twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శేఖర్ కమ్ముల లీ'డర్' (రివ్యూ)

    By Srikanya
    |
    Leader
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్థ: ఏవియం ప్రొడక్షన్స్
    నటీనటులు: దగ్గుపాటి రాణా, రిచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్, సుబ్బరాజు,
    హర్షవర్ధన్, కోట శ్రీనివాసరావు, ఆహుతి ప్రసాద్, తనికెళ్ళ భరణి, సహాసిని,
    సుమన్. ఐటం సాంగ్ లో ఉదయభాను.
    కెమెరా: విజయ్ సి.కుమార్
    ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్
    సంగీతం: మిక్కీజే మేయర్
    నిర్మాత: ఎమ్.శవరణ్, ఎమ్ ఎస్ గుహన్
    కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శేఖర్ కమ్ముల
    విడుదల తేది: పిబ్రవరి 19, 2010

    రొమాంటిక్ కామిడీలు తీసే శేఖర్ కమ్ముల పొలిటికల్ డ్రామాలు ఎక్కడ డీల్ చేయగలడు అంటూ 'లీడర్' ప్రారంభమైన నాటినుంచీ వచ్చిన కామెంట్స్ వినిపిస్తున్నాయి. విన్నాడో ఏమో గానీ వాటిని నిజం చేస్తూ శేఖర్ ఈ బొర్ సినిమా తీసాడు. రాణాను హీరోగా పరిచయం చేస్తూ తీసిన ఈ చిత్రం లో ఉపదేశాలు ఎక్కువై ప్రేక్షకులచే బలవంతంగా ఉపవాసం చేయించిన ఫీలింగ్ రప్పించారు. ముఖ్యంగా శేఖర్ కమ్ముల ప్రతీ సినిమాకూ బలంగా ఉంటూ వచ్చిన స్క్రిప్టే ఈసారి దెబ్బతీసింది. అలాగే సినిమా కాన్సెప్ట్ లోనే అసంబద్దత ఉందనిపిస్తుంది. అవినీతి లేని సమాజాన్ని అందిద్దామని బయిలుదేరిన హీరో..అదే అవినీతినే ఆశ్రయిస్తూ ముందుకు వెళ్ళటం అనే స్టోరీలైన్ జీర్ణించుకోలేని అంశం. ఇక హీరో..లీడర్ (ముఖ్యమంత్రి) అయ్యాక ఏదో చేస్తాడనుకున్న ప్రజలకు ఒరగపెట్టింది ఏమీ ఉండదు. దాంతో చిత్రం చూస్తున్న వారికి ఆ క్లైమాక్స్ తృప్తి అనిపించదు. వీటికి తోడు రొమాంటిక్ ట్రాక్ సరిగా లేకపోవటం, ఎక్కడా రిలీఫ్ కోసం కూడా కామిడీని ఆశ్రయించకపోవటం మరో మైనస్ అనిపిస్తుంది. టోటల్ గా రాణా లాంచింగ్ కి ఈ చిత్రం అనువైంది కాదేమోనని డౌట్ వచ్చేస్తుంది.

