twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెప్పించిన 'మహారథి'

    By Staff
    |

    Maharathi
    చిత్రం: మహారథి
    విడుదల తేదీ - గురువారం, 1 ఫిబ్రవరి 2007
    నటీనటులు బాలకృష్ణ, స్నేహ, మీరా జాస్మిన్‌, జయప్రద,
    నరేశ్‌, కోవై సరళ, జయప్రకాశ్‌ రెడ్డి, అలీ,
    తోటపల్లి మధు, నవనీత్‌ కౌర్‌ తదితరులు..
    సంగీతం: గురుకిరణ్‌
    కెమెరా: శేఖర్‌ వి జోసఫ్‌
    మాటలు: తోటపల్లి మధు
    ఎడిటింగ్‌: సురేశ్‌ ఉర్స్‌
    నిర్మాత: వాకాడ అప్పారావు
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి. వాసు

    రజనీకాంత్‌కి 'మన్నన్‌' వంటి మెగా హిట్‌ ఇచ్చిన దర్శకుడు పి. వాసు మళ్లీ బాలకృష్ణ హీరోగా 'మహారథి' రూపంలో మరో మంచి ఎంటర్‌టైనర్‌ అందించారు. మంచి కథ, మాటలు, పాటలు, కెమెరాపనితం, నటీనటులు.. ఇవన్నీ కలిస్తే సినిమా ఎంతగా ప్రేక్షకుల్ని అలరిస్తుందో మహారథి మరోమారు రుజువు చేసింది. ఈ సినిమా పూర్తిగా బాలకృష్ణ షో. ముచ్చటగా మూడు గెటప్స్‌లో బాలకృష్ణ సినిమాని పూర్తిగా తానే అయి నడిపించారు. హింసకు ఏమాత్రం తావు లేకుండా కేవలం వినోదాన్ని పంచుతూ ఈ సినిమా చివరి వరకూ కొనసాగి రంజింపజేస్తుంది.

    చాముండేశ్వరి (జయప్రద) సంపన్నురాలు. ఆమె ఆధ్వర్యంలో పలు కాలేజీలు నడుస్తుంటాయి. రిషీకేశ్‌లో ఆమె నిర్వహించే ఒక డాన్స్‌ కాలేజ్‌లో డాన్స్‌ టీచర్‌గా కృష్‌ ఉరఫ్‌ కృష్ణ (బాలకృష్ణ)ను నియమిస్తుంది. ఆ కాలేజీకి ఎదురుగా మరో డాన్స్‌ కాలేజీని చౌదరి (నరేశ్‌) పోటీగా నడుపుతుంటాడు. చౌదరి ఒక సంగీతం మాస్టారు బాల (బాలకృష్ణ)ని నియమిస్తాడు.

    చౌదరి కూతురు కల్యాణి (మీరా జాస్మిన్‌)ని ఎలాగైనా మచ్చిక చేసుకుని తమ డాన్స్‌ కాలేజీలో చేర్పించాలని చాముండేశ్వరి క్రిష్‌ని అడుగుతుంది. దీనికి కారణం ఆ తర్వాత బయటపడుతుంది. చాముండేశ్వరి, చౌదరి భార్యాభర్తలు. ఒక సంఘటన వల్ల విభేదించి విడిపోతారు. వారి కూతురు కల్యాణి తండ్రితో ఉండిపోతుంది. కల్యాణిని డాన్స్‌ కాలేజీలోకి తీసుకొచ్చే క్రమంలో ఆమె క్రిష్‌ని గాఢంగా ప్రేమించేస్తుంది. తనని పెళ్లి చేసుకోమని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని క్రిష్‌ని బెదిరిస్తుంది. ఆ సమయంలో కల్యాణికి తన తల్లి దగ్గర పనిచేసే క్రిష్‌, తండ్రి దగ్గర పనిచేసే బాల - ఇద్దరూ ఒక్కరేనని తెలుస్తుంది. బాల, క్రిష్‌ లాగా అతడు ఎందుకు చాముండేశ్వరి, చౌదరిల దగ్గర నాటకమాడుతున్నాడు? కథ ఫ్లాష్‌బ్యాక్‌కు వెళుతుంది.

    బాలయ్య (బాలకృష్ణ) మంచి మనసున్న రౌడీ. అతడి తల్లి కోవై సరళ. ఓ సందర్భంలో డాన్స్‌ పరిశోధన పేరుతో భైరవి (స్నేహ) బాలయ్యకు తటస్థపడి అతని ప్రేమలో పడుతుంది. అంతా బాగున్న దశలో అనుకోని సంఘటనలో స్నేహ ప్రాణం విడుస్తుంది. ఇక ఆ తర్వాత కథ తెరపై చూడాల్సిందే.

    చాలాకాలంగా రౌద్రం తప్ప మరో రసాన్ని పోషించని బాలకృష్ణ ఈ చిత్రంలో వినోదాన్ని చాలా చక్కగా పండించారు. చక్కని సన్నివేశాలు, మంచి సెంటిమెంట్‌, మాస్‌ ఎలిమెంట్లు, సంగీతంతో కథ సాగి ప్రతి సందర్భంలోనూ హీరోని హైలెట్‌ చేస్తుంటుంది. డైరెక్టర్‌ పి.వాసు చాలా సున్నితంగా, నేర్పుగా కథనాన్ని నడిపించారు. బాలకృష్ణ నటన, దర్శకుడి ప్రతిభ కారణంగా సినిమా ఎక్కడా బోర్‌ కొట్టదు. ప్రథమార్ధం బాగా హిలేరియస్‌గా ఉండగా, ద్వితీయార్ధంలో మాత్రం కొంత నెమ్మదిస్తుంది. అయితే, ఓవరాల్‌గా సినిమా పూర్తి వినోదభరితమైన చిత్రంగా అలరిస్తుంది. బాలకృష్ణ నుండి ఇటువంటి సినిమాని ప్రేక్షకులు వూహించలేరు.

    టెక్నీషియన్స్‌లో కెమెరామెన్‌ శేఖర్‌ వి జోసెఫ్‌ పనితనం హైలెట్‌గా నిలుస్తుంది. ఇంక గురుకిరణ్‌ బాణీలు అలరిస్తాయి. ముఖ్యంగా వీచే గాలులలో.. పాట ఆకట్టుకుంటుంది. స్నేహ చక్కగా రాణిస్తుంది. నవనీత్‌ కౌర్‌ గ్లామర్‌కే పరిమితం కాగా, మీరా జాస్మిన్‌ పాత్ర పరిధుల మేరకు నటించింది. చాలాకాలం తర్వాత తెలుగు తెరపై ప్రత్యక్షమైన జయప్రదకీ, బాలకృష్ణకీ మధ్య సన్నివేశాలు ఆసక్తికరంగా సాగాయి. జయప్రద భర్తగా నరేశ్‌ హీరోతో కలిసి మంచి వినోదం అందించారు.

    ఎన్టీఆర్‌, జయప్రద పాత సినిమా పాటలు కథనం నేపథ్యంలో చక్కగా వాడుకున్నారు. ఎన్టీఆర్‌ నటించిన పాత చిత్రాలు, పాత్రల పేర్లను బాలకృష్ణకు ఆపాదిస్తూ రాసిన సంభాషణలు వారి అభిమానుల్ని అలరిస్తాయి.ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా పూర్తిగా బాలకృష్ణ వన్‌మ్యాన్‌ షో. కథను పూర్తి తమ భుజాలపై పెట్టుకుని నడిపించారు. నాలుగు వైవిధ్యమైన గెటప్స్‌లోనూ ఆయన అలరిస్తారు. మహారథి అటు క్లాస్‌, ఇటు మాస్‌ ప్రేక్షకుల్ని అలరిస్తుంది.

    (గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు)

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X