాగోలేని స్ధితిలో ఈ సినిమా పూర్తి చేసారు. అది స్పష్టంగా చాలా చోట్ల కనపడుతుంది. కోటి అందించిన పాటలు గొప్పగా లేవు. అలాగే వాటిని కూడా మ్రెక్కుబడిగా తీసారు.

  అప్పుడప్పుడూ నవ్వొచ్చే డైలాగులు, సిట్యువేషన్స్, ఫీలయితే కాస్త సెంటిమెంట్ ఉన్నాయి కాబట్టి ధైర్యం చేయవచ్చు. అలాగే బూతులు,అక్రమ సంభంధాలు చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి కాబట్టి ఫ్యామిలీలని ఎంకరేజ్ చేయవచ్చు. అయితే పూర్తి స్ధాయి ఎంటర్టైనర్ గా మాత్రం ఫీలయి వెళ్తే నిరాశే మిగులుతుంది. ఏదైమైనా మరీ మన బెండు తీయని ఈ అప్పారావు ఓ బిలో యావరేజ్ సినిమా అనిపిస్తుంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X