»   » బోరు చరిత్ర (మరో చరిత్ర రివ్యూ)

బోరు చరిత్ర (మరో చరిత్ర రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Maro Charitra
Rating

-సూర్య ప్రకాష్ జోశ్యుల
సంస్థ: మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్
‌ సమర్పణ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
నటీనటులు: వరుణ్‌ సందేశ్‌, అనిత, శ్రద్ధాదాస్‌, కోట శ్రీనివాసరావు, ప్రతాప్‌ పోతన్‌,
ఊర్వశి, తలైవాసల్‌ విజయ్‌, జానకి, సబేష్‌, నరేష్‌, ఆదర్శ్‌, వేణు, వెంకీ తదితరులు.
సంగీతం: మిక్కీ జె మేయర్
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
డైలాగులు: అనూరాధా ఉమర్జీ
కథ: కె బాలచందర్
నిర్మాతలు: దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌
స్క్రీన్ ప్లే, ఛాయా గ్రహణ, దర్శకత్వం: రవి యాదవ్‌
రిలీజ్ డేట్: 25 మార్చి 2010

బాలచందర్ 'మరో చరిత్ర' రీమేక్ అననగానే అంచనాలు ఏ రేంజిలో ఉంటాయో, అనుమానాలు అదే స్ధాయిలో ఉంటాయన్నది నిజం. అయితే అంచనాలను ప్రక్కకు నెట్టి, అనుమానాలను నిజం చేస్తూ ఈ రీమేక్ ధియోటర్లో దిగింది. ఎక్కడా ప్రేక్షకుడుకి కనెక్టు కాకుండా చిత్రం తన మానాన తాను నడుచుకుంటూ సహన పరీక్ష పెట్టింది. అలాగే ఒరిజనల్ లో ఉన్న పాటలు (ఏ తీగ పూవువో..., భలే భలే మొగాడివోయ్..)రీమిక్స్ చేసినా వర్కవుట్ అయిందా అదీ లేదు. ఆ పాటలు విన్న వారికి ఇవి వెగటు తెప్పిస్తాయి. ఇక వరుణ్ సందేశ్, అనిత తమ పరిధిలో తాము నటించినా దర్శకత్వ లోపంతో కృత్రిమంగా డైలాగులు చెప్తున్న ఫీల్ కలిగించింది. అయితే ఇంత వినాశనంలోనూ కెమెరా ప్రతిభ మాత్రమే చాలా సీన్లలో అబ్బురమనిపించింది. ఈ చిత్రం చూస్తూంటే వర్మా కా షోలే (షోలే రీమేక్) చిత్రం గుర్తుకు వచ్చిదనటంలో అతిశయోక్తి లేదు.

'మరో చరిత్ర' చూసినవారందరికీ తెలుసున్న కథనే అమెరికా బ్యాక్ డ్రాప్ లో మళ్లీ చెప్పుకుంటే...మధ్యలో కాలేజీ చదువు ఆపిన బాలు(వరుణ్ సందేశ్)కి ప్రక్కింట్లో ఉన్న స్వప్న(అనిత) పరిచయమవుతుంది. ఎప్పుడూ సైకిల్ మీద చక్కర్లు కొట్టే ఆమెతో అతను వెంటనే ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా ఆలస్యమెందుకు అనుకుని డిటోగా ప్రేమిస్తున్నాను అనేస్తుంది. ఇక కొన్ని రెగ్యులర్ ప్రేమ సీన్లు లొకేషన్స్ మార్చుకుని వచ్చి పోయాక వాళ్ళింట్లో వారికి ఆ విషయం తెలుస్తుంది. ఇక ఇక్కడ మరో ట్విస్టు ఏమిటంటే...అనిత తల్లి(ఊర్వసి) కొద్దిగా నోరు ఎక్కువ. ఎప్పుడూ బాలు తండ్రి(ప్రతాప్ పోతన్) తగువు పెట్టుకుంటుంది. ఇలా ఇరు పక్షాలు వారికి ఈ ప్రేమ ఇష్టం లేని స్ధితిలో ఓ ఎగ్రిమెంట్ కి వస్తారు. పాత మరో చరిత్ర చూసి పెట్టినట్లుగా ఓ కండిషన్ పెట్టి వారి ప్రేమని విడతీస్తారు. ఏ కండిషన్ అది అంటే...ఈ ప్రేమికులిద్దరూ సంవత్సరం పాటు ఒకరినొకరు చూసుకోకూడదు. పలకరించుకోకూదు. అలా ఓ సంవత్సరం పాటు గడిపాక వారి ప్రేమ నిజమైనది అనిపిస్తే వారు పెద్దలు పెళ్ళి చేస్తారన్నమాట. ఇక ఈ ప్రేమికులిద్దరూ పెద్దల ప్రేమను గౌరవించి విడిపోతారు. తర్వాత సంవత్సరం పాటు ఎగ్రిమెంట్ లో చెప్పినట్లు విడిపోయి బ్రతుకుతారా...చివరకు ఒరిజనల్ మరో చరిత్రలో ఉన్నట్లు చనిపోతారా అన్నది తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే ఈ సినిమా చూడాల్సిందే.

