twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఖుషీ చేసే ఖుషి

    By Staff
    |

    Khusi
    -సత్య

    సర్వసాధారణంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న చిత్రాల్లో ఎక్కువ శాతం నిరాశాజనకమైన ఫలితాల్ని ఇస్తుంటాయి. అయితే తాజాగా విడుదలైన పవన్‌కళ్యాణ్‌ చిత్రం ఖుషి అందుకు భిన్నంగా అంచనాలకు తగ్గట్లుగానే ఉంది. ప్రతి ఫేమ్‌లో హీరో పవన్‌కళ్యాణ్‌, దర్శకుడే కనిపిస్తారు. కథగా చెప్పుకోవాల్సింది ఈ చిత్రంలో పెద్దగా ఏం లేదు. కానీ ఆ కథని చెప్పిన తీరు, చిత్రీకరణ వైవిధ్యంగా ఉండటంతో ప్రేక్షకులు ఆద్యంతం ఎంజాయ్‌ చేస్తారు. ప్రత్యేకించి యువతకు మంచి ఖుషీని కలిగించే చిత్రంగా పేర్కొన వచ్చు.

    చిత్రం ఎత్తుగడే బాగుంది. రెండు వేరు వేరు పట్టణాల్లో పుట్టిన ఇద్దరు పిల్లలు ప్రేమికులు కానున్నారని చెబుతూ కలకత్తాలో నాజర్‌ దంపతులకు పుట్టిన సిద్ధార్థ్‌ రాయ్‌(పవన్‌ కళ్యాణ్‌) కోనసీమలో విజయ్‌కుమార్‌, సుధకు పుట్టిన మధు (భూమిక) పరిచయంతో సినిమా ప్రారంభం అవుతుంది. పై చదువులు చదవాలనే ఆసక్తి ఉన్న ఇద్దరూ బ్రహ్మరాత వల్ల అనుకోకుండా హైదరాబాద్‌లో ఒకే కాలేజ్‌లో చదువుకోసం చేరుతారు. అక్కడ వీరిద్దరికి పరిచయం ఏర్పడి ఒకరినొకరు ఇష్టడుతుంటారు. కానీ తమ ప్రేమను చెప్పాలని వున్నా ఎవరూ ధైర్యం చేయరు.

    ఈ నేపథ్యంలో అనుకోకుండా ఓ చిన్న విషయంలో (భూమిక నడుమును పవన్‌ చూడటం) ఇగో ఫీలయిన ఇద్దరూ తాత్కాలికమైన ఎడబాటుకు గురౌవుతారు. (కేవలం రెండు రోజుల ప్రేమకే లిప్స్‌ లిప్స్‌ కలిసిపోతున్న కాలమిది. అయినా సినిమా కాబట్టి ఓ.కె). వీరిద్దరూ కలిపిన మరో ప్రేమ జంట (శివాజీ, కొత్త అమ్మాయి) అమ్మాయి తండ్రి కారణంగా విడిపోతుంటే కలపటానికి చేసే ప్రయత్నంలో కలుస్తూ కూడా ఇగోని వదులుకోరు. ఒకరిపై ఒకరికి లోలోన ప్రేమ ఉన్నా వెల్లడించుకోరు. చివరకు కాలేజ్‌ ముగిసి తిరిగి వెళుతున్న సమయంలో ప్రేమను తెలియచేసుకోవటానికి తాపత్రయ పడి చిరవకు ఏకం కావటమే ఈ చిత్రం కథాంశం.

    కథ చదివిన తర్వాత ఓస్‌....ఇంతేనా అనిపించక మానదు. అయితే మొత్తంగా చూస్తే షడ్రతోపేతమైన విందును ఆరగించిన అనుభూతి కలుగుతుంది. ఈ తరహా కథను ఎంపిక చేసుకోవాటనికి ఎంతో ధైర్యం ఉండాలి. అందుకే దర్శకుడు, హీరో, నిర్మాతను ఈ విషయంలో అభినందించక తప్పదు. సినిమా హైలైట్స్‌లో కథనంతో పాటు పవన్‌ హావభావ ప్రకటన, మణిశర్మ నేపథ్య సంగీతం ముందు వరుసలో ఉంటాయి. పాటలు చిత్రీకరణ పరంగా కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

    ఆడువారి మాటలకు అర్థాలే వేరులే పాటను సందర్భోచితంగా వాడుకున్న తీరు, బ్యాక్‌ గ్రౌండ్‌లో ఆ పాట ట్యూన్‌ను రీరికార్డింగ్‌లో మణిశర్మ ఉపయోగించటం అద్భతమనిపించింది. అయితే ఈ పాట చిత్రీకరణను బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో చిత్రీకరించి ఉంటే మరింత బావుండేది. అలానే రాజేంద్రకుమార్‌ మాటలు సహజసిద్ధంగా ఉన్నాయి. కాలేజ్‌ పిల్లలు వాడే భాషే ఇందులో వినిపిస్తుంది. నటీనటుల మేకప్‌ నుంచి ప్రతి చిన్న విషయంలో దర్శకుడు ఎంతో జాగ్రత్త వహించాడనే చెప్పొచ్చు.

    తమిళంలో వాలి, ఖుషి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు యస్‌.జె.సూర్యకు తెలుగులో ఇది తొలి చిత్రం. తమిళం నుంచి తెలుగుకు రీమేక్‌ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని తీసుకుని పవన్‌ ఇమేజ్‌కి తగ్గట్లు నేర్పుగా చిత్రీకరించారు సూర్య. పి.సి.శ్రీరామ్‌ కెమెరాపనితనం, లెనిన్‌ ఎడిటింగ్‌ సినిమాను మరింత ఎలివేట్‌ చేశాయి. ఖర్చువిషయంలో రాజీపడని ఎ.ఎమ్‌.రత్నం తత్వం కూడా సినిమాలో కనిపించింది. మొత్తం మీద ఖుషి ప్రేక్షకులకు వీర లెవల్లో ఖుషిని కలిగిస్తుందన్నది నిజం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X