twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాలక్షేపం బఠానీ 'డేంజర్‌'

    By Staff
    |

    Danger
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: డేంజర్‌
    విడుదల తేదీ: 29-10-05
    నటీనటులు: అల్లరి నరేష్‌, అభిషేక్‌, సాయిరాం శంకర్‌,
    స్వాతి, షఫీ, షరాన్‌, హేమ, అపూర్వ,
    కవిత, ఆహుతి ప్రసాద్‌, బ్రహ్మానందం తదితరులు
    సంగీతం: జాష్వా శ్రీధర్‌
    కెమెరా: ఓంప్రకాష్‌
    మాటలు: ఉత్తేజ్‌
    ఐడియా, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ
    నిర్మాత: సుంకర మధు మురళి

    కొందరు కుర్రాళ్ళు టీనేజ్‌ అమ్మాయిలతో అడ్వెంచర్‌ చేయడం ఒకప్పటి హాలీవుడ్‌ 'బి'గ్రేడ్‌ సినిమా ఫార్ములా. దానిని తవ్వితీసిన ఘనత 'చక్రం'తో చతికిలపడిన కృష్ణవంశీదే. మల్టీప్లెక్స్‌ మోడ్రన్‌ ప్రేక్షకులకు ఇది పాత చింతకాయ పచ్చడే అయినా సామాన్యప్రేక్షకులకు కొత్త తరహా వినోదమయ్యే అవకాశముంది.

    ఈ కథలో ముగ్గురు కుర్రాళ్ళు (అల్లరి నరేష్‌, అభిషేక్‌, సాయిరాం శంకర్‌), ఇద్దరు అమ్మాయిలు (స్వాతి, షరీన్‌ ) ప్రధాన పాత్రలు. వీరంతా మంచి స్నేహితులు. స్వాతి పెళ్ళి చూపులకు వీరంతా హడావుడిగా హాజరవుతారు. పార్టీ చేసుకోడానికి వీరంతా ఒక పబ్‌కి బయలుదేరుతారు. కబుర్లు, కేరింతలతో వీళ్ళు పోలీసు రక్షక్‌ వాహనాన్ని ఢీకొంటారు. తెలివిగా అక్కడి నుంచి తప్పుకున్నా పోలీసులు వదలరు. పబ్‌పై దాడి చేస్తారు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో ఊరు బయటకు చేరుతారు. మంచి నీళ్ళ కోసం దగ్గరలో ఉన్న ఒక భవనానికి వెళ్తారు. సరిగ్గా ఆ సమయంలో స్ధానిక ఎమ్మెల్యే గట్టయన్న మంత్రి పదవి కోసం ఒక పసి పిల్లాడ్ని బలిఇస్తాడు. చేతిలో ఎప్పుడూ హ్యాండీ క్యాం పెట్టుకు తిరిగే అభిషేక్‌ ఆ దృశ్యాన్ని రికార్డు చేస్తాడు. ఎమ్మెల్యే మనుషులు వీరి వెంటపడతారు. ఛేజింగుల నుంచి డేంజర్‌ నుంచి ఆ కుర్రాళ్ళు ఎలా బయటపడతారన్నది మిగితా కథ.

    సినిమాలో ఎక్కువ భాగం ఈ మధ్య విడుదలైన 'అనుకోకుండా ఒకరోజు'ని గుర్తుకు తెస్తూ, ఛేజింగులతో నిండిపోయింది. పాత్రల పరిచయ సన్నివేశాలు పూర్తయ్యేసరికే గంటకు పైగా గడిచిపోవడంతో సినిమాలో మిగితా ముఖ్యమైన అంకాలు పూర్తిగా ఎస్టాబ్లిష్‌ కాలేదు. ఇది స్క్రీన్‌ప్లే లోపం. స్క్రీన్‌ టైం సరిగా విభజించుకోలేక పోతే ప్రేక్షకుల సహనానికి పరీక్షే. కథలో వచ్చే మలుపుల కోసం ఎదురుచూపులు పక్క చూపులుగా మారతాయి. అలాగే ఇంగ్లీషు సినిమాల్లో తలిదండ్రుల ప్రసక్తి ఉండదు కాబట్టి వారి ప్రమేయాన్ని కథలో ప్రేక్షకులు ఆశించరు. ఈ సినిమాలో ఉన్నత వర్గానికి చెందిన తలిదండ్రులు తమ పిల్లలు ఏమయ్యారో గాలించరు. ఇందులో మాత్రం వీరు తాము డేంజర్‌లో పడ్డామన్న విషయాన్ని స్వాతి తల్లికి చెబుతారు. పోలీసు రక్షక్‌ వాహనాన్ని ఢీకొని తమకు సంబంధం లేదన్నట్టు పారిపోయినప్పుడే వారి మీద సానుభూతి పోతుంది. తమ చర్యల వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు పోతున్నా పట్టించుకోని వాళ్ళు డేంజర్‌లో పడి ప్రాణ భీతితో కొట్టుమిట్టాడుతున్నా ప్రేక్షకులకు సానుభూతి కలగకపోవడం కథాలోపమే.

    అల్లరి నరేష్‌ పాత్రను పక్కింటి ఆంటీ వద్ద పడుకుని ఉండగా పరిచయం చేయడం పరాయి సంస్కృతి ప్రభావమే. బాధ్యత గల దర్శకుడు చేయవలసిన పనికాదిది. ఇక నరబలి సంగతి. డేంజర్‌లో పడ్డవారంతా తమను రక్షించుకోడానికి గాక, ఆ నరబలిని బయటపెట్టడానికి ప్రయత్నించి ఉంటే సినిమా నడక మరో విధంగా ఉండేది. ఎంతవర కూ విలన్‌ వారిని భయపెట్టడమే సరిపోవడంతో పాత్రలు పాసివ్‌గా మారిపోయాయి. సినిమా నిండా స్ప్లిట్‌ స్క్రీన్‌ షాట్స్‌ సృజనాత్మకతను తగ్గించాయి. స్వాతి, నరేష్‌, అభిషేక్‌, వెంకట్‌లు తమ పరిధిలో బాగానే నటించారు. దర్శకత్వ మెరుపులు అక్కడక్కడా ఉన్నా ఇటువంటి సినిమాలకు ప్రాణమైన సస్పెన్స్‌, యాంగ్జయిటీ తక్కువగా ఉన్నాయి. కాలక్షేపం కోసమైతే చూడవచ్చు.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X