»   » కర్తవ్యం సినిమా రివ్యూ: భావోద్వేగ కథతో నయనతార..

కర్తవ్యం సినిమా రివ్యూ: భావోద్వేగ కథతో నయనతార..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Karthavyam Movie Review నేటివిటికి దూరంగా, హృదయానికి దగ్గరగా !

  Rating:
  3.0/5
  Star Cast: నయనతార, సునులక్ష్మీ, రామచంద్రన్, కాకముట్టై రమేష్
  Director: గోపి నయనార్

  ఒకప్పుడు నయనతార అంటే గ్లామర్ హీరోయిన్. దక్షిణాదిలో ఇప్పుడు అందాల తారగానే కాకుండా లేడి హీరోయిన్‌గా పేరుతెచ్చుకొన్నది. ఒకప్పటి లేడి అమితాబ్ విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమా టైటిల్‌తో నయనతార ఓ ఛాలెంజిగ్ పాత్రలో కనిపించనున్నారు. తమిళంలో ఘన విజయం సాధించిన ఆరమ్ చిత్రం నయనతార కర్తవ్యం చిత్రానికి మాతృక.

  బాధ్యతాయుతమైన కలెక్టర్ పాత్రలో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకొన్న నయనతార తాజాగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ప్రముఖ నిర్మాత శరత్ మరార్ నిర్మాణ సారథ్యంలో కర్తవ్యం చిత్రం మార్చి 16వ తేదీన రిలీజ్ కానున్నది. ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసిన కర్తవ్యం సినిమా సమీక్ష తెలుగు ఫిల్మీబీట్ రీడర్ల కోసం..

  కర్తవ్యం కథ ఏమిటంటే..

  బుల్లబ్బాయి (రామచంద్రన్), సుమతి (సునులక్ష్మీ) నిరుపేద దంపతులకు కూతురు ధన్సిక కుమారుడు ఉంటారు. కూలీ పనులు చేస్తే గానీ పూట గడవని కుటుంబం. అలా కష్టాల సాగరాన్ని ఈదుతున్న ఈ పేద దంపతులకు ఊహించిన పరిస్థితి ఎదురవుతుంది. తన కూతురు ధన్సిక పంట పొలాల్లో ఆడుకొంటూ బోరుబావిలో పడుతుంది. సుమారు 36 అడుగుల లోతులో పడిన బాలికను రక్షించడానికి కలెక్టర్ మధువర్షిణి (నయనతార) తన యంత్రాంగంతో రంగంలోకి దిగుతుంది.

  క్లైమాక్స్‌లో ఏం జరిగింది?

  బోరుబావిలో పడిన బాలికను రక్షించే క్రమంలో నిజాయితీపరురాలైన కలెక్షర్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? బోరుబావిలో పడిన ధన్సిక పరిస్థితి ఏమైంది? బోరుబావిలో పడిన బాలిక ప్రాణాలతో బయటపడిందా? బోరుబావిలో పడిన ధన్సిక ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నది అనే ప్రశ్నలకు సమాధానమే కర్తవ్యం.

  తొలిభాగంలో కథ, కథనాలు

  కర్తవ్యం తొలిభాగంలో ప్రధానంగా ఓ కూలీ కుటుంబం పడే కష్టాలను తెరమీద కళ్లకు కట్టినట్టు చిత్రీకరించారు. అరకొర సంపాదనతో బుల్లబ్బాయి ఎలా తన కుటుంబాన్ని పోషించడానికి ఎలా ఇబ్బంది పడ్డారు. స్విమ్మర్‌గా రాణించాలనే తన కొడుకు కోరికను ఎందుకు తిరస్కరించాడు అనే అంశాలతో కథ సాగుతుంది. బుల్లబ్బాయి ఎదుర్కొనే ప్రతీ అంశం పేదవాళ్ల కష్టాలకు దర్బణం పట్టాయి. ధన్సిక బోరుబావిలో పడటంతో కథ మరో మలుపు తిరుగుతుంది. 36 అడుగుల లోతులో పడిన ధన్సికను పైకి లాగే ప్రయత్నం బెడిసి కొట్టి 90 అడుగుల లోతులో పడే భావోద్వేగ సన్నివేశంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.

  రెండోభాగంలో స్టోరీ, స్క్రీన్ ప్లే

  ఇక ఇంటర్వెల్ తర్వాత ధన్సికను బయటకు తీసే ప్రయత్నంలో మీడియా చేసే హంగామా, రాజకీయ నేతల తీరు, అసమర్ధ అధికారుల ప్రవర్తన లాంటి అంశాలు సమకాలీన పరిస్థితులకు అద్దం పడుతాయి. ధన్సికను తన సొంత కూతురుగా కంటే ఎక్కువ ప్రేమించిన నయనతార నటన రెండోభాగంలో అద్భుతంగా ఉంటుంది. కర్తవ్యం చివరి 45 నిమిషాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు గుండెను పిండేస్తాయి.

  దర్శకత్వ ప్రతిభ

  దర్శకుడు గోపి నయనార్ కథను మలిచిన విధానాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. పేదల జీవితంలో కష్టాలు, కన్నీళ్లు ఎలా ఉంటాయనే విషయం కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇక కలెక్టర్ పాత్రను మలిచిన తీరు అద్భుతంగా అనిపిస్తుంది. తారల హంగామా లేకుండా కేవలం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని నటీనటులతో కర్తవ్యాన్ని అమోఘంగా తీర్చిదిద్దారు. సమాజంలో అధికారులు, ప్రభుత్వ వ్యవస్థల తీరుపై సినీ విమర్శనాస్త్రాన్ని అద్భుతంగా సంధించారు.

  హృదయానికి హత్తుకునేలా..

  బీడుబారిన పంటపోలాల్లో బోరుబావి ఉదంతాన్ని హృదయాన్ని అత్తుకునే విధంగా చిత్రీకరించారు. ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ గోపి నయనార్ అని చెప్పవచ్చు. కథను ఇస్రో శాటిలైట్ ప్రయోగానికి లింక్ చేయడం అతని టాలెంట్‌కు గొప్ప నిదర్శనం. సినిమాకు పరిచయం లేని వారి నుంచి నటనను రాబట్టిన విధానం చక్కగా ఉంటుంది.

  నయనతార నటన హైలెట్

  కర్తవ్యం సినిమాకు ప్రధాన బలం నయనతార నటన. కలెక్టర్ పాత్రలో నయనతార చక్కగా ఒదిగిపోయారు. కీలక సన్నివేశాలలో భావోద్వేగాన్ని అద్భుతంగా పడించారు. తన అధికారాన్ని ప్రదర్శించడానికి నయనతార చూపిన హావభావాలు, ముఖ్యంగా కళ్లతో పలికించిన భావాలు ఆమె ప్రతిభకు అద్దం పట్టాయి. కలెక్టర్ పాత్రలో పరిపూర్ణమైన నటిగా కనిపిస్తారు. ప్రాధానంగా క్లైమాక్స్‌లో ఆమె నటన కంటతడి పెట్టించేంతగా ఉంటుంది.

  మిగితా పాత్రల్లో

  నయనతార తర్వాత మంచి నటనను ప్రదర్శించిన వారిలో బుల్లబ్బాయిగా రామచంద్రన్, సుమతిగా సునులక్ష్మీ ప్రతిభ ప్రశంశనీయం. పేదరికంతో బాధపడటం, తాము అమితంగా ప్రేమించే తమ కూతురు బోరుబావిలో పడినప్పుడు వారి పడిన వేదన తెరమీద చూడాల్సిందే. మిగితా పాత్రల్లో పెద్దగా గుర్తింపు లేకపోయినా తమ పాత్రల పరిధి మేరకు వావ్ అనిపించారు.

  ఆకట్టుకొనే సినిమాటోగ్రఫీ

  కర్తవ్యం సినిమాకు ఓం ప్రకాశ్ సినిమాటోగ్రఫిని అందించారు. కేవలం అర ఎకరం ప్రదేశంలో సన్నివేశాలను తీర్చిదిద్దిన తీరు అభినందనీయం. చిన్న ప్రదేశాన్ని చక్కగా ఉపయోగించుకొని కెమెరాతో ఆడుకొన్నారనే చెప్పవచ్చు. కిక్కిరిసిన జనం మధ్య ఎమోషనల్ సీన్లను చక్కగా షూట్ చేశారు. ఓం ప్రకాశ్ పనితీరు ఈ సినిమాకు ప్రధాన ఎసెట్.

