»   » ప్రేక్షకులను మోసం చేసే 'కేడీ' (రివ్యూ)

ప్రేక్షకులను మోసం చేసే 'కేడీ' (రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kedi
Rating

-జోశ్యుల సూర్య ప్రకాష్
సంస్థ: కామాక్షి కళామూవీస్‌
నటీనటులు: నాగార్జున, మమతా మోహన్‌ దాస్‌, బ్రహ్మానందం, లిండా, అంకుర్‌, నిర్మల్‌ పాండే,
అఖిలేంద్ర మిశ్రా, కెల్లీ దోర్జి, సాయాజీ షిండే తదితరులు. ప్రత్యేక గీతంలో మెహక్‌.
కెమెరా: సర్వేష్ మురారి
ఎడిటింగ్: శరవణ్
సంగీతం: సందీప్ చౌతా
సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్
నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి
దర్శకత్వం: కిరణ్‌
విడుదల తేది: పిబ్రవరి 12, 2010

కొత్త దర్శకుడుతో సినిమా చేస్తున్నాను..డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసాడు అని నాగార్జున ఒకటికి పదిసార్లు మీడియా ముందుకు వచ్చి చెప్తూంటే ఏమో మళ్ళీ ఏ 'శివ' లాంటి అధ్బుతమో జరుగుతుందని ఆశపడటం సహజం. అయితే కొత్తదనం పేరు చెప్పి విపరీతమైన స్లో నేరేషన్ తో విచిత్రమైన ట్విస్టులతో సినిమా వస్తుందని ఏ మాత్రం ఊహించం. కేడీకి అదే జరిగింది. ప్రేక్షకుడుని దర్శకుడు కేడీలా మారి వంచించాడు. కొత్త(నేరేషన్ లేదా దర్శకుడు) అంటేనే భయపడేలా సినిమా తీసి, సహన పరీక్ష పెట్టాడు. అలాగే తన దర్శకత్వంకు తగినట్లే అన్ని విభాగాలు చాలా నీరసంగా పనిచేసేటట్లు చూసుకున్నాడు.దాంతో ఈ చిత్రం అభిమానులకైనా నచ్చుతుందా అంటే సందేహమే అన్నట్లు తయారైంది. కేవలం నాగార్జన నటన మాత్రమేఅంత నసలోనూ జనాల్ని చివర దాకా కూర్చొపెట్టగలిగింది.

ఉషారైన రమేష్ ఉరఫ్ రమ్మీ(నాగార్జున) చిన్నప్పుడే ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ బాల్య ప్రేమ వికసిస్తుంది అనుకుంటూండగా పెద్దలుకు తెలిసి మాడిపోతుంది. దాంతో మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం అని రమేష్ ప్రపోజల్ పెడితే ఆ పిల్ల వద్దు...నువ్వు నన్ను ఏం పెట్టి పోషిస్తావు అని నిలదీస్తుంది. దాంతో రమేష్ కి డబ్బే జీవితం అనే జీవిత సత్యం తెలిసి కేడిలా మారతాడు. వరసగా దొంగతనాలు తో ఎదిగి కాలక్రమేణా చంద్ర(అంకుర్) వంటి స్మగ్లర్స్ తో సంభందాలు ఏర్పడి పెద్ద పెద్ద డీల్స్ చేస్తూంటారు. ఆ క్రమంలో అతనికి సంధ్య(మమతా మోహన్ దాస్) పరిచయం అవుతుంది. అప్పటికే భర్త చనిపోయి ఓ పిల్లాడు ఉన్న ఆమె రమ్మీ చెంత చేరి అతన్ని మార్చటానికి ట్రై చేస్తుంది. అదిష్టం లేక వెళ్ళిపోతున్న రమ్మికి ఆమె గురించి ఓ షాకయ్యే విషయం తెలుస్తుంది. అది పరిష్కరించుకునేలోగా చంద్రం అతని పాలిట విలన్ గా తయారవుతాడు. అప్పుడు రమ్మీ ఏం చేసాడు...సంధ్య ఏమైంది అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎప్పుడూ కొత్త కావాలంటారు...సర్లే అని కొత్తగా ప్రయత్నిస్తే బాగోలేదంటారు..అని సినీ పరిశ్రమవారు తరుచుగా ప్రేక్షకులని విసుక్కుంటూంటారు. అయితే కొత్త అంటే ఏమిటన్నది ప్రక్కన పెడితే అది కేడీ లాంటిది మాత్రం కాదు అన్నది రుజువయ్యింది. ఎందుకంటే కథని డిఫెరెంట్ స్క్రీన్ ప్లే తో ప్రెజెంట్ చేస్తున్నామన్న ఆలోచనతో ప్రేక్షకులని కన్ఫూజ్ చేసేసారు. అందులోనూ ఎక్కడా హీరోకి ప్రధాన ప్రత్యర్ధిగానీ, ప్రధాన సమస్య గానీ లేకుండా కథ రాసుకున్నారు. దాంతో హీరో పాత్ర తెరపై ఆడింది ఆట పాడింది పాటగా మారి ఏక్టివ్ ప్యాసివ్ గా మారింది. అతనికి క్లైమాక్స్ వచ్చినా కూడా కాంప్లిక్ట్ అనేదే రాదు. దాంతో డ్రామా పుట్టక కథనం నీరసించి ఆవలింతలు తెప్పించింది. అలాగే మమతా మోహన్ దాస్ పాత్రను ట్విస్ట్ కోసం విపరీతమైన ప్లాష్ బ్యాక్ పెట్టారు. అయితే ట్విస్ట్ పండిన తర్వాత ఆ ప్లాష్ బ్యాక్ ని ప్రేక్షకులు చూసి హాహాకారాలు పెడతారనే ఆలోచన లేకుండా అల్లుకున్నారు.

