For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కామిడీగా మారిన హర్రర్ 'ఆవహం'(రివ్యూ)

  By Srikanya
  |
  Avaham
  Rating
  -జోశ్యుల సూర్య ప్రకాష్
  కామిడీగా మారిన హర్రర్ 'ఆవహం'(రివ్యూ)
  బ్యానర్: సార్థక్‌ మూవీస్‌ ప్రైవేట్‌లిమిటెడ్‌, జడ్‌త్రీ పిక్చర్స్‌
  చిత్రం: 'ఆవహం'
  నటీనటులు: సందీప్, అమృత కేవాల్కర్, ఆహాస్ చన్నా, నీరూ సింగ్, అను అన్సారీ,
  సంగీతం: ధరమ్ మరియు సందీప్
  సమర్పణ: రామ్ గోపాల్ వర్మ
  కధ,మాటలు,దర్శకత్వం: మిలింద్ గడాక్కర్
  విడుదల తేదీ : ఏప్రియల్ 16, 2010

  అతీత శక్తులుండే దెయ్యాలు(నమ్మితే) కూడా చంపటానికి పక్కా క్రిమినల్స్ లాగా కత్తులు పట్టుకుని తిరుగుతూంటాయా...అవుననే అంటుంది ఆవాహం సినిమా. రామ్ గోపాల్ వర్మ సమర్పించిన ఈ తాజా చిత్రంలో పగ,ప్రతీకారం అంటూ దెయ్యం కత్తి పట్టుకు తిరుగుతూంటుంది. అంతేగాక అది ఓ బొమ్మని ఆవహించి భయపెట్టే ప్రయత్నాలు చేస్తూంటుంది. అలాగే అది ఎవరిని భయపెట్టాలి,ఎవరి మీద పగ తీర్చుకోవాలి అనే డెసిషన్ తీసుకోవటానికి ఇంటర్వెల్ దాకా టైం తీసుకుంటుంది. అట్లాంటి వెర్రిమొర్రి దెయ్యం కథతో వచ్చిన ఈ చిత్రం తో భయపెడతానంటూ భయంకర సవాల్ విసిరి వర్మ మరో సారి భంగపడ్డారు.

  'రక్ష' చిత్రంలో చేతబడిలాంటి క్షుద్రశక్తులు తెలిసిన ఒక మంత్రగత్తె తన స్వప్రయోజనాల కోసం ఓ చిన్నపిల్లని హింసిస్తూ చంపే ప్రయత్నంలో ఆ అమ్మాయి తండ్రిని అనేక ఇబ్బందులకు గురిచేస్తుంది. తన పాపను రక్షించుకునే ప్రయత్నంలో ఆ తండ్రి ఒక మంత్రగాణ్ణి కలిసి అతని సహాయంతో ఆమెను చంపుతాడు. ఇక 'ఆవహం' చిత్రకథ, ఆ చనిపోయిన మంత్రగత్తె ప్రేతాత్మ రూపంలో తిరిగి పగ తీర్చుకోవటానికి హీరో(సుదీప్) కొత్త ఇంటికి రావటంతో మొదలవుతుంది. అయితే పగతో రగిలిపోతున్న దెయ్యం మొదట ఎందుకనో ఓ అందవికారమైన బొమ్మలో ప్రవేశించి పిల్లలను భయపెడుతుంది. ఆ తర్వాత ఎప్పుడో ఇంటర్వెల్ కు ముందు హీరో(సుదీప్) భార్య ని ఆవహించి ...నీ కళ్ళ ఎదురుగా నీ కుటుంబాన్ని నాశనం చేస్తానని శపధం చేస్తుంది. అందులో భాగంగా తన మరణానికి కారణమైన మంత్రగాణ్ణి మొదట చంపేస్తుంది. ఆ తర్వాత హీరో ఆ దెయ్యంతో ఎలా పోరాడారు..ఎవరు గెలిచారు వంటి అధ్బుతమైన ఆసక్తికర విషయాల కోసం ధియోటర్ కి వెళ్ళాల్సిందే.

  స్వంత తల్లే..దెయ్యం ఆవహించటంతో తన కూతురుని చంపటానికి వస్తుంటే ఎలా ఉంటుంది..అనే పాయింట్ కి ఎగ్జైట్ అయి వర్మ ఈ చిత్రం చేసినట్లు పలు ఇంటర్వూలలో చెప్తూ వచ్చారు. అయితే ఆ విషయం చిత్రంలో ఊహించినంత గొప్పగా ఎగ్జిక్యూట్ కాదు. అలాగే చిత్రం సీక్వెల్ కావటంతో ..ఆ మొదటి భాగం చూడని వారికి ఈ కొనసాగింపు అర్దం కాదు. ఎలాగూ టీవీ సీరియల్ లాగ ఉంది కాబట్టి కాస్త రీక్యాప్ వేస్తే బాగుండేది. అలాగే ఎంచుకున్న లొకేషన్స్ (బీచ్, అడవి) హీరో పిల్లలు తప్ప మరెవరూ కనపడరు. అట్లాంటి నిర్మానుష్యమైన ప్రదేశానికి ఎందుకు వాళ్ళు వెళ్ళతారో అర్దంకాదు. ఇక పీడకల వచ్చిందని కూతురు భయపడి లేస్తే...తల్లి వచ్చి ప్రక్కన పడుకోవటం వంటిది చేయదు. ఎవరో పిల్లలన్నట్లు చూసి మళ్లీ తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక పగతీర్చుకుందామనుకున్న దెయ్యం బొమ్మ లోకి ప్రవేశించి ఏం పాముకుంటుందా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ (అంత సస్పన్స్ ఏమీలేదు) లో దెయ్యం పట్టిన హీరో భార్య చనిపోగానే ...దెయ్యం అంతర్ధానమవుతుందంటూ చూపెట్టారు. అయితే మనిషి చావగానే వాళ్ళని పట్టిన దెయ్యం కూడా చచ్చిపోతుందా...వెంటనే అది లేచి వేరే వారిని ఆవహించవచ్చు కదా..ఎందుకంటే అది ప్రాణంలేని బొమ్మల్లో కూడా ప్రవేశించగలదు కదా..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విచిత్రమైన సందేహాలు చాలా వస్తాయి. ఇక దర్శకుడు,రైటర్ ఒక్కడే అయిన ఈ చిత్రంలో కథ,కథనాలే మైనస్ గా ఉండటమే మహా నసగా మారింది. కెమెరా ,ఎడిటింగ్ సినిమాకు తగినట్లే ఉన్నాయి. అయితే కొన్నిసన్నివేసాల్లో కెమెరా మెన్ ప్రతిభను పొగడకండా ఉండలేం. ఇక తెలుగుకు చేసిన డైలాగులు,డబ్బింగ్ అయితే ఈ మధ్య కాలంలో ఇదే అత్యంత చెత్త డబ్బింగ్ చిత్రం అని మొహమాటం లేకుండా చెప్పవచ్చు.

  ఏదైమైనా ఈ చిత్రం చూసిన వారికి రామ్ గోపాల్ వర్మ తన ప్రొడక్టుని మార్కెట్ చేసుకోవటానికి కావాలనే రాంగ్ పబ్లిసిటీ చేసినట్లు అర్దమవుతుంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X