  జిబ్రాన్ సంగీతం

  కర్తవ్యం సినిమాకు జిబ్రాన్ అందించిన సంగీతం ప్రాణంలా నిలిచింది. భావోద్వేగ సన్నివేశాలలో జిబ్రాన్ రీరికార్డింగ్ హృదయాన్ని తాకేలా ఉంటుంది. సినిమా చూసే ప్రతీ ఒక్కరు ఎమోషనల్‌గా కనెక్ట్ కావడానికి దోహదపడుతుంది. చివరి 30 నిమిషాల్లో రీరికార్డింగ్ ప్రభావంతో ప్రేక్షకుడు కంటతడి పెట్టడం ఖాయం.

  నేటివిటీ సమస్య

  కర్తవ్యం చిత్రం తెలుగు నేటివిటికి దూరంగా ఉండటమే కొంత ఇబ్బందికి గురిచేస్తుంది. నటీనటులు పెద్దగా పరిచయం లేకపోవడం ప్రేక్షకుడు కథకు కనెక్ట్ కాకపోయే ప్రమాదం ఉంది. కానీ తమిళ వాసనలు ఏమాత్రం కనిపించకుండా డైలాగ‌ుల పరంగా తగిన జాగ్రత్తలు తీసుకొన్నారు. నయనతార డబ్బింగ్ తెలుగు ప్రేక్షకులకు అభిరుచికి దగ్గరగా ఉంటుంది.

  ప్రొడక్షన్ వ్యాల్యూస్

  తమిళ ఆరమ్ నుంచి కర్తవ్యంగా మలచడంలో నిర్మాత శరత్ మరార్ పూర్తిగా సఫలమయ్యాడనే చెప్పవచ్చు. సినిమాపై ఉన్న నమ్మకంతోనే నాలుగైదు రోజుల ముందే ప్రివ్యూ ప్రదర్శనలు వేసి సినిమాకు మౌత్‌టాక్ పెంచేందుకు ప్రయత్నించడం అతడి మార్కెటింగ్ స్ట్రాటజీకి అద్దం పట్టింది. ఎమోషనల్ కంటెంట్‌ను ప్రేక్షకుల వద్దకు చేర్చాలనే ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే.

  ఫైనల్‌గా

  రోటిన్ కథలతో విసిగిపోయిన ప్రేక్షకులకు కర్తవ్యం ఓ విభిన్నమైన చిత్రంగా కనిపిస్తుంది. సామాజిక బాధ్యతను గుర్తు చేసేలా ఈ చిత్రం ఆలోచింపజేస్తుంది. సమకాలీన రాజకీయ పరిస్థితులపై విమర్శనాస్త్రం.

  బలం, బలహీనతలు

  ప్లస్ పాయింట్స్

  • నయనతార యాక్టింగ్
  • రామచంద్రన్, సునులక్ష్మీ ఫెర్ఫార్మెన్స్
  • గోపి నయనార్ టేకింగ్
  • సినిమాటోగ్రఫీ
  • ఎడిటింగ్

  మైనస్ పాయింట్

  • నేటివిటి
  • సీరియస్‌గా సాగడం

  తెర ముందు, తెర వెనుక

  నటీనటుల: నయనతార, సునులక్ష్మీ, రామచంద్రన్, కాకముట్టై రమేష్, కాకముట్టై విఘ్నేష్ తదితరులు
  కథ, దర్శకత్వం: గోపి నయనార్
  సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాశ్
  సంగీతం: జిబ్రాన్
  ఎడిటింగ్: రూమెన్
  రిలీజ్ డేట్: మార్చి 16, 2018

  English summary
  kartavyam is a Telugu-language drama film written and directed by Gopi Nainar. It features Nayanthara in the lead role as a district collector, with Ramachandran Durairaj and Sunu Lakshmi in supporting roles. Featuring music composed by Ghibran and cinematography by Om Prakash. This film is set release on March 16, 2018.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more