twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆకట్టుకోని మాయాజాలం

    By Staff
    |

    Mayajalam
    సినిమా: మాయాజాలం
    విడుదల తేదీ: 12 ఏప్రిల్‌ 2006
    నటీనటులు: శ్రీకాంత్‌, దీప, బ్రహ్మానందం, అలీ, వేణుమాధవ్‌,
    షయాజీ షిండే, ప్రదీప్‌ రావత్‌, శివాజీరాజా, తనికెళ్ళ భరణి,
    కృష్ణభగవాన్‌, గుండు హనుమంతరావు, మల్లికార్జునరావు, షఫీ, గణేష్‌ తదితరులు
    కథ: జనార్ధన మహర్షి
    మాటలు: మరుదూరి రాజా
    కెమెరా: విజయ్‌ శ్రీ కుమార్‌
    ఎడిటింగ్‌: కెవి కృష్ణారెడ్డి
    సంగీతం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి
    నిర్మాత: వెంకట్‌

    తెలుగులో అరుదుగా వచ్చే సోషియో ఫాంటసీలకు 'మాయాజాలం' చిత్రంతో మరోసారి తెరలేపాడు కృష్ణారెడ్డి. గతంలో ఇదే కోవలో ఆయన దర్శకత్వం వహించిన 'యమలీల', 'మాయలోడు', ఘటోత్కచుడు' చిత్రాల హిట్‌కి కారణమైన సమర్ధవంతమైన స్క్రిప్ట్‌ ఈసారి లోపించింది. పూర్తి స్ధాయిలో హాస్యం పండిద్దామనుకున్నా ప్రధాన పాత్ర ఎక్కడా యాక్టివ్‌ కాకపోవడంతో ఆశించిన బిగి రాలేదు, ఊహించిన వినోదం అందలేదు.

    వంశీ (శ్రీకాంత్‌) 'కళ్యాణం కమనీయం' అనే మ్యారేజి కన్సల్టెన్సీ యజమాని. అలవోకగా సంబంధాలు కుదిర్చి పెళ్ళిళ్ళు చేస్తుంటాడు. ఆ క్రమంలో ఎంపీ ప్రదీప్‌ (ప్రదీప్‌ రావత్‌) కొడుకు ఛత్రపతి (షఫి) కోసం వంశీని కలుస్తాడు. మరోపక్క డాక్టర్‌ రాజేంద్ర (షాయాజీ షిండే) తన కూతురు స్వాతి (దీప) పెళ్ళి కోసం వంశీని సంప్రదిస్తాడు. ఈ రెండు కుటుంబాలను కలపాలని నిర్ణయించుకుంటాడు వంశీ. ఇరువైపులా పెళ్ళికి ఒప్పిస్తాడు. కానీ ఈలోపు ఓ చిన్న పొరపాటు జరుగుతుంది. ఛత్రపతి ఫోటో బదులు వంశీ ఫోటో స్వాతికి అందుతుంది. దానితో ఆమె వంశీని కాబోయే మొగుడిగా ఊహించుకుని పాటలు పాడుకుంటుంది. ఇలా ఓ పక్క ఈ ట్రాక్‌ నడుస్తుండగా మరోచోట వంశీ బుక్‌ చేసే కళ్యాణ మండపాన్ని ఆశ్రయించిన నాలుగు దెయ్యాల కథ ప్రారంభమవుతుంది. ఆ దెయ్యాలు (బ్రహ్మానందం, కృష్ణభగవాన్‌, అలీ, వేణుమాధవ్‌) కాబోయే వియ్యంకుల విలనీకి బలైన వారు. డాక్టర్‌ రాజేంద్ర కిడ్నీలు తీయడం వల్ల ఇద్దరు దయ్యాలవుతారు. మరో ఇద్దరు ప్రదీప్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పబోయి బలైనవాళ్ళు. వాళ్ళు ఎలాగైనా ఈ పెళ్ళిని అభాసుపాలు చేయాలనుకుంటారు. ఇది చాలనట్టు వంశీకి ఓ తమ్ముడు ఉంటాడు. పేరు రవిప్రకాష్‌. పోలీసాఫీసరు. అతణ్ణి ప్రదీప్‌ తన్ని ఒక గోడౌన్‌లో పడేస్తాడు. వంశీ చివరికెలా ఈ చిక్కుముడులన్నీ దాటాడు అన్నది తెరమీద చూడాలి.

    క్లాసిక్‌ చిత్రం, 'మాయాబజార్‌'ని పోలినట్టు టైటిల్‌, కథా నిర్మాణం ఉన్నా కథనంలో స్పష్టత లేకపోవడం ముఖ్యలోపం. షఫి పాత్ర లక్ష్మణ కుమారుడ్ని, దుర్యోధన బలరాముల పాత్రలు (ప్రదీప్‌ రావత్‌, షాయాజీ షిండే) దెయ్యాల మాయాజాలం ఘటోత్కచుడిని పోలినట్టు చేశారు. కానీ దానిలో ఘటోత్కచుడే హీరో. ఆ కోణంలోనే కథ మలుపులు తిరుగుతూ విజయం సాధించింది. కానీ ఇక్కడ శ్రీకాంత్‌ని హీరోని, దెయ్యాలను ప్రధాన పాత్రలుగా మలిచారు. దానితో హీరోతో ఐడెంటిఫై చేసుకున్న వాళ్ళకి నిరాశ కలుగుతుంది. శ్రీకాంత్‌కి ఇంటర్వల్‌ వద్దే విలన్స్‌ విషయం తెలిసి దెయ్యాల సాయంతో ఏడిపిస్తూ దాడికి పూనుకుంటే సంఘర్షణతో వినోదం పుట్టి విజయం సాధించేది. ఇది ఇలా ఉన్నా కొన్ని చోట్ల నవ్వులు పుట్టాయి. ముఖ్యంగా షఫీ నగ్నంగా పరుగెత్తే సీను, ప్రదీప్‌ రావత్‌ భార్యను అనుమానించే సీను బాగా పండాయి. షాయాజీ షిండే గొడవ, వంటలో బల్లి వేసే సీన్లు నవ్వు తెప్పించాయి. రైలు పాట పిల్లలను అలరించే అవకాశముంది. పెళ్ళి పాటలు ఫర్వాలేదు. శ్రీకాంత్‌ ఇతర నటీనటులు తమ పరిధిలో బాగానే చేశారు. కెమెరా, ఫ్రేమింగ్‌ ఓ మాదిరిగా ఉన్నాయి. క్లెయిమాక్స్‌ పూర్తి స్ధాయిలో లేకపోవడం లోపం. ఎడిటింగ్‌లో ఏమైనా ఎగిరిపోయి ఉండొచ్చు. దర్శకత్వ పరంగా ఎస్వీ కృష్ణారెడ్డి తన పాత చిత్రాలను దాటిపోలేదు. మాటలు ఎక్కడా పేలలేదు. సిట్యుయేషనల్‌ కామెడీ మాత్రమే నవ్వు తెప్పించింది. కొరియోగ్రఫీ రెండు ద శాబ్దాల క్రితం నాటిదిగా ఉంది. హింస, అసభ్యత లేకుండా క్లీన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించాలనుకోవడం అభినందనీయం. అయినా మరికొన్ని నవ్వులు పండితే పండే చిత్రమిది.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X