బాలచందర్ 'మరో చరిత్ర' చిత్రం ఇన్నాళ్ళు తర్వాత కూడా క్లాసిక్ గా బ్రతికుందంటే కారణం...అందరూ అనుకుంటున్నట్లుగా అందులో ప్రేమికులు మరణించబట్టి కాదు..ఆ చిత్ర కథ, కథనం తెరపై అత్యధ్బుతంగా చెప్పిన తీరు. అలాగే కమల్ హాసన్, సరితల అద్భుతమైన కెమెస్ట్రీ,బాలచందర్ దర్శక నైపుణ్యం, పాటలు అనేది అందరూ ఒప్పుకునేదే. ఇక ఈ హైలెట్స్ అన్నీ ఈ మరో చరిత్ర రీమేక్ లో దారుణంగా మిస్సయ్యాయి. ఒరిజనల్ లోని అవర బాషను తీసేసి యు.ఎస్ లో ఎన్నారై సెటప్ పెట్టి వచ్చీ రాని తెలుగుని పలికిస్తే చిత్రానికి ఆ లుక్ రాదు. అలాగే మరోచరిత్ర కథ జరిగే రోజులు వేరు. ఆనాటి కాలమాన పరిస్ధితులు, కథలో మిడిల్ క్లాస్ వాతావరణం ఉండబట్టే ప్ర్రేమికులకు,తల్లి తండ్రుల మధ్య ఎగ్రిమెంట్ ఎపిసోడ్ వస్తుంది. అదే ఈ 2010లో పెద్దవాళ్ళు పెట్టే ఎగ్రిమెంట్ కు పిల్లలు లొంగుతారా...అందులో అమెరికాలో ఉండేవాళ్ళు అంటే అనుమానమే. ఇక రెండు కుటుంబాలు వెల్ సెటిల్డ్ అయినప్పుడు వారి ప్రేమకు పెద్దగా అడ్డుపెట్టే సీన్ ఉండవనేది నిజం. ఎందుకంటే ఎక్కువగా మిడిల్ క్లాస్ కుటుంబాల్లోనే ఇలాంటి అడ్డంకులు ఎదురౌతాయి. ఇక హీందీలో ఆ మధ్య దేవదాస్ ని దేవ్ డి గా మార్చి హిట్టు కొట్టిన రీతిలో కథనం పూర్తిగా మార్చి రాసుకుంటే గ్యారింటీగా ఈ తరానికి నప్పేది. అలా కాకుండా అదే కథని అలాగే ఉంచేసి కేవలం యాక్టర్స్, లొకేషన్స్, డైలాగులు, పాటలు మార్చారు. ఇక సెకెండాఫ్ లో హీరోకు అస్సలు కాంఫ్లిక్ట్ అనేదే లేకుండా పోయింది. కాంప్లిక్ట్ తెచ్చే శ్రధ్దాదాస్ పాత్ర అప్పటి జయచిత్ర పాత్రను ఏ కోణంలోనూ తృప్తిపరచదు. వీటికి తోడు లీడ్ రోల్ అయిన ఊర్వసి డైలాగుల్లో అనకాపల్లి యాస ఎక్కువ అయి సీరియస్ గా ఉండి పండాల్సిన సీన్స్ కూడా తేలిపోయాయి. క్లైమాక్స్ లో అయితే ఓ డ్రామానే చూసిన ఫీలింగ్ కలిగింది. అయితే ఈ సినిమాలో గిట్టుబాటు అయింది ఒక్కటే అదే నయాగారా జలపాతంని బాగా చూపెట్టడం. బాగా దగ్గరనుంచి చూసిన ఫీలింగ్ కలిగించింది. అదేంటి ఈ చిత్రంలో అన్నీ మైనస్ లేనా చెప్పుకోవటానికి ఏమీ లేవా అంటే...సినిమా అనేది ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషనల్ కనెక్టవిటీనే తెగిపోయినప్పుడు మిగతావి ఎన్ని ఎలా ఉన్నా వృధానే అని చెప్పాల్సి వస్తుంది.

ఏదైమైనా మరోచరిత్ర పై మనసు మళ్లి మళ్ళీ ఈ తరానికి అందిద్దామని అనిపిస్తే మాయాబజార్ లాగ కలర్ చేసి రిలీజ్ చేస్తే నిర్మాతకు ఆ గౌరవం దక్కేది. ఒరిజనల్ చూడనివారికి కథని బట్టి ఈ చిత్రం ఓ మాదిరిగా అనిపిస్తే...అప్పటి చిత్రాన్ని చూసి ఇది చూస్తే మాత్రం ఆ ఫీలింగ్ మాత్రం చాలా భాధగా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రం ఇప్పటికే చూసినవారు పరిహారంగా మరోచరిత్ర (పాత) డీవీడిని తెచ్చుకుని వెంటనే చూసేయండి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu