»   » గాయం కాస్తా పుండైంది ('గాయం -2' రివ్యూ)

గాయం కాస్తా పుండైంది ('గాయం -2' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Gayam
Rating

-జోశ్యుల సూర్య ప్రకాష్
బ్యానర్: కర్త క్రియేషన్స్
తారాగణం: విమలా రామన్, జగపతి బాబు, కోట శ్రీనివాసరావు, కోట ప్రసాద్, తనికెళ్ళ భరణి, హర్ష వర్ధన్, జీవా, తదితరులు.
మాటలు: గంధం నాగరాజు
కెమెరా :అనీల్ బండారి
ఎడిటింగ్: ప్రవీణ్
దర్శకత్వం: ప్రవీణ్ శ్రీ
సంగీతం: ఇళయరాజా
నిర్మాత: ధర్మకర్త శ్రీ
విడుదల తేదీ: 03/09/2010

సీక్వెల్ అనేది ఎప్పుడూ రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదే. ఓపినింగ్స్ కు మొదటి సినిమా విజయం ఎంత బాగా సహకరిస్తుందో ...పోల్చుచూసుకోసుకుని నిరాశచెందటానకి కూడా అదే సమస్యై కూర్చుంటుంది. తాజాగా అప్పటి ట్రెండ్ సెట్టర్ "గాయం" కు సీక్వెల్ వచ్చిన 'గాయం-2' మంచి ఓపినింగ్స్ తెచ్చుకుంది. పనిలో పనిగా...ఈ కొత్త సినిమాని పాత క్లాసిక్ తో పోల్చుకుని చూసేలా చేసి కొందరికి నిరాశకల్గించింది. మరికొందరికి అప్పటి మధురస్మృతులు గుర్తు చేసి ఆనందపరిచింది. ఇక హీరో జగపతి బాబు, నూతన దర్శకుడు ప్రవీణ్ శక్తి వంచన లేకుండా కష్టపడినప్పటికీ ఇంటర్వెల్ దాకా అసలు కథ ప్రారంభం కాకపోవటం,స్క్రీన్ ప్లే సమస్యలు కథనానికి ఇబ్బందులై నిలిచాయి.

రామ్(జగపతి బాబు) ధాయలాండ్ లో ఓ హోటల్ నడుపుకుంటూ తన కొడకు, భార్య విద్య(విమల రామన్)లో హ్యాపీగా ఉంటూంటాడు. అయితే అనుకోకుండా జరిగిన ఓ సంఘటనతో మీడియోలో హైలెట్ అయి రామ్ ని వెతుక్కుంటూ హైదరాబాద్ నుంచి గురునారాయణ(కోట శ్రీనివాసరావు) మనుష్యులు వస్తారు. వాళ్ళొచ్చి రామ్ గతంలో దుర్గ(గాయం లో హీరో) అనే విషయం బయిటపెట్టి చంపబోతారు. గతాన్ని సమాధి చేసి బ్రతుకుతున్న రామ్ కి తాను దుర్గ అనే విషయం ఒప్పుకోవటం ఇష్టముండదు. అయినా కొన్ని పరిస్ధితుల్లో మళ్లీ దుర్గగా మారి తిరిగి హైదరాబాద్ వచ్చి తన మిగిలిన శత్రు శేషాన్ని తుగముట్టించటానికి సమాయుత్తమవుతాడు. ఆ క్రమంలో అతని భార్య ఎలా స్పందించింది ...కొడుకు ఏమయ్యాడు అనేది మిగతా కథ.

ఇక హిస్టరీ ఆఫ్ వయలెన్స్ అనే హాలీవుడ్ చిత్రం నుంచి ప్లాట్ తీసుకుని ఈ చిత్రం కథనం అల్లారు. అలాగే కథ సెంట్రల్ పాయింట్ అయిన దుర్గా తిరిగి తన పాత జీవితంలోకి రావటమనేది ఇంటర్వెల్ దాకా రాదు. దాంతో అక్కడవరకూ కేవలం దుర్గా ప్రస్తుతం, పండని హర్షవర్దన్ కామిడి, హైదరాబాద్ నుంచి విలన్ మనుష్యులు వెతుక్కుంటూ రావటం చుట్టూ తిరుగుతుంది. పోనీ సెకెండాఫ్ లో అయినా అందుకుంటాడా అంటే అప్పటివరకూ హీరో వెంటబడ్డ విలన్ విచిత్రంగా సెకెండాఫ్ లో చల్లపడిపోతాడు. దాంతో హీరోనే ఎంతసేపు కంటిన్యూగా యాక్షన్ ఎపిసోడ్స్ సృష్టిస్తూంటాడు. ఇది ప్రక్కన పెడితే నటుడుగా జగపతిబాబు చాలా పరిణితితో చేసిన పాత్ర అనిపిస్తుంది. విమలారాన్ కూడా కథలో లీనమై ఎమోషన్స్ పండించింది. ఇక విలన్ గా చేసిన కోట, ఆయన కొడుకు ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. లాయర్ సాబ్ గా తణికెళ్ళ భరణి...అప్పటి గాయం పాత్రను కంటిన్యూ చేసారు.గంధం నాగరాజు డైలాగులు అక్కడక్కడా చమక్కుమనిపిస్తాయి. ఇళయరాజా సంగీతమే ఆయన రేంజికి తగినట్లు అనిపించదు.

ఒరిజనల్ గాయంతో పోల్చకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది. అలాగే ఓ హిట్ సినిమా సీక్వెల్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాలనే పాఠం కూడా ఈ చిత్రం చెప్తుంది. తన కెరీర్ ని శరవేగంతో తిరిగి పట్టాలు ఎక్కిస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుని జగపతి బాబు చేసిన ఈ చిత్రం కొంత నిరుత్సాహాన్ని, ఈ మధ్యన ఓపినింగ్స్ కూడా తెచ్చుకోని జగపతి గత చిత్రాలుతో పోల్చి చూసుకుంటే కొంత ఉత్సాహాన్ని ఇస్తుంది. ఏదైమైనా రామ్ గోపాల్ వర్మ, క్లాసిక్ వంటి ఆలోచనలు పెట్టుకోకుండా...దుర్గా పాత్రలా గతాన్ని త్రవ్వుకోకండా వెళ్ళండి..హ్యాపీ

Please Wait while comments are loading...