For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బేరం లేని 'బోణి'(రివ్యూ)

  By Staff
  |

  Boni

  Rating

  -సూర్య ప్రకాష్ జోశ్యుల
  సంస్థ: గ్రీన్‌ మ్యాంగోస్‌ సినిమా
  నటీనటులు: సుమంత్‌, కృతి, త్రినేత్రుడు, తనికెళ్ల భరణి, జయప్రకాష్‌ రెడ్డి, చంద్రమోహన్‌,
  ఆహుతి ప్రసాద్‌, సత్యప్రకాష్‌, సుధ, సురేఖావాణి, వేణు తదితరులు.
  ఆర్ట్స్: ఆనంద సాయి
  కెమెరా: ఎల్.ఆండ్రూ
  ఎడిటింగ్: వర్మ
  సంగీతం,నిర్మాత: రమణ గోగుల
  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజ్‌ పిప్పాళ
  రిలీజ్ డేట్: జూన్ 12,2009.

  పులిహోర సెంటర్ పెట్టాలంటే ఏడు లక్షలు కావాలి..ఆ డబ్బు ని సంపాదించేందుకు కిడ్నాప్ లు, మర్డర్స్ చేయాలి..అంటూ కథ మొదలెడితే ఏ నిర్మాత అయినా ఒప్పుకుంటాడా..ప్రముఖ సంగీత దర్శకుడు రమణ గోగుల ఆ సాహసం చేసి నిర్మాతగా బోణి కొట్టాలని బయిలు దేరాడు. అతనికి తోడుగా వరస ఫ్లాఫ్ లతో సతమతమవుతున్న సుమంత్ ని తీసుకున్నాడు. ఇక ఇంతోటి కథ చెప్పిన వానికే దర్శకత్వ బాద్యతలు సైతం అప్పచెప్పి కెరీర్ కి బోణి కొట్టుకోమని అవకాశం ఇచ్చాడు. అయితే అంతా తిరగబడింది. ఈ పులిహోర కథ మాకొద్దని ప్రేక్షకులు ముఖాలు మాడ్చుకుంటున్నారు. వాళ్ళకి మన క్రియేటివిటీని ఆస్వాదించేంత టేస్ట్ లేదని తిట్టుకోవటం తప్ప చేయగలిగింది ఏముంటుంది.

  అన్ని సినిమాల్లోలాగానే డిడి (సుమంత్) అతని క్లోజ్ ప్రెండ్ చిన్నా (త్రినేత్రుడు) అనాధలు. వారికి ఒకటే జీవితాశయం ఎప్పటికైనా పులిహోర సెంటర్ పెట్టాలని.అలాగని వారేమీ పులిహోర చేయటంలో ఎక్సపర్ట్స్ అని ఎక్కడా ఉండదు. అందుకోసం ఏడు లక్షలు అవసరమవుతాయి. అదేంటి పులి హోర సెంటర్ కి పెట్టుబడి అంతా అని నోరు తెరవద్దు...ఓ రేంజిలో పెట్టాలనది వారి కోరిక కావచ్చు. ఇక ఆ డబ్బు సంపాదించటం కోసం దాసన్న (జయప్రకాష్ రెడ్డి) అనే లోకల్ డాన్ వద్ద పనికి కుదురుతారు. డిడికి దాసన్న'బోణి'గా ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయమని పురమాయిస్తాడు. ఆ అమ్మాయి మరెవరో కాదు..(మీరూహించిందే..హీరోయిన్ )వ్యవసాయ శాఖ మంత్రి (ఆహుతి ప్రసాద్) కూతురు ప్రగతి (క్రితి).అయితే ఇక్కడో ట్విస్ట్ ఉంది. ప్రగతికి ఓ జీవితాశయం ఉంది. అది పేదరైతులు రుణాలు తీర్చాలని. అందుకోసం నాలుగు కోట్లు అవసమవుతాయి. దాంతో ఆమె సెల్ఫ్ కిడ్నాప్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటుంది.పోన్లెండీ ఆమె కూడా మళ్ళీ ఏ డాన్ వద్దో పనికి చేరకుండా ఈ డ్రామా ప్రారంభిస్తుంది. అయితే ఈ విషయం తెలియని మన హీరో గారు ఆమెను కిడ్నాప్ చేస్తారు. ఆమె కూడా తన వాళ్లే కిడ్నాప్ చేసారని హ్యాపీగా సహకరిస్తుంది. అప్పుడేమవుతుంది...ఇంతకీ హీరోయిన్ ని ఎవరు కిడ్నాప్ చేయమని పురమాయించారు. అసలు విషయం తెలుసుకున్న హీరో ఏం చేసారు. అతని పులిహోర సెంటర్, ఆమె రైతుల కళ్ళల్లో ఆనందం దొరికాయా అన్న విషయాలు తెరపై చూసి ఆనందించాల్సిందే.

  హీరోయిన్ సెల్ఫ్ కిడ్నాప్ ప్లాన్, అప్పుడే హీరో కిడ్నాప్ అనేది చెప్తున్నప్పుడు చాలా ధ్రిల్లింగ్ అనిపించి ఉండవచ్చు. మనీ సినిమా అంత మనీ తెచ్చిపెడుతుందనే ఆవేశం రప్పించి ఉండవచ్చు. అయితే స్ట్రైయిట్ నేరేషన్ లో చెప్పిన ఈ కథలో కొన్ని సహజంగా జరిగే సంఘటనలును కావాలని మరుగున పరచంతో కథనం ప్రక్క దారి పడుతుంది. హీరోయిన్ తాను ప్లాన్ చేసుకున్న కిడ్నాప్ డ్రామా నే అని ఫీలయినప్పుడు మా నాన్నకు ఫోన్ చేసి నాలుగు కోట్లు అడిగారా ..ఎప్పుడిస్తారన్నారు అనే ముఖ్యమైన ప్రశ్నని ఎక్కడా హీరోని చేయదు. వేస్తే హీరోకి అసలు విషయం అప్పుడే బయిటపడి కథ పూర్తయిపోతుందని భయంతో అలా చేయలేదనిపిస్తుంది. అలాగే హీరోయిన్ తండ్రి అంత పెద్ద మినిస్టరు కూడా ఎక్కడా నా కూతరు కనపడటం లేదు..ఎంక్వైరీ చేయాలి అనుకోడు..అదే వస్తుందిలే అని సరిపెట్టుకుంటాడు.ఎందుకంటే ఈ క్యారెక్టర్ రంగంలోకి దిగినా మొత్తం కథ ఆగిపోతుంది.

  అలాగే ఆ తర్వాత నాలుగు కోట్లు కిడ్నాపర్లు డిమాండ్ చేసారని తెలిసినప్పుడు ఏమాత్రం ఆయనకు అనుమానం రాదు. తన కూతరు అంతకుముందు రోజు తనని నాలుగు కోట్లు అడిగి ఇవ్వలేదని అలగింది..ఆమే ఈ డ్రామా ఆడిస్తోందా అనిపించదు. వీటిన్నటినీ ప్రక్కన పెడితే మన హీరో గారు ఆమెతో ప్రేమలో పడినప్పుడు తన ప్రేయసిని ఎవరు కిడ్నాప్ చేయమని చంపమని పురమాయిస్తున్నారు అనే విషయం తెలుసుకుందామనిపించదు. ఇలా అన్ని పాత్రలూ బుర్రలు క్లోజ్ చేసుకుని కేవలం రైటర్ రాసిన స్క్రిప్టుని ఫాలో అయ్యి ముప్పు తెచ్చిపెట్టారు. మానవ సహజమైన అనుమానాలు, ఆలోచనలు కూడా రాకుండా కేవలం రొబో లలా మిగిలారు. అదే ఈ కథలో ఇంటర్వెల్ కే హీరోకు ఆమెను ఎవరు కిడ్నాప్ చేయమన్నారో తెలిస్తే అక్కడనుంచి అయినా విలన్ మీద యుద్ద ప్రకటన ఉండి సెకెండాఫ్ పరిగెత్తేది. ఎత్తుకున్న పాయింట్ పులిహోరలోనే లోపం ఉన్న ఈ కథ చివరి వరకూ ఆ రూట్లో నన్నా వెళ్ళక కిడ్నాప్ లు, రైతులు సమస్యలతో వెళ్లటం బోరనిపిస్తుంది. హీరో చేయటానికి ఏమీ లేకు ప్యాసివ్ గా మారి బోర్ తెప్పిస్తూంటాడు.

  ఇక టెక్నికల్ గా కెమెరా మెన్ చాలా బాగా చేసాడనిపిస్తుంది. దర్సకుడుగా కొన్ని చోట్ల ఎన్నారై దర్శకుడు కొన్ని మెరుపులు మెరిపించాడు. రమణ గోగుల సంగీతం పెద్దగా ఆకట్టుకోడు. సుమంత్ ఎప్పటిలాగే కొంచెం డల్ గా,కొంచెం మెచ్యూర్ గా చేసాడు. హీరోయిన్ గా పరిచయమైన కృతి పెద్దగా ఆకట్టుకోదు.ఆహుతి ప్రసాద్, చంద్రమోహన్ పరిధి తక్కువైనా ఫవరాలేదనిపించారు. కామిడీ వైపు చూస్తే అండర్ కవర్ కాప్స్ గా సత్యం రాజేష్, సీనియర్ నరేష్ నవ్వించే ప్రయత్నం చేసారు. అలాగే విలన్ జయప్రకాష్ రెడ్డి పాత్ర...రామ్ గోపాల్ వర్మ క్షణం క్షణంలో పరేష్ రావల్ ని అనుకరిస్తూంటుంది. అందుకేనేమో సుమంత్ ఈ సినిమాను క్షణం క్షణంతో పోల్చి పబ్లిసిటీ చేస్తున్నాడు. ఇక డైలాగులు అయితే..అడపాదడపా పేలాయి.

  ఓపినింగ్స్ బాగా తెచ్చుకున్నా ఏదైమైనా నిర్మాతగా రమణగోగుల బోణీ కొట్టలేదు. ఎంతపబ్లిసిటీ చేసినా ఈ పులిహోర సినిమా వర్కవుట్ అయ్యేటట్లు కనపడటం లేదు.నెక్ట్స్ టైమ్ బెటర్ లక్. ఇక హీరో సుమంత్ కి ఫ్లాఫ్ అనేది కామన్ కాబట్టి పెద్దగా పట్టించుకునే పనిలేదు. హీరోయిన్ గా కృతి కొనసాగటం కష్టమే. అలాగే దర్శకుడు దగ్గర మరో పది కథలు దాకా ఉన్నాయని ఇంటర్వూలలో చెప్తున్నారు. అవీ ఇలాంటివే అయితే వెంటనే సరిదిద్దుకోపోతే కెరీర్ ఎప్పటికీ దిద్దుకోలనేంత సమస్యలో పడుతుంది. అలాగే పోస్టర్స్ చూసి ఆవేశపడిపోయి ధియోటర్స్ లోకి దూకితే ఇలాంటి సినిమాలు కూడా అప్పుడప్పుడూ చూడాల్సి వస్తుందనే సంగతి ప్రేక్షకులుకు తెలియచేస్తుందీ సినిమా.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X