»   » ‘రావణా’యణం (మణిరత్నం 'విలన్' రివ్యూ)

‘రావణా’యణం (మణిరత్నం 'విలన్' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu
Villain
Rating

-జోశ్యుల సూర్య ప్రకాష్
సంస్థ: మద్రాస్‌ టాకీస్‌
నటీనటులు: విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌, పృథ్వీరాజ్‌, ప్రియమణి, కార్తీక్‌, ప్రభు, మున్నా తదితరులు
డైలాగులు: విజయ్ కృష్ణ ఆచార్య
కెమెరా: సంతోష్ శివన్,వి మణికండన్
సంగీతం: ఎ.ఆర్‌.రెహమన్‌
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మణిరత్నం
నిర్మాతలు: మణిరత్నం, శారద
విడుదల తేది: 18 జూన్,2010

మామూలుగానే మణిరత్నం చిత్రం అనగానే ప్రత్యేకమైన ఎక్సపెక్టేషన్స్, అందులోనూ విక్రమ్ వంటి అద్బుతమైన నటనా పటిమ ఉన్న స్టార్, మాజీ ప్రపంచసుందరి ఐశ్వర్య కాంబినేషన్ అనగానే ఇక చెప్పుకునేదేముంది. అయితే ఆకాశాన్ని అంటే ఆ అంచనాలను అందులేకపోక కూలబడ్డాడు విలన్. రామాయణాన్ని మోడ్రనైజ్ చేస్తూ అల్లుకున్న కథే సినిమాను దెబ్బకొట్టింది. ఎందుకంటే ఆ కథలో ప్రతీ అంశమూ అందరీ పరిచయమనేది ఒకెత్తు అయితే ఇలాంటి సినిమాలు(ఖల్ నాయక్) ఇంతకుముందు కూడా చాలా వచ్చేయి. దాంతో నెక్స్ట్ పదో సీన్ లో ఏమి జరుగుతుందనేది అందరికీ చాలా ఈజీగా ఊహించే స్దితికి చేరుకుని ఆసక్తి చంపేసింది. అయితే విక్రమ్ నటనస, మణిరత్నం సినిమాని ఓ విజువల్ పోయిట్రీలా తీర్చిదిద్దిన తీరు మాత్రం మెచ్చుకోకుండా ఉండలేమనిపిస్తుంది. సినిమా ప్రియులకు ఈ చిత్రం ఓకే అనిపిస్తే...సినిమాని. వినోదంగా చూసే వారికి ఎక్కడా ఫన్ లేని, సీన్స్ లో బిగువులేని, కథలో డెప్త్ కనపడని ఈ చిత్రం కష్టమనిపిస్తుంది. దాంతో చాలామందికి మణిరత్నం ఈ చిత్రం తియ్యకుండా ఉండే బావుండేది అనిపించటంలో ఆశ్చర్యం లేదు.

కట్టె..కొట్టే..తెచ్చే అన్నట్లు ఈ కథను చెప్పుకుంటే రావణ్ లాంటి గిరిజిన నాయకుడు వీరా(విక్రమ్)...ఎస్పీ దేవ్ (పృధ్వీరాజ్) భార్య రాగిణి(ఐశ్వర్య రాయ్)ని కిడ్నాప్ చేసి తన స్ధావరమైన నల్లమల అడవుల మద్య ఉన్న గ్రామానికి తెస్తాడు. సీతలాంటి ఆమెను వెతుక్కుంటూ రాముడు లాంటి దేవ్ అడవుల్లోకి తన టీమ్ తో బయిలుదేరతాడు. దేవ్ కి తోడుగా ఆంజనేయులు పాత్రలాంటి అడవులు తెలిసిన త్రాగుబోతు కానిస్టేబుల్ (కార్తీక్) వస్తాడు. ఆ వెతుకులాట ఓ ప్రక్క వీరా తన పరాక్రమంతో పోలీసుల స్దావరంపై జరిపి వారిని మట్టుపెట్టడం, పోలీసులు తమ యుక్తులతో వారిని వెతకటం మరోప్రక్క ఏ మాత్రం ఆసక్తి లేకుండా జరుగుతుంది. వీటికి తోడు అశోకవనంలో సీతలాంటి ఐశ్వర్య రాయ్ అప్పుడప్పుడూ దీనమైన ఎక్సప్రెషన్స్ ఇస్తూంటుంది. క్లైమాక్స్ కు చేరేసరకి వీరా స్ధావరాన్ని ఛేదించిన దేవ్ ఎలా పోరాటం చేసి తన భార్యని గెలుచుకున్నాడు. ఏ రకంగా రావణుడులాంటి వీరా గొప్పవాడిగా నిలచిపోయాడు అన్నది తెరపై చూడాల్సిందే.

రామాయణాన్ని ఆధునకరీస్తూ రావణుడిని హైలెట్ చేస్తూ వచ్చిన ఈ చిత్రంలో పాత్రల గాఢత అంతగా కనపడదు. దానకి కారణం పాత్రలను వాటి వాటి నేఫద్యాల్లో ఎస్టాబ్లిష్ చేయకపోవటమేననిపిస్తుంది. పోనీ కథ మొత్తానికి కేంద్రమైన విక్రమ్ పాత్ర అయినా కరెక్టుగా చూపి ఉంటే బావుండేది. గిరిజన నాయకుడైన అతన్ని ఎందుకు పోలీసులు పట్టుకెళ్ళటానికి వస్తారు..అసలు అతను తనవారి కోసం ఏ రకంగా, దేనికోసం పోరాడుతున్నాడు...అనే విషయాలు సెటప్ చేస్తే బాగుండేది. అవి క్లారిటీ లేకపోవటం వల్ల కత తేలిపోయి ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న పోరాటం క్రిందే కనిపిస్తుంది..అదే విక్రమ్ పాత్ర తన జనం కోసమో, వారి హక్కుల కోసమో పోరాడుతూంటే అతనిపై సానుభూతి వచ్చి అతన్ని అనుసరిస్తూ అతని కష్టాలలో ఏడ్చి, కన్నీళ్ళను తుడిచి, నవ్వితే నవ్వి ప్రేక్షకులు సహాయానుభూతి పొందేవారు. కథలో అదే మిస్సయింది. అయితే మణిరత్నం...రెండు పాత్రలకూ ఒకే రకమైన ప్రాధాన్యత ఇస్తూ...డైరక్టర్ పాయింటాఫ్ వ్యూలో కథనాన్ని నడుపుతూ...ఓ తెలిసిన కథని సంఘర్షణలేకుండా తెరకెక్కించాడనిపిస్తుంది. ఎందుకంటే ఇంటర్వెల్ అయ్యేదాకా విక్రమ్ అస్సలు ఐశ్వర్య రాయ్ ని ఎందుకు కిడ్నాప్ చేసాడు...ఆమె ద్వారా అతను ఏం సాధిద్దామనుకున్నాడు...అతను ఏం నష్టపోయాడు..ఏం లాభం పొందుదామనుకున్నాడనేది స్పష్టం కాదు. అయితే ఈ చిత్రం టెక్నికల్ గా చాలా హై స్టాండర్డ్స్ లో ఉందని మాత్రం చెప్పవచ్చు. అయితే జీవంలేని ఆర్టు ఎంత అందంగా ఉంటేమాత్రం ఫలితం ఏముంటుంది. ఎంతసేపు భరించగలం. ఇక ఐశ్వర్య రాయ్ అయితే రాయిలాగ ఏ ఎక్సప్రెషన్స్ లేకుండా నిలబడితే...విక్రమ్ చాలా చోట్ల అనవరసంరాగ ఎక్కువ ఎమోషన్ ఫీలవుతున్నాడేమో అని డౌట్ వచ్చేస్తుంది. వీటి మద్యలో మళయాళ హీరో పృధ్వీరాజ్ మనకు పరిచయం లేకపోవటం వల్లో అండర్ ప్లే వల్లో ఆనడు. ప్రభు కథకి తన ఊబకాయంతో ఉపయోగపడితే, ప్రియమణి ఉన్నకాస్సేపు బాగా చేసింది. ఇక పాటలు రెగ్యులర్ మణిరత్నం చిత్రీకరణే..కొత్తేమీ లేదు. రహమాన్ మాత్రం కొన్ని చోట్ల మనస్సును తడతాడు.

ఏదైమైనా మణిరత్నం తాజా చిత్రం, సంతోష్ శివన్ ఛాయాగ్రహణం, రెహమాన్ సంగీతం అనే అంశాలు చాలా కీలకమైనవి కాబట్టి వారి అభిమానులు ఓ లుక్కేయవచ్చు. అయితే అదే అభిమానులు చూసాక బాధపడుతూ కూడా బయిటకు వచ్చే అవకాశం ఉంది. అలాగే హైప్ వచ్చినంత గొప్పగా ఈ చిత్రం లేదని కూడా గుర్తుంచుకుని వెళ్ళటం మంచిది. ఇక ట్రేడ్ పరంగా మంచి ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ చిత్రం ఏ మేరకు విజయం సాధిస్తుందీ అంటే ఆంద్రాలో మణిరత్నం,విక్రమ్ అభిమానులు ఏ మేరకు ఉన్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతకుమించి ఆశించమే అత్యాసే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu