For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అభిమానుల రోమాలు నిక్కపొడుస్తాయి... (ఎంఎస్.ధోనీ- రివ్యూ)

  By Bojja Kumar
  |

  Rating:
  3.0/5

  హైదరాబాద్: మహేంద్ర సింగ్ ధోనీ... క్రికెట్ ను మతంగా అభిమానించే భారతీయులకు పరిచయం అక్కర్లేని పేరు. సక్సెస్ ఫుల్ వికెట్ కీపర్ గా, సక్సెస్ ఫుల్ బ్యాట్స్ మెన్ గా, అంతకంటే సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా, ఎలాంటి పరిస్థితులను అయినా కూల్ గా హ్యాండిల్ చేసే సారథిగా ధోని మనకు తెలుసు. ఇదంతా నాణేనికి ఒక వైపు... మనకు తెలియని ధోనీ జీవితం ఎంతో ఆసక్తికరం.

  రాంచీలో ఒక సాధారణ దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ధోనీ.... ఇంటర్నేషనల్ క్రికెటర్ గా, టీమిండియా కెప్టెన్ గా ఎదిగిన వైనాన్ని దర్శకుడు నీరజ్ పాండే 'ఎంఎస్ ధోనీ-ది అన్ టోల్డ్ స్టోరీ' మూవీ రూపంలో అద్భుతంగా తెరకెక్కించారు.

  ధోనీ స్కూలు రోజుల నుండి 2011లో వరల్డ్ కప్ గెలించే వరకు అతని జీవితంలో చోటు చేసుకున్న క్రికెట్ సంబంధిత అంశాలతో పాటు....క్రికెటర్ గా ఎదుగుతున్న క్రమంలో వ్యక్తి గత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులు.... తండ్రిని బాధ పెట్టలేక ఖరగ్‌పూర్ స్టేషన్లో టికెట్ కలెక్టర్ గా ఇష్టంలేని ఉద్యోగం చేస్తూ అతడు పడ్డ మనో వేదన, అందులో నుండి బయట పడటానికి, క్రికెట్లో తను అనుకున్న లక్ష్యాలను చేరడానికి ఎలాంటి రిస్క్ చేసాడు అనే సంఘటనలను అందరికీ అర్థమయ్యేలా వివరించారు.

  దీన్ని మనం ఒక సాధారణ సినిమా కోణంలో చూసి సినిమా ఇలా ఉంటే బావుండేది, ఈ సీన్ లేకుండా ఉంటే బావుండు....అనే అంచనాకి రావడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది కల్పితం కాదు, భారత దేశం గర్వించదగ్గ ఒక గొప్ప క్రికెటర్ రియల్ లైఫ్.

  సినిమా స్టోరీ

  సినిమా స్టోరీ

  ఇక సినిమా కథ గురించి... .... రాంచీలో సాధారణ పంపు ఆపరేటర్ భాన్ సింగ్. తనకు సరైన చదువు అందలేదు, సరైన ఉద్యోగం లేదు, తన పిల్లలైనా బాగా చదువుకుని మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి తనకంటే బాగా బ్రతకాలని ఆశపడే ఒక మధ్యతరగతి తండ్రి. భాన్ సింగ్ కుమారుడు మహేంద్రసింగ్ ధోనికి చిన్నతనం నుండే ఆటలంటే ఆసక్తి.

  ధోనీ బాల్యం, క్రికెట్

  ధోనీ బాల్యం, క్రికెట్

  ధోనీ స్కూల్ లో ఫుట్ బాల్ టీంకు గోల్ కీపర్. బంతిని క్యాచ్ చేయడంలో అతని టాలెంట్ గమనించిన స్కూల్ కోచ్ స్కూల్ క్రికెట్ టీంకు వికెట్ కీపర్ లేని లోటును పూడ్చేందుకు ధోనీని తీసుకుంటారు. చిన్నతనం నుండే ధోని వికెట్ కీపింగ్, బ్యాటింగులో మంచి ప్రతిభ చూపిస్తూ ఎదుగుతాడు. తన విభిన్నమైన ఆటతీరు, మరెవరూ ఆడలేని అసాధారణమైన షాట్లు....చూసేవారిని మంత్రముగ్ధులను చేసే బ్యాటింగ్ స్టైల్ తో లోకల్ గా బాగా ఫేమస్ అవుతాడు. ధోనీ ఆడుతుంటే చూసేందుకు గుంపులుగుంపులుగా లోకల్ ఫ్యాన్స్ తరలివస్తుంటారు.

  క్రికెటర్ గా ఎదిగే క్రమంలో ఇబ్బందులు

  క్రికెటర్ గా ఎదిగే క్రమంలో ఇబ్బందులు

  సరిగ్గా అండర్ 19 వలర్డ్ కప్ సెలక్షన్స్ ట్రయల్స్ జరిగే సమయం.... తనకు పరీక్షల సమయం ఒకేసారి వస్తుంది. ఉదయం పూట పరీక్షలు రాస్తూ, అయిపోగానే రాంచీ నుండి పరుగు పరుగున ట్రైన్ లో జంషెడ్ పూర్ లో జరిగే సెలక్షన్స్ ట్రయల్స్ కు వెలుతూ ధోనీ ఎంత కట్టపడ్డాడో మాటల్లో చెప్పడం కంటే తెరపై చూస్తేనే బావుంటుంది. అయితే అప్పటి బీహార్ స్టేట్ క్రికెట్ సంఘంలో పాలిటిక్స్ వల్ల ధోనీ అండర్ 19 వరల్డ్ కప్ కు సెలక్ట్ కాలేకపోతాడు, తర్వాత కోల్ కతాలో జరుగుతున్న దులీప్ ట్రోపీలో ఆడే అవకాశం అభించినా....సమయానికి అక్కడికి చేరుకోలేని దుస్థితి.

  ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ

  ఇష్టం లేని ఉద్యోగం చేస్తూ

  కట్ చేస్తే.... రైల్వేలో టికెట్ కలెక్టర్ ఉద్యోగం తనను వెతుక్కుంటూ వస్తుంది. తన కొడుకు గవర్నమెంటు ఉద్యోగి అయ్యాడనే తండ్రి ముఖంలో సంతోషాన్ని చెరిపేయడం ఇష్టంలేక... పరిస్థితులకు రాజీపడి ఖరగ్‌పూర్‌లో ఇండియన్ రైల్వేస్ లో టికెట్ కలెక్టర్ గా ఉద్యోగంలో చేరుతాడు. అటు ఇష్టం లేని ఉద్యోగం చేయలేక, ఇటు తనకిష్టమైన క్రికెట్ ను వదిలి పెట్టలేక ధోనీ ఏం చేసాడు? ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఇండియన్ టీంలోకి సెలక్ట్ కావడానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనేది తెరపై చూస్తేనే సినిమా మంచి కిక్ ఇస్తుంది.

  సుశాంత్ సింగ్ రాజ్ పుత్

  సుశాంత్ సింగ్ రాజ్ పుత్

  ఇక మహేంద్ర సింగ్ ధోనీ పాత్రను పోషించిన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గురించి చెప్పుకోవాల్సి వస్తే.... ధోనీ పాత్రలో పర్ఫెక్ట్‌గా సూటయ్యాడు. అతడు ధోనీ పాత్రలో నటించాడు అనడం కంటే జీవించాడు అనే చెప్పాలి. ముఖ్యంగా క్రికెట్ ఆటకు సంబంధించిన సన్నివేశాల్లో పరకాయ ప్రవేశం చేసాడు. రియల్ లైఫ్ లో ధోనీ ఎప్పుడూ ముఖంలో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్ లేకుండానే కనిపిస్తాడు. పాత్ర తీరే అంత కాబట్టి సినిమాలో కూడా సుశాంత్ దాదాపు అలానే కనిపించాడు.

  ఇతర నటీనటులు

  ఇతర నటీనటులు

  ఇతర పాత్రల గురించి చెప్పుకోవాల్సి వస్తే.... ధోనీ తండ్రి భాను సింగ్ పాత్రలో అనుపమ్ ఖేర్ అద్భుతంగా నటించాడు. ధోనీ కోచ్ పాత్రలో రాజేష్ శర్మ, సోదరి పాత్రలో భూమిక చావ్లా ఆకట్టుకున్నారు. ఇక ధోనీ ప్రియురాలు ప్రియాంక పాత్రలో దిశా పటాని, భార్య సాక్షి పాత్రలో కైరా అద్వానీ నటించారు. వీరు కనిపించేది కొంతసేపే అయినా అందం పరంగా, పెర్ఫార్మెన్స్ సూపర్బ్ అనిపించారు.

  నీరజ్ పాండే దర్శకత్వం

  నీరజ్ పాండే దర్శకత్వం

  దర్శకత్వం, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ తదితర కీలకైమన అంశాల విషయానికొస్తే దర్శకుడు నీరజ్ పాండే తన బాధ్యతకు పూర్తి న్యాయం చేసాడు. ముఖ్యంగా చిన్నతనం నుండి ధోనీ క్రికెటర్ గా ఎదుగుతున్న తరుణంలో వచ్చే సన్నివేశాలు అభిమానుల రోమాలు నిక్కపొడిచేలా తెరకెక్కించి అదరగొట్టాడు. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. కొన్ని చోట్ల సినిమా స్లో అయినట్లు అనిపించినా మళ్లీ వెంటవెంటనే సినిమా పుంజుకున్నట్లు ఉండటంతో ప్రేక్షకుల్లో ఆ ఫీలింగ్ రాదు. డైలాగ్స్ కూడా బావున్నాయి.

  3 గంటల సినిమా

  3 గంటల సినిమా

  సినిమా నిడివి దాదాపు 3 (190 నిమిషాలు) గంటలుపైనే ఉంది. ఇంత లెంత్ ఉండటం కాస్త బోర్ ఫీలింగ్ రావచ్చు. అయితే ఒక క్రిటర్ జీవితాన్ని ఇంతకంటే తక్కువ సమయంలో కుదించి చూపడం అంత సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఎడిటింగ్ విభాగాన్ని తప్పుపట్టాలనిపించదు. సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా ఉంది. సందర్భానుసారంగా అక్కడక్కడా వచ్చే కొన్ని పాటలు, మ్యూజిక్ ఫర్వాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ ఎఫెక్టివ్ గా ఉంది.

  వివాదాలు కూడా

  వివాదాలు కూడా

  ధోనీ క్రికెట్ జీవితంలో జరిగిన కొన్ని వివాదాలను కూడా చూపించారు. అప్పట్లో వీరేంద్ర సెహ్వాగ్ ను జట్టు నుండి ధోనీ కావాలని తప్పించే ప్రయత్నం చేసాడని అప్పట్లో మీడియాలో రచ్చ జరిగింది. అందుకు సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చారు.

  ఫైనల్‌గా...

  ఫైనల్‌గా...

  ఫైనల్ గా చెప్పాలంటే.... క్రికెట్ ను అభిమానించే, ఇష్టపడే ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. ఇక ధోనీ అభిమానులకు పూర్తి సంతృప్తినిచ్చే సినిమా. అయితే క్రికెట్ గురించి ఆసక్తి చూపని వారికి, క్రికెట్ అంటే నచ్చని వారికి ఈ సినిమా కాస్త బోర్ ఫీలింగ్ రావొచ్చు.

  English summary
  MS Dhoni The Untold Story movie review. M.S. Dhoni: The Untold Story is an upcoming Indian biographical film directed by Neeraj Pandey, based on the life of Indian cricketer and the current ODI and T20I captain of the Indian national cricket team, Mahendra Singh Dhoni. Fox Star Studios distributes the film and produced it jointly with Inspired Entertainment and Arun Pandey, in association with Friday Film Works. The film features Sushant Singh Rajput as Dhoni and Disha Patani, Kiara Advani, and Anupam Kher in supporting roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X