twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జేమ్స్‌' జండూ బామ్స్‌

    By Staff
    |

    James
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: జేమ్స్‌‌
    విడుదల తేదీ: 16 సెప్టెంబర్‌ 2005‌
    నటీనటులు: మోహిత్‌ అలావత్‌, నిషా కొఠారి, జకీర్‌ హుస్సేన్‌,‌
    సిల్విల్‌ వకీల్‌, రవి కాలే, స్నేహల్‌ దాబి తదితరులు‌
    సంగీతం: అమర్‌ మొహాలె‌
    కెమెరా: అమల్‌ నీరజ్‌‌
    కథ: మనీష్‌ గుప్తా‌
    దర్శకత్వం: రోహిత్‌ జుగ్‌రాజ్‌‌
    నిర్మాత: రాంగోపాల్‌వర్మ‌

    సృజనాత్మకమైన సినిమాను 'ఫ్యాక్టరీ' ప్రొడక్టుగా మార్చిన వర్మ కార్పొరేషన్‌ వరుస ఉత్పత్తిలో మరొకటి 'జేమ్స్‌'. హృదయాన్ని స్పృశించి, కదిలించే సన్నివేశం ఒక్కటి కూడా లేకపోవడం, హీరో పాత్ర పాసివ్‌గా మారటం ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది.

    కథ: ముంబాయి మహానగరంలో ఎదురులేని రాజకీయ శక్తి 'శాంతి నారాయణ్‌' (జకీర్‌). అతని తమ్ముడు రాధానారాయణ్‌ (సిల్విర్‌ వకీర్‌) అన్న అండతో అరాచకాలు చేస్తుంటాడు. ఆ సమయంలో జేమ్స్‌ (మోహిల్‌ ఆహ్లావత్‌) బతుకుతెరువు కోసం ముంబాయి వస్తాడు. తన చిన్ననాటి స్నేహితుడు బబ్లు (స్నేహల్‌ దాబి) సాయంతో ఒక నైట్‌క్లబ్‌ లోపల సెక్యూరిటీ ఉద్యోగిగా చేరుతాడు. అక్కడే నిషా (నిషా కొఠారి) అనే మోడల్‌ పరిచయమవుతుంది. ఆమె తండ్రి డిసిపి తన కూతురిని రాధానారాయణ్‌ ఏడిపిస్తున్నాడని తెలిసినా ఏమీ చేయలేని స్ధితిలో ఉంటాడు. ఒకరోజు నైట్‌క్లబ్‌లో రాధానారాయణ్‌ తాగి నిషాను రేప్‌ చేయబోతాడు. వెంటనే జేమ్స్‌ రిఅయాక్ట్‌ అయి అతనికి బుద్ధి చెబుతాడు. జనం భయమే ఆయుధంగా బతికే అతను అంత మందిలో జేమ్స్‌ తనను కొట్టడాన్ని అవమానంగా భావిస్తాడు. జేమ్స్‌ని వేటాడి చంపాలనుకుంటాడు. ముందుగా అతనికి ఆశ్రయమిచ్చిన బబ్లుని చంపుతాడు. జేమ్స్‌ కోపంతో నిషాని తీసుకుని ఊరొదిలి అడవికి చేరుతాడు. ఈ వార్తను నిషా తండ్రి సెల్‌ ఫోన్‌ను ట్రాప్‌ చేయడం ద్వారా తెలుసుకుని వెంబడిస్తారు. రాధాకి తోడుగా అతనికిఇ తొత్తులైన పోలీసులు ఉంటారు. పోలీసు కుక్కల సాయంతో జేమ్స్‌ జాడ తెలుసుకుంటారు. నిషాను రేప్‌ చేయబోతే ఆమె కొండపైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ స్ధితిలో ఆ విషవలయాన్ని జేమ్స్‌ ఎలా అంతమొందించాడన్నది మిగితా కథ.

    పూర్తిగా చేజింగ్‌లతో తీసిన ఈ చిత్రంలో కథ 'శివ' 'ఒక్కడు' సినిమాలను పోలి ఉంది. రిలీఫ్‌ కోసమైనా వినోదాన్ని ఆశ్రయించకపోవడం విషాదం. ఎమోషన్స్‌ని ప్రేక్షకుల్లో రిజిస్టర్‌ చేసే సన్నివేశాలు లేకపోవడం స్నేహితుడు చనిపోయినా, హీరోయిన్‌ మరణించినా ఏమీ అన్పించదు. ఉద్వేగం కలగదు. సెకండాఫ్‌లో హీరోహీరోయిన్లు ఉన్న బస్సుని చుట్టుముట్టిన విలన్ల నుండి, ఆ తర్వాత పోలీసు కుక్కల నుండి వీళ్ళు ఎలా తప్పించుకున్నారో వివరంగా చూపించలేదు. పాటల్లో నిషా అందాలను చూపించాలనే తాపత్రయం తప్ప మరేమీ కనబడదు. అప్పటివరకు హీరోని ఎలాగైనా చంపాలని తిరిగిన విలన్‌ బృందం అతను తప్పించుకున్నాడని తెలుసుకుని రిలాక్స్‌ ఎందుకు అవుతారో అర్ధం కాదు. డిసిపి తన కూతురిని రక్షించుకోలేడు, కనీసం సెక్యూరిటీ కల్పించకపోవడం విచిత్రం. విలన్లను ఎదుర్కొని నిలువలేని హీరో తప్పించుకుంటూ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తాడు. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరించరనే చెప్పాలి. ఏ మాత్రం పరిచయం లేని నటీనటులు వారిని అలరించలేరు. వర్మ తరహా టేకింగ్‌ కోసం సినిమాకు వెళ్ళే తెలుగు ప్రేక్షకులకు ఆ శైలి కూడా కన్పించదు.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X