twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనసంతా నువ్వే-సాధారణ చిత్రం

    By Staff
    |

    Mansantha Nuvve
    - జలపతి
    చిత్రం: మనసంతా నువ్వే
    నటీనటులు: ఉదయ్‌ కిరణ్‌, రీమాసేన్‌, తనూరాయ్‌, సిజ్జూ
    సంగీతం: ఆర్‌.పి.పట్నాయక్‌
    నిర్మాత: ఎం.ఎస్‌.రాజు
    దర్శకత్వం: వి.ఎన్‌.ఆదిత్యా

    కథ కంటే కథనం ముఖ్యమైన రోజుల్లో కథనమే సాధారణంగా ఉంటే ఏమవుతుంది? సాధారణ చిత్రంగానే మిగిలిపోతుంది. మనసంతా నువ్వే కూడా అదే కేటగిరిలోకి చేరుతుంది. ఉదయ్‌ కిరణ్‌, రీమాసేన్‌ కాంబినేషన్‌, ప్రేమకథ, మంచి సంగీతం- ఇలా అన్ని ఈ చిత్రానికి ప్లస్‌ పాయింట్లే. కానీ ఈ సినిమాలో స్క్రీన్‌ ప్లే మరీ పాతది. కథ కూడా పాతదే అనుకొండి. సీన్ల మధ్య సమన్వయం, స్మూత్‌ ట్రాన్సిషన్‌ లేకపోవడం ఈ సినిమాలో ప్రధానంగా లోపం. సునీల్‌ కామెడీ డైలాగ్‌ లు మాత్రం బాగా నవ్విస్తాయి. కామెడీ, మంచి పాటలే ఈ సినిమాకు ఎస్సెట్‌.

    ఉదయ్‌ కిరణ్‌, రీమాసేన్‌ చిన్ననాటి స్నేహితులు. ఉదయ్‌ పేదవాడు. రీమా ధనవంతురాలు. రీమా తండ్రికి అరకు నుంచి ట్రాన్స్‌ ఫర్‌ అవడంతో ఉదయ్‌, రీమా విడిపోతారు. తమ స్నేహానికి గుర్తుగా ఒక వాచీ ఇస్తుంది. తల్లితండ్రులు చనిపోవడంతో ఉదయ్‌ రైల్వే స్టేషన్లో ఇడ్లీలు అమ్ముకుంటుంటాడు. ఆ సమయంలో చంద్రమోహన్‌ ఉదయ్‌ ను చేరదీసి కొడుకులాగా పెంచుకుంటాడు. ఇక పెద్దయ్యాక, ఉదయ్‌ తండ్రికి సాయం చేస్తూ వాళ్ళ మ్యూజిక్‌ షాప్‌ లోనే పనిచేస్తాడు.

    మరోవైపు, రీమాసేన్‌ విదేశాల్లో చదువు పూర్తిచేసుకొని ఇండియాకి వస్తుంది. చిన్ననాటి మిత్రుణ్ణి ప్రేమిస్తూ, అతనికోసం వైజాగ్‌ వస్తుంది. తనురాయ్‌ స్వాతి ఎడిటర్‌ కూతురు(వైజాగ్‌ లో స్వాతి ఆఫీస్‌ ఏమిటి? ఎడిటర్‌ అక్కడ ఉండడం అనే ప్రశ్నలు అడగకండి. ఇది సినిమా. ఇలాంటివి కామన్‌). తను ఉదయ్‌ ను ప్రేమిస్తుంది. కానీ ఉదయ్‌ తన చిన్ననాటి రీమా కోసం వెతుకుతున్నాడని తెలుసుకుంటుంది. ఇటు-రీమా స్వాతిలో ఆమె స్టోరీని సీరియల్‌ గా రాస్తుంది. దాన్ని చదవి ఉదయ్‌ వస్తాడని భావిస్తుంది. చివరికి వీరిద్దరకి ఎవరు ఎవరో తెలిసాక, రీమా ఫాదర్‌ తనికెళ్ళ భరణి విలన్‌ గా మారుతాడు. వీరి పెళ్ళికి అడ్డుకుంటాడు. క్లైమాక్స్‌ లో ఎలాగైనా కలుసుకుంటారనేది మనకు తెలిసిందే.

    అన్ని ముందే ఊహించగలగే కథ ఉన్నప్పుడు స్క్రీన్‌ ప్లే లో పట్టు ఉండాలి. పాత్రలు ఎక్కువైతే ట్రాన్సిషన్‌ బాగుండాలి. ఈ రెండు లేకపోతే సినిమా ఆకట్టుకోవడం కష్టం. ఈ సినిమాలో జరిగింది అదే. చిత్రంగా ఉదయ్‌ కిరణ్‌ నటన కూడా ఇబ్బందికరంగా ఉంది. ఎమోషనల్‌ సీన్స్‌ లో ఉదయ్‌ నటనలోని ఇమ్యెచ్యురిటీ బయటపడింది. ఉదయ్‌ నటనలో బేసిక్స్‌ విషయాలెన్నో నేర్చుకోవాలని ఈ సినిమా తెలియచేసింది. రీమాసేన్‌ నటనే బాగుంది. ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతం ఎక్సలెంట్‌. అన్ని పాటలూ బాగున్నాయి. సునీల్‌ కామెడీ ఈ సినిమాలో పెద్ద ప్లస్‌ పాయింట్‌. సునీల్‌ నటనలో చాలా ఈజ్‌ నెస్‌ ఉంది. కొత్త దర్శకుడు ఆదిత్యా దర్వకత్వం సాధారణం. ఓవరాల్‌ గా ఫర్వాలేని చిత్రం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X