ఇక నాగార్జున ఈ చిత్రానికి డబ్బు బాగానే ఖర్చు పెట్టారు(ఆయన సొంత సంస్ధ లాంటిదే కాబట్టి). అలాగే కొత్త దర్శకుడుకీ అవకాశమిచ్చి ప్రోత్సహించారు. అయితే అతనే అవకాశం వినియోగించుకోలేదనిపిస్తుంది. హిందీ చిత్రం లక్కీ ఓయ్ లక్కిని పోలి ఉండే నేరేషన్ ని కొంతవరకూ పాటించాడు. అయితే తెలుగుకు అది ఎంతవరకూ పనికొస్తుందని ఆలోచించినట్లు లేదు. వీటికి తోడుఇలాంటి ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లు (స్లమ్ డాగ్ మిలియనీర్) వంటివి ఒక్కో ముడి విడతీస్తూంటే తరువాత ఏం జరుగుతుందనే టెన్షన్ క్రియేట్ చెయ్యగలగాలి. అలాగే ప్లాష్ బ్యాక్ లో చెప్పే కొత్త విషయాలు కథకు పనికి వచ్చి ముందుకు తీసుకెళ్లేలా ఉండాలి. ఇక మమతా మోహన్ దాస్ పాత్రా చిన్నదే...నీరసమైనదే. ఎప్పుడూ సాడ్ గా ఉంటే ఆ పాత్ర నటనా అంతంత మాత్రమే.

అలాగే దాచి ఉంచిన అనూష్క ఐటం సాంగ్ ఎంతవరకూ సినిమాకి పనికివచ్చింది అంటే ఆలోచించాల్సిందే. ఇక సందీప్ చౌతా సంగీతం అంతంత మాత్రంగానే సాగింది. ము..ము..ముద్దంటే చేదా అన్న రీమిక్స్ పాట కాస్త పేలింది. డైలాగులు విషయానికి వస్తే ఆ క్రెడిట్ డైరక్టర్ దే అవీ ఏ మాత్రం పండకుండా జాగ్రత్తపడి రాసుకున్నాడు. కెమెరా,ఎ డిటింగ్ ఉన్నంతలో బాగున్నాయి. అయితే దర్శకత్వం బాగుంటేనే మిగతా విభాగాలు హైలెట్ అయ్యేది. అదే ఇక్కడ మిస్సయింది. అలాగే మొదటినుంచి చివర వరకూ ఏసిపీ శేఖర్ (షాయీజీ షిండే) పాత్ర నాగార్జున చెప్పే కథ వింటూ..ఆహా ఓహో అని గడిపేయటం విచిత్రమనిపిస్తుంది. బ్రహ్మానందం కామెడీ అక్కడక్కడా పేలింది కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. దీనికి తోడుఫస్టాఫ్ లో వచ్చే బ్రిటన్ అమ్మాయి ధ్రెడ్ సినిమాకు ఎంతవరకూ పనికివచ్చిందో డైరక్టరే చెప్పాలి. ఎందుకంటే అది స్క్రీన్ టైమ్ ని తినేయటం తప్పించి ఏం జరగలేదు. అలాగే నాగార్జున ప్రక్కన చేసిన హర్షవర్దన్ కూడా ఆ పాత్రలో ఒదగలేదు. అయితే అన్నీ మైనస్ లేనా ప్లస్ లు లేవా అంటే కొన్ని చోట్ల సైలెంట్ గా నవ్వు తెప్పించాడు.

ఏదిఏమైనా గ్యాప్ తర్వాత ఊరిస్తూ వచ్చిన నాగార్జున కేడీ చిత్రం పూర్తి స్దాయిలో నిరాసపరిచందనే చెప్పాలి. అయితే జయాపజయాలు ప్రక్కన పెడితే రెగ్యులర్ సినిమా ధోరణిలోకి వెళ్ళకుండా...తను నమ్మినట్లు దర్శకుడు పూర్త స్ధాయిలో సినిమాను తెరకెక్కించినందుకు అబినందించాలి. అయితే స్క్రిప్టు సరిగ్గా చేసుకుని ఉంటే సక్సెస్ అయ్యేవాడనిపిస్తుంది. ఈ సినిమాని కేవలం నాగార్జుని స్టైలిష్ గా చూడాలనుకున్న ఆసక్తి ఉన్నావారు మాత్రమే చూడాలి అని ట్యాగ్ లైన్ పెడితే బావుండను అనిపించేలా చేసారు. అలాగే కొత్త దర్శకుడు మరింత జాగ్రత్తగా కథ,కథనాలు వండుకుని ఉంటే నాగార్జున కష్టపడి నటించిన దానికి అర్ధం(డబ్బు) లభించినట్లయ్యేది. ఇక ఈ చిత్రంలో ఫ్యామిలీలును ఆకర్షించే అంశాలు కూడా లేకపోవటం, స్త్రీ పాత్రలకు, రొమాన్స్ కు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో ఆ రెండు వర్గాలు దూరం అవుతాయనిపిస్తోంది. అలాగే నేటి యూత్ కి సినిమా పట్టాలంటే మరింత స్పీడు అవసరం. లేకుంటే మనం బాగానే తీసాం...ప్చ్ ప్రేక్షుకులే ఇంకా ఎదగలేదు అని సరిపెట్టుకోవటం మిగులుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu