»   »  చింతకాయలు రాల్లేదు (చింతకాయల రవి రివ్యూ)

చింతకాయలు రాల్లేదు (చింతకాయల రవి రివ్యూ)

Subscribe to Filmibeat Telugu
Rating
-జోశ్యుల సూర్య ప్రకాష్
బ్యానర్:లక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్
తారాగణం:వెంకటేష్,అనుష్క,మమతా మోహన్ దాస్,బ్రహ్మానందం,
ప్రదీప్ శక్తి,అలీ,సునీల్,ఎమ్మెస్ నారాయణ,వేణుమాధవ్,తదితరులు
సంగీతం:విశాల్&శేఖర్
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
కథ,మాటలు :కోన వెంకట్
కెమెరా : కె.రవీంద్రబాబు
స్క్రీన్ ప్లే-దర్శకత్వం:యోగేష్
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)
రిలీజ్ డేట్: 02అక్టోబర్ 2008

మిడిల్ క్లాస్ హీరోయిజం వెంకటేష్ కి కొత్తేం కాదు. పూర్తి అమెరికా బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రంలోనూ ఆయన చేత రొటీన్ గా అదే చేయించారు.అయితే 'సాఫ్ట్ వేర్ ఇంజినీర్' అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం రావటంతో చాలామంది 'సాఫ్ట్ వేర్ పరిశ్రమపై సెటైర్లు వేస్తారు, అక్కడ సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో సెటిలయిన మనవారి సమస్యలు,సరదాలు చూపెడతారు. అంతేగాక ఇక్కడ ఆంధ్రాలో సాఫ్ట్ వేర్ చదువు పై క్రేజ్ ఎంతవరకూ వెళ్తోంది అనేది స్పృశిస్తారు అని ఆశించారు. ఎందుకంటే సార్ట్ వేర్ పీపుల్స్ కే పిల్లనిస్తామనే వారు కూడా ఇక్కడ బయిలు దేరారు మరి'. అలా హై రేంజిలో ఈ సినిమాని ఊహించుకుని వెళితే మాత్రం పూర్తి స్ధాయిలో నిరాశ పరుస్తుంది. ఓ కామెడీ సినిమా చూధ్ధామని ఫ్యామిలీతో వెళ్తే మాత్రం ఓ.కె అనిపిస్తుంది. అయినా వెంకటేష్ అంత ఎనర్జీగా ఎలా చేస్తున్నాడు అనే డౌటు మాత్రం మిగిలిపోతుంది.

ఏజ్ బార్ అయిన రవి (వెంకటేష్) అమెరికాకు సాప్ట్ వేర్ ఉద్యోగం కోసం వెళ్తాడు. అయితే అనుకోని స్ధితిలో డబ్బు ఖర్చు అయి వెనక్కి (ఇండియా)వెళ్ళి తన తల్లి(లక్ష్మి)ని భాధ పెట్టలేక అక్కడే బార్ లో వెయిటర్ గా సెటిల్ అవుతాడు. అలాగే అక్కడే సెటిలయిన ఎన్నారై సునీత (అనూష్క)తో తగువు పడుతూంటూంటాడు. ఈలోగా రవి.. సాప్ట్ వేర్ ఇంజనీర్ అనే భ్రమలో ఉన్న తల్లి తండ్రులు స్క్రిక్ట్ గా ఉండే లాండ్ లార్డ్(షాయీజీ షిండే) కూతురు మామిడికాయల లావణ్య(మమతా మోహన్ దాస్) తో సంభందం సెటిల్ చేస్తారు. అయితే ట్విస్టు ఏమిటంటే లావణ్యకి క్లోజ్ ప్రెండ్ సునీత. సునీత ద్వారా విషయం ఇండియా లో ఉన్న వారికి బయిటపడుతుంది. దాంతో ఇరుక్కున్న రవి తల్లికీ ఈ విషయం తెలియకూడదని ఏం నిర్ణయం తీసుకున్నాడు...హీరోయిన్స్ లో ఎవరని చేసుకున్నాడనేది మిగతా సినిమా!!

'మున్నాభాయ్ ఎంబిబియస్' తరహా స్టోరీ లైన్ తో ప్రారంభమైన ఈ కథ తర్వాత..మెల్లిగా 'మిస్టర్ బీన్' కామిడీ ఎపిసోడ్లు,'మై ప్రేమకీ దీవానీ హూ', 'హమ్ తుమ్' సినిమాలనుండి లిఫ్ట్ చేసిన సీన్లు,మరికొన్ని జోక్స్ అండతో ..సీన్లు నింపే ప్రయత్నంలో బిజీ అయిపోతుంది. దానికి కారణం కథ మొదట మెలిక పడిన చోటే ఆగిపోవటం. హీరో సాఫ్ట్ ఇంజనీర్ కాదనే విషయం ప్రేక్షకులకి రివిల్ అవటం మొదట్లోనే జరిగినా ఎక్కడో ఇంటర్వెల్ దాకా పాత్రలకు తెలియదు. అప్పటి వరకూ అనవసరమైన మిస్ అండరస్టాండిగ్స్ తో కథనం నింపేసారు. దాంతో ఫస్టాఫ్ లో మొదలవ్వాల్సిన లీడ్ పెయిర్ (అనూష్క,వెంకటేష్)ల లవ్ స్టోరీ సెకెండాఫ్ సగం దాకా ప్రారంభమే కాలేదు. దాంతో సెకెండాఫ్ లో వీరి లవ్ స్టోరీకి స్కీన్ టైం మొత్తం సరిపోయి మొదట ఎత్తుకున్న పాయింట్ ప్రక్కకు వెళ్ళిపోయింది. అయినా రొమాంటిక్ కామిడీ జెనర్ ని ఎన్నుకున్నప్పుడు మొదటే క్లారిటీగా ఎవరిని జంటగా చేద్దామనుకున్నారో వారి మధ్యలోనే కథనం నడిపి, అక్కడే ఇంటర్వెల్ , ప్రీ క్లైమాక్స్ ఇవ్వటమనేది సాధారణంగా అనుసరించే అంశం .అలా చేయకపోవటంతో హీరో తండ్రి కి విషయం (వెంకటేష్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాదనే) తెలియటంపై ఇంటర్వెల్, తల్లికి అదే విషయం తెలియటంపై క్లైమాక్స్ వచ్చింది.ఇది స్క్రీన్ ప్లే సమస్య.

అలాగే అమెరికాలో సాప్ట్ వేర్ బ్యాక్ డ్రాప్ లో కథ అనుకున్నప్పుడు అక్కడ మన వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు,సంతోషాలు ఆవిష్కరిస్తారని ఆశించటం సహజం. కానీ ఈ సినిమాలో ఆ తరహా సన్నివేశం మచ్చుకు ఒక్కటి కూడా కనపడదు. అదే మున్నాభాయ్ లో మెడిసిన్ చదువుపైనా, డాక్టర్ వృత్తి పైనా ఆలోచనాత్మకమైన వ్యాఖ్యానాలు కనపడతాయి. ఇక చిత్రంగా హీరో సాప్ట్ వేర్ జాబ్ చేయటానికి వెళ్ళక ...ఆ చదువు అక్కడ చదువుకుంటానని బయిలు దేరతాడు. అసలు ఈ రోజుల్లో సాప్ట్ వేర్ జాబ్ కావాలనుకున్న వారు ...మినిమం బేసిక్ కంప్యూటర్ నాలెజ్డ్ లేకుండా అమెరికా వెళ్ళతారా అంటే అక్కడే లాజిక్ ఆగిపోతుంది.

ఇక దర్శకుడు యోగి తన ప్రతిభను ఎక్కడా కనపడనీయక పోవటం విస్మయపరుస్తుంది. అయితే అతని చీప్ టాయిలెట్ కామిడీ టేస్ట్ ని మాత్రం హర్షించటం కష్టమే. కెమెరా,ఎడిటింగ్ బాగున్నాయి. సంగీతం హిందీ వాసనలతో ఉంటుంది. ఎక్కటానికి మరికొంత టైం పడుతుందేమో. డైలాగులైతే పంచ్ లు కోసం చాలా శ్రమపడినట్లు బయట పడుతూంటుంది. అలాగే వెంకటేష్ కి ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే కాబట్టి మాట్లాడే పని లేదు. హీరోయిన్స్ ఇద్దరూ ఎప్పిటిలాగే గ్లామర్ రోల్సే . లక్ష్మి ..మురారి సినిమాలో పాత్రను కంటిన్యూ చేస్తే...అలీ తను చిరుత చేసిన పాత్రను కంటిన్యూ చేసారు. బ్రహ్మానందం కొద్దిగా నవ్విస్తే వేణుమాధవ్ అనవసరమనిపిస్తాడు. విలన్ పాత్రలు వేసే అజయ్ పాపం చిన్న పాత్రలో కుదించుకుపోయాడు.ఎన్టీఆర్ అతి తక్కువ సేపు పాటలో కనిపించటం అతని అభిమానులను క్యాష్ చేసుకోవటానికే అన్నది సుస్పష్టం.

ఏదిఏమైనా ఈ సినిమా కుటుంబాలకి పడితే వర్కవుట్ అవుతుంది. అయితే సెకెండాఫ్ లో సాగినట్లు ఉండటం, టాయిలెట్ కామెడీ, అలరించని పాటలు కష్టమనిపిస్తాయి. పోటీ చిత్రాలు ఈ రేంజిలో కూడా లేకపోవటం దీనికున్న ఏకైక ప్లస్.

Please Wait while comments are loading...