»   » చిలుం పట్టిన కత్తి ('కళ్యాణ్ రామ్ కత్తి' రివ్యూ)

చిలుం పట్టిన కత్తి ('కళ్యాణ్ రామ్ కత్తి' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kalyan Ram Katti
Rating

-జోశ్యుల సూర్య ప్రకాష్
సంస్థ: ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌
నటీనటులు: కళ్యాణ్ రామ్, సనా ఖాన్, శరణ్య మోహన్, శ్యామ్, కోట శ్రీనివాస రావు,
ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మానందం, వేణు మాధవ్, చంద్ర మోహన్, అజయ్
కధ: వక్కంతం వంశి
మాటలు: ఎమ్. రత్నం
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: సర్వేష్ మురారి
ఎడిటింగ్: గౌతమ్ రాజు
ఫైట్స్: రామ్-లక్ష్మణ్
సంగీతం: మణిశర్మ
నిర్మాత: కల్యాణ్‌ రామ్
‌ దర్శకుడు: మల్లికార్జున్‌

అన్నా చెల్లెళ్ళ అనుబంధం, చెల్లికోసం ఎంతవారినైనా ఎదుర్కొనే హీరో, రాయలసీమ ఫ్యాక్షనిజం, విలన్..ఇంట్లో వారెవరికీ తెలియకుండా హీరో ప్రవేశించి వాళ్ళతో ఆడుకోవటం ఇవన్నీ గత కొంత కాలంగా తెలుగు సినీ పరిశ్రమని శాసిస్తున్న హిట్ ఫార్ములాలు. వాటిన్నటినీ కలిపేస్తే వచ్చిందే కత్తి. కళ్యాణ్ రామ్ గత సినిమాల రేంజిలో ఓపినింగ్స్ ని తెచ్చుకోలేకపోయిన ఈ చిత్రం పాత కథనే మళ్ళీ పాత విధానంలో చెప్పటం వల్ల పాత(రెగ్యులర్) ప్రేక్షకులకు మరీ పాతగా అనిపించింది. అయితే ఇవేమీ తెలియని కొత్త తరం వాళ్ళని టార్గెట్ చేసి తీసామనుకుంటే వారి ఆలోచనలకీ, స్టైల్స్ కీ తగ్గ వాతావరణమం కాగడా వేసి వెతికినా కనపడదు. కాబట్టి...దర్శక,నిర్మాతలు ఎవరినైతే(బి,సి సెంటర్స్) టార్గెట్ చేసి తీసారో వారిపైనే ఆశపడాలి.

ఫుట్ బాల్ ప్లేయర్ రామకృష్ణ(కళ్యాణ్ రామ్)కి చెల్లెలు హారిక (శరణ్యా మోహన్) అంటే పంచ ప్రాణాలు. ఆమె మాత్రం ఎప్పుడు తన్నుదామా అన్నట్లు ఎదురుచూసే అన్నయ్య ఉన్నాడు కాబట్టి ఎప్పుడూ ఏదో గొడవ తీసుకువస్తూంటుంది. షరా మూమూలుగా రామకృష్ణ అవతలి వారితో ఫుట్ బాల్ ఆడేస్తూంటాడు. మరో ప్రక్క రామకృష్ణ వెనక అంజలి (సనా ఖాన్) అనే అమ్మాయి ప్రేమలో పడ్డానంటూ వెంటపడుతూంటుంది. ఇలా రెండు పాటలు, మూడు ఫైట్స్ అన్నట్లు హ్యాపీగా గడిపేస్తున్న అతని జీవితంలో ఓ పెను మార్పు. అతని చెల్లెలు ఇంతగా ప్రేమిస్తున్న కుటుంబానికి, అన్నయ్యకు చెప్పకుండా తను ప్రేమిస్తున్న కృష్ణమోహన్ (శ్యాం) వాడితో వెళ్ళిపోయింది. అత్తవారింట్లో తేలిన ఆమెకు అదొక నరకం అని అర్దమవుతుంది. ఈ సిట్యువేషన్ ని తెలుసుకున్న గారాల అన్నయ్య తన ముద్దుల చెల్లెలు కోసం ఆ నరకం నేటివ్ ప్లేస్ అయిన రాయలసీమలో అడుగుపెడతాడు. అక్కడ ఆమె అత్తారింట్లో ఓ పనివాడుగా జాయినై ఎలా తన చెల్లి సమస్యలు తీర్చాడన్నదే మిగతా కథ.

చెల్లి అత్తారింట్లో కష్టపడుతూంటే అన్నగారు ఆ కష్టాలు తీర్చటానికి హోరా హోరీ పోరాటం చెయ్యటం అనేది ఎన్నో సార్లు ప్రూవ్ అయిన ఫార్ములానే. అయితే అటు చెల్లి సెంటిమెంట్, ఇటు ఫ్యామిలీ బంధాలు, సస్పెన్స్, ట్విస్టులు, యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా అన్నీ ఒకేదాంట్లో కలపాలి అన్నప్పుడే ఈ సమస్య వచ్చింది. మరీ ముఖ్యంగా ఇంటర్వెల్ దాకా కథలో మెలిక పడదు. అప్పటివరకూ హీరోయిన్ తో లవ్ ట్రాక్, కథకు అస్సలు సంభంధంలేని యాక్షన్ ఎపిసోడ్స్ వచ్చిపోతూంటాయి. సెకెండాఫ్ లో చెల్లి అత్తారింటిలో నరకం చూస్తోంది, తెలుసుకున్న హీరో ఏం చేస్తాడు అనే పాయింట్ వరకూ ఆసక్తి కలగదు. ఆ తర్వాత హీరో రెడీ లాంటి సినిమాల తరహాలో ఆ ఇంట్లో ప్రవేశించి వారిలో మార్పు తేవాలని ప్రయత్నం చేయటం తెలిసిందే అయినా, సినిమాటెక్ గా ఉన్నా ఉన్నంతలో బెటర్ అనిపిస్తుంది. అయితే అంతగా అందర్నీ శాసించే రాయలసీమ ప్యాక్షనిస్ట్ లు కూడా తమ ఇంట్లో ప్రవేసించినవాడు శత్రువా, మిత్రుడా అని తెలుసుకోలేని స్ధితిలో ఉన్నారనే సందేహం రాకుండా చూడాలి.

ఇక బ్రహ్మానందం,వేణు మాధవ్, ధర్మవరపు వంటి సీనియర్ కమిడెయిన్స్ ఉన్నా కామిడీలో విషయం లేకపోవటంతో తేలిపోయారు. కోట శ్రీనివాసరావు మాత్రం ఎప్పటిలాగే తన ప్రతిభను నిరూపించుకుంటూ నటించారు. కళ్యాణ్ రామ్..నిర్మాతగా, హీరోగా ఓకే గానీ, తేలిపోయిన కథను మాత్రం పూర్తి స్ధాయిలో మోయలేకపోయారు. దర్శకుడుగా మల్లి..ఇలాంటి రొట్టకొట్టుడు కథని ఎన్నుకోవటంలోనే ఆయన ఫెయిలయ్యారనిపించింది. టెక్నికల్ గా చెప్పాలంటే మణిశర్మ సంగీతం, బ్యాక్ స్కోరు, సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫీ, గౌతం రాజు ఎడిటింగ్ ఈ సినిమాను ఉన్నంతలో నిలబెట్టటానికి కృషి చేసాయి. రత్నం మాటలు గొప్పగా పేలకపోయినా ఉన్నంతలో ఫరవాలేదనిపించాయి. ఇక ఈ కథని నేరేట్ చేసి ఒప్పించటం చాలా కష్టమైన పని..ఆ పని వక్కంతం వంశీ నిర్వహించారు. గ్రేట్.

ఏ విషయంలోనూ ఈ చిత్రం కొత్తదనం చూపలేకపోయినా వరస ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం కాబట్టి ఎంకరేజ్ చేయాలి. అలాగే ఈ సినిమాకు మరో సుఖం ఉంది. అది ఇంటర్వెల్ అయిన తర్వాత వెళ్ళినా కథ కొంచెం కూడా మిస్ కాకుండా అర్దమవుతుంది కాబట్టి ధియోటర్ వాడు అనుమతిస్తే అప్పుడు వెళ్ళి టైం సేవ్ చేసుకోవచ్చు. ఇదంతా ప్రక్కన పెడితే ఇంతోటి సినిమాకా టైటిల్ రాద్దాంతం జరిగిందని మాత్రం అందరికి అనిపిస్తుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu