twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    న'మస్కా'రం!(రివ్యూ)

    By Staff
    |
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్:సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్
    నటీనటులు:రామ్,హన్సిక,షీలా,ముఖేష్ రుషి,ప్రదీప్ రావత్,
    తెలంగాణా శకుంతల,బ్రహ్మానందం,ఎమ్.ఎస్.నారాయణ,
    పరుచూరి వెంకటేస్వరరావు,సునీల్ తదితరులు
    కథ: సూర్య
    రచన: పరుచూరి బ్రదర్స్
    స్క్రీన్ ప్లే:ఎమ్.ఎస్.రాజు
    సంగీతం:చక్రి
    కెమెరా:శేఖర్.వి.జోసెఫ్
    ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు
    యాక్షన్: రామ్-లక్ష్మన్
    నిర్మాత:ఎమ్.ఎస్.రాజు
    రచన దర్శకత్వం:బి.గోపాల్
    రిలీజ్ డేట్:జనవరి 14,2009

    మకర సంక్రాంతి రోజున మెగా నిర్మాత ఎమ్.ఎస్.రాజు మరో మెగా దర్శకుడు బి.గోపాల్ తో కలిసి ఓ బ్రహ్మాండమైన మాస్ ఎంటర్టైన్మెంట్ రెడీ చేసాం రండని పిల్చి ప్రేక్షకులకు మస్కా కొట్టే ప్రయత్నం చేసారు. కాని సినిమా మొత్తంలో హీరో పాత్ర సమస్యలో పడకపోవటం..కథకు సమస్యగా మారి అసహనాన్ని మిగిల్చింది. అలాగే పస లేని పాటలు,పట్టుబిగించని స్క్రీన్ ప్లే కలిసి ప్రేక్షకుడి ఆనందాన్ని మసక గా మార్చేసాయి. దాంతో ఎంతో ఆర్భాటంగా రిలీజైన ఈ సంక్రాంతి సినిమా సందడి చేయలేక పోయింది. బ్యానర్ వ్యాల్యూ,హన్సక,షీలా ఎక్సపోజింగ్ ప్రొమోలు,రామ్ క్రేజ్ ధియోటర్ దాకా జనాన్ని లాగినా..మౌత్ టాక్ ముంచే ప్రమాదం ఉంది.

    ప్రపంచంలో ఎవరినీ లక్ష్య పెట్టకుండా...లక్ష్యమంటూ(పనిలో పనిగా పెద్ద చదువు కూడా) లేకుండా తిరిగే క్రిష్(రామ్)కి గయ్యాలి వదిన(ఝాన్సీ) పోరు తట్టుకోలేని విధంగా ఉంటుంది. విసుగెత్తిన (మారదాం అనుకోడు) మన హీరో అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటాడు.అయితే అతను చదివు ఫ్లస్ టు ఫెయిల్ కి అంత సీన్ లేదు కాబట్టి..అమెరికా వెళ్ళబోయే ఓ అమ్మాయిని ప్రేమలో పడేస్తే ఆమె వెనుకే వెళ్ళిపోవచ్చుకదా అని ఓ ప్లాన్ గీస్తాడు. అలాంటి అమ్మాయికోసం(పాట పాడుకుంటూ) వెతుకుతూంటే మంజు(షీలా)తారసపడుతుంది. అయితే రెండు నెలల్లో అమెరికా చెక్కేసే ఆ చక్కని చుక్కకు తను పెళ్ళాడబోయే వాడిపై కొన్ని విచిత్రమైన అభిప్రాయాలు ఉంటాయి.వాటిల్లో ముఖ్యంగా ఆ కాబోయేకి లవర్..సిగెరెట్,మందు వంటి అలవాట్లు ఉండాలి(ఎందుకంటే తాను మాన్పించమని చెప్పటానికి),అలాగే అతను భగ్న ప్రేమికుడు అయ్యుడాలి..వగైరా..వగైరా. ఆమె అభిరుచులన్నీ దొంగచాటుగా తెలుసుకున్న క్రిష్ ఆమెకు మస్కా వేయటానికి నిర్ణయించుకుంటాడు. అందులో బాగంగా తనో అమర..భగ్న ప్రేమికుడుని అన్నట్లు బిల్డప్ ఇస్తూ..సిగెరెట్లు,మందు మొదలెడతాడు. అంతేగాక తనకు దొరికన ఓ ఫొటో లో అమ్మాయి(హన్సిక)ను చూపుతూ..తన మాజీ లవర్ అని అబధ్దమాడతాడు(ఇది అజిత్ వాలి సినిమా నుండి లిఫ్ట్ చేసిన ఎపిసోడ్). ఇవన్నీ నమ్మి సంతృప్తి చెంది ప్రేమలో పడిపోయిన మంజు తన లవ్ ప్రపోజల్ పెట్టడానికి రెడీ అవుతుంది. అయితే అప్పడే ఆ క్షణానే మన హీరో చూపిన ఫొటోలోని అమ్మాయి..హన్సిక ప్రత్యక్ష్యమవుతుంది. అప్పుడు క్రిష్ ఏం చెప్పి మేనేజ్ చేసాడు. ఇంతకీ హన్సిక ఎవరు..ఇలాంటి లవ్ స్టోరీలోకి పోస్టర్స్ లో చూపుతున్నట్లుగా యాక్షన్ ఎపిసోడ్స్,విలన్స్(ముఖేష్ రుషి,ప్రదీప్ రావత్) ఎలా ఎంటర్ అయ్యారు అనేది తెలియాలంటే...తెరపై చూడాల్సిందే.

    హీరోయిన్స్ ట్రాక్(వాళ్ళిద్దరూ అక్కాచెళ్ళెళ్లు అవుట,ఒకళ్ళకు తెలియకుండా మరొకరు ప్రేమలో పడుట)వంటివి, క్లైమాక్స్ లో వచ్చే హన్సిక,షీలాల మధ్య బుల్లెట్స్ గేమ్ చిన్నప్పటి నుంచీ చూస్తున్నవే. అలాగే రాజేంద్రప్రసాద్ బ్రహ్మచారి మొగుడు నుంచి హీరోయిన్ ఎవరో తెలియకపోయినా ఆమె ఫొటో చూపెట్టి హీరో నాటకమాడటం తర్వాత ఆమె నిజంగా ప్రత్యక్ష్యమై హీరో జీవితంతో ఆడుకోవటం..నవ్వించటం వంటివి చూసి చూసి ప్రేక్షకులు ఉన్నారు. ఇలాంటి పాయింట్ తో కథ రాసి..ఎమ్.ఎస్.రాజు,బి.గోపాల్ వంటి వారిని మొప్పించటం సామాన్యమైన విషయం కాదు. అందుకు ముందుగా ఆ కొత్త రైటర్ సూర్యని అభినందించాలి.

    ముందే చెప్పుకున్నట్లు ఈ సినిమాలో హీరో పాత్ర కథకి సంభంధం లేకుండా కొనసాగటంతో ప్యాసివ్ గా మారటం పెద్ద డ్రా బ్యాక్. ఎక్కడో క్లైమాక్స్ దాకా హీరోయిన్ కి సమస్య ఉన్నట్లు హీరోకి తెలియదు. దాంతో ఆ సమస్యను తనదిగా చేసుకుని విలన్స్ ని ఎదిరించటానికి హీరో వేసే ఎత్తులు,చిత్తులు మిస్సయ్యాయి. అలాగే కధలో విలన్ ఉన్నప్పుడు బుద్ది చెప్పడమనే ఎపిసోడే ఉంటేనే కిక్.

    అయితే ఒక్క డైలాగ్ తో విలన్ మనస్సు మార్చి క్లైమాక్స్ తేల్చేయటం మరో మైనస్.అదే ఇంతకు ముందు రామ్ చేసిన రెడీ లో ఆ విలన్స్ మనస్సు మార్చడమే ఎపిసోడే నవ్వులు కురిపించి సినిమాను నిలబెట్టిందన్న సంగతి మర్చిపోకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా హీరో క్యారెక్టర్ లో క్లారిటీ లేదు.కాసేపు ఇద్దరినీ ప్రేమిస్తున్నానంటాడు.తర్వాత ఒకరి వైపే మ్రొగ్గు చూపుతూంటాడు. అలా పేలవమైన కథ,కథనాలు,క్యారెక్టరైజేషన్ సినిమాను ముంచేసాయి.

    నటుల్లో రామ్ ఎప్పటిలాగే పవన్ కళ్యాణ్ ని మాటిమాటికీ గుర్తు చేస్తూ జీవించాడు. హన్సిక,షీలా యధాశక్తి తమ అందచందాలను తెరపై ఆరబోసారు.విలన్స్ ప్రదీప్ రావత్,ముఖేష్ రుషి గత బి.గోపాల్ చిత్రాల పంధాలోనే వెళ్ళి న్యాయం చేసారు. ఇక దర్శకుడుగా బి.గోపాల్ చెయ్యదగిన సినిమా కాదనిపిస్తుంది.యాక్షన్ ఎపిసోడ్స్,ఎమోషన్స్ అధ్బుతంగా పండించగల్గిన(గతంలోనే..) ఆయన లవ్ ఎపిసోడ్స్ సరిగా డీల్ చేయలేదనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడా ఆ లవ్ ఫీల్ కలగదు. సంగీతపరంగా చక్రి రొటీన్ పాటలే ఇచ్చాడు. ఇంతకు ముందు ఎమ్.ఎస్.రాజు బ్యానర్ లో చేసిన సినిమాల్లో పాటలు సినిమా పూర్తయ్యాక ధియోటర్ నుంచి వచ్చేటప్పుడు హంట్ చేసేవి..హమ్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఇప్పుడా మ్యాజిక్ మిస్సయింది. ఎడిటింగ్, కెమెరా సినిమా స్టాండర్డ్ లోనే ఉన్నాయి. కామెంట్ అనవసరం. కామెడీలో బ్రహ్మానందం,ఎమ్.ఎస్.నారాయణ,కృష్ణ భగవాన్ ఉన్నా పెద్దగా ఉపయోగపడలేదు.

    ఏదైమైనా భారీఖర్చు,స్టార్స్ ,పబ్లిసిటీ.. ఓపినింగ్స్ తెప్పించి ప్రేక్షుకుడిని మస్కా కొట్టించగలిగినా ఎంత వరకూ నిలబెడతాయి అన్నది సందేహమే. సంక్రాంతి రాజుగా పేరుపడి ఎన్నో హిట్స్ ఇచ్చిన ఎమ్.ఎస్.రాజుగారు ఇట్లాంటి సినిమాలతో బ్యానర్ వాల్యూని మసక బరచటం నిరాశే. ఇక ఈ సినిమాను ఏ అల్లరి నరేష్ కామెడీ సినిమాలాగానే ఊహించుకుని వెళితే ఫరవాలేదనిపిస్తుంది. కాబట్టి ఆ కోణంలో ట్రై చేయగలిగే మీరూ..నిర్మాత సేవ్ అవుతారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X