    రాష్ట్ర ముఖ్యమంత్రి (సుమన్) అయిన తండ్రి ఓ బాంబ్ బ్లాస్ట్ కి బలి అయ్యాడని అమెరికా నుంచి అర్జున్ ప్రసాద్(రాణా) వస్తాడు. చివరి క్షణాల్లో ఉన్న తండ్రి ముఖ్యమంత్రి అవ్వమని మాట తీసుకుంటాడు. ఆ మాటను నిలబెట్టటానికి అర్జున్..రాజకీయమనే పద్మవ్యూహంలో ప్రవేశిస్తాడు.ఆ క్రమంలో అర్జున్ కి తండ్రే పెద్ద అవినీతిపరుడని తెలుస్తుంది. దాంతో తనైనా అవినీతిలేని సమాజాన్ని అందించి, ప్రజల రుణం తీర్చుకోవాలని కంకణం కట్టుకుంటాడు. అయితే అప్పటికే ఆ ముఖ్యమంత్రి పదివి కోసం మంతనాలు జరిగి ధనరాజ్(సుబ్బరాజు)ముందుకొస్తాడు. అతను ఎంతకైనా తెగించే మనిషని, తన తండ్రి మరణానానికి అతడే కారణమని తెలుసుకున్న అర్జున్ ముల్లును ముల్లుతోనే తీసే విధంగా అదే అవినీతి దారిలో ముఖ్యమంత్రి అవుతాడు. ఆ తర్వాత ప్రజలకు ఏం చేసాడు. అతను అనుకున్న అవినీతిలేని సమాజం సాధించాడా..అలాగే రేడియో జాకీ (హీరోయిన్) తో హీరోకి సంభంధం ఏమిటీ...అంటే సినిమా చూడాల్సిందే.

    శంకర్ 'ఒకే ఒక్కడు', 'శివాజీ',చిరంజీవి 'ఠాగూర్', రాజశేఖర్ 'ఎవడైతే నాకేంటి' లాంటి చిత్రాలలో అవినీతిలేని వ్యవస్ధను ఏర్పాటు చేయటం కోసం హీరోలు పడే తపన మనం ఇప్పటికే చూసేసాం. దాంతో ఈ చిత్రం అంతకుమించిన కొత్త విషయమేమీ చర్చించకపోవటంతో పెద్దగా కిక్ ఇవ్వదు. అవినీతిలేని సమాజం కోసం బ్లాక్ మనీ వెలికితీయాలి...అందుకు అవినీతి అధికారులను సంఖ్య పెంచాలి..రాజనీయనాయకులనీ వదలకుండా దాడులు చేయాలి వంటివి చాలా కాలంగా వింటున్నవే. కాబట్టి శేఖర్ కమ్ముల తీసుకున్న సెంటర్ పాయింటే కొంచెం కొత్తగా తీసుకుంటే బావుండేది అనిపిస్తుంది. అలాగే తన తండ్రిని(ఆయన ఎంత అవినీతిపరుడైనా) చంపించిన వాళ్ళని హీరో ఏమీ చేయకుండా వదిలేయటం విచిత్రమనిపిస్తుంది. అంతేగాక వ్యవ్యస్ధను బాగుచేయాలి అని హీరో కూడా అవినీతిరూటులోనే వెళ్ళి ఎమ్మల్యేలను కొనటం,కమీషన్ తీసుకోవటం వంటివి ఎత్తుకున్న పాయింట్ నే దెబ్బ తీసాయి. అలాగే తీసేది ఎలాగూ కల్పించిన కథే కాబట్టి చివరకు అవినీతిలేని సమాజాన్ని హీరో సాధించాడు అని చెబితే కొంత ఆశ, తృప్తి అయినా చూసినవారికి కలిగేవి. అదేమీ లేకుండా కేవలం హీరో అవినీతిపరుల దగ్గరున్న బ్లాక్ మనీని బయిటపెట్టాడు అని చూపారు. అలా కాకుండా వెలికి తీసిన బ్లాక్ మనీతో ప్రజలకు ఏం చేసాడు అన్నది చూపితే ఓ మార్గదర్శకంగా బావుండేది.

    ఇక స్క్రిప్టు పరంగా చూస్తే ఇంటర్వెల్ వరకూ కేవలం హీరో ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనే అంశమే చూపెట్టారు. నిజానికి అతను ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు అవినీతి లేని పాలన ఎలా అందించాడు. ఆ క్రమంలో అతను ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వాటిని ఎలా పరిష్కరించాడు అన్నది కథ. అయితే అదంతా సెకెండాఫ్ సగంలో కానీ మొదలుకాదు. అలాగే లక్ష్యం సాధించే దిశలో హీరోకి ఎక్కడా ప్రతికూల శక్తులు అడ్డుపడటం జరగదు..డ్రామా పుట్టదు. పోనీ విలన్ సుబ్బరాజు...తన తెలివితో ఏదన్నా ప్లాన్ వేసి హీరోని అడ్డుకుంటాడా అంటే అదీ ఉండదు. సరే ఆ సంగతి ప్రక్కన పెట్టి అవినీతి రాజకీయనాయకులను పట్టుకుంటూంటే వారు ఏమన్నా అడ్డంకులు పెట్టారా అంటే అదీ ఉండదు. కథలో నెగిటివ్ ఫోర్స్ సుబ్బరాజు పాత్రా, అవినీతిరాజకీయనాయకులా అన్నది స్పష్టం కాదు. ఇక పెద్దాయనే(కోట) రాష్ట్రాన్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారని తెలిసినా హీరో ఆయన్ని ఏమీ చేయడు. వీటికి తోటు అదేం విచిత్రమో గాని ఎక్కడా హీరో తప్ప నిజాయితీ పరులైన రాజకీయనాయకులు ఉండరు. అలాగే రొమాంటిక్ ధ్రెడ్ ని సరిగా లాగలేదు. ఇద్దరూ హీరోయిన్స్ గాలికి కొట్టుకు వచ్చినట్లు అప్పుడప్పుడూ కనపడుతూంటారు. ఇక ఇలాంటి పొలిటికల్ డ్రామాలో రిలీఫ్ కోసం కామిడీని ట్రాక్ గా నైనా పెడుతూండటం పరిపాటి. అదీ ఇక్కడ మిస్సయింది. కెమెరా, ఎడిటింగ్ బాగున్నా పెద్దగా ఫలితం లేదు.

    ముఖ్యమగా మాట్లాడుకోవాల్సింది ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన రామానాయుడు మనవడు రాణా గురించి. అతను చూపులకు బాగున్నా...ముఖంలో ఇంకా ఎక్సప్రెషన్స్ పలకాలనిపిస్తుంది. హీరోయిన్స్ లో రిచా బాగుంది. గొల్లపూడి చాలా కాలం తర్వాత కొద్దిసేపే కనపడినా బాగా చేసారు. సుహాసిని హీరో తల్లిగా ఆమెకు అలవాటైన నటనను ప్రదర్శించింది. హర్షవర్ధన్..హీరో సహచరుడుగా కేడీ చిత్రం తర్వాత ఫుల్ లెంగ్త్ పాత్ర లభించింది..అతను సద్వినియోగం చేసుకున్నాడు. సంగీతం బాగోలేదు. ఉదయభాను ఐటం సాంగ్ అనవసరంగా పెట్టారనిపించింది. మాటలు ఇంతకు ముందు శేఖర్ సినిమాలోలాగ క్లారిటీగా లేవు. అలాగే తన అవసరం కోసం సెకెండ్ హీరోయిన్ తో ప్రేమ ఆట ఆడటం అస్సలు బాగోలేదు.

    ఏదైమైనా ముఖ్యమంత్రి...పొలిటికల్ డ్రామా అంటే కోడిరామకృష్ణ భారత్ బంద్ ఇప్పటికీ గుర్తుకు వస్తుంది.దాన్ని మరిపించగలిగేలా కాకున్నా దగ్గరలో తీసినా సినిమా వర్కవుట్ అయ్యేది. అందులోనీ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి హఠాత్తు మరణం ఈ కథకు కొంత ఉపకరించేది. అయితే శేఖర్ స్పష్టత లేకుండా కథ రాసుకుని తీసారు. వీటికి తోడు చిత్రం లెంగ్త్ ఎక్కువ అవటంతో ప్రేక్షకుల సహనానికి మరో పరీక్ష పెట్టినట్లు అయింది.రాణాని తమ సినిమాలో తీసుకుందామనుకునే వారుగానీ, అతను ఎలా చేసాడో చూద్దామనుకునేవారు మాత్రమే ఈ సినిమాకి వెళ్ళటం ఉత్తమం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X