For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నేను..నా చావు (నేను నా రాక్షసి రివ్యూ)

  By Srikanya
  |


  -సూర్య ప్రకాష్ జోశ్యుల
  సంస్థ: లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్‌
  నటీనటులు: రాణా, ఇలియానా, సుబ్బరాజు, అలీ, అభిమన్యు సింగ్‌, ముమైత్‌ ఖాన్‌ తదితరులు
  సంగీతం: విశ్వ-రెహమాన్‌
  నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి)
  దర్శకత్వం: పూరి జగన్నాథ్‌

  'కొత్త కథలు రావడంలేదు...తీయడంలేదు...అని పదే పదే అంటుంటే తిక్కరేగి రాసిన కథ ఇది"అంటూ పూరి జగన్నాధ్ 'నేను..నా రాక్షసి'గురించి స్పష్టంగా కొద్ది రోజుల క్రిందటే హింట్ ఇచ్చారు.అయితే ఆయనమీద ఉన్న అతి నమ్మకంతో ఆ మాటలకి పెడర్దాలు తీసి ఆయనేదో గొప్ప కథతో రాబోతున్నాడని ఎక్సపెక్ట్ చేసుకుని ఆవేశపడ్డాం .దానికి తోడు ఆత్మహత్యల నేపథ్యంలో అల్లుకొన్న కథ ఇది.అసాధారణంగా ప్రవర్తించే రెండు పాత్రల చుట్టూ నడుస్తుంది అని మరీ ఊరించేసరికి మరింత ఆశలు పెంచేసుకుని ధియోటర్ లో దూకేసాం.అప్పుడు ఏమైంది..అవేశానకి తగ్గ పలితం అనుభవించాల్సి వచ్చింది.. పూర్తి చావులతో నిండిన ఈ సినిమా మొత్తం చూసేసరికి చచ్చే చావు అయ్యి ఎందుకు బ్రతికి ఉన్నానా అన్న విరక్తి కలిగింది.

  అభిమన్యు (రాణా)తన వృత్తిలో బాగా పండిపోయిన ప్రొఫెషనల్ కిల్లర్.మీనాక్షి (ఇలియానా)ఆత్మహత్యలు చేసుకునే వారి చివరి మాటలను వీడియో తీసి 'ఇట్స్ మై లైఫ్ బాస్'పేరుతో యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూండే అమ్మాయి.అందమైన అమ్మాయికి ఇదేం పిచ్చి అనుకోకండి ..దానికో అద్బుతమైన ప్లాష్ బ్యాక్ ఉంది .ఇక అభి,మీనాక్షి ఓ రోజు అనుకోని పరిస్ధితుల్లో కలుస్తారు.వెంటనే ఆమెతో తొలి చూపులోనే ప్రేమలో పడిన అభి ఆమె వెనక రెగ్యులర్ తెలుగు సినిమా హీరోలా తన పనులన్నీ ప్రక్కన పెట్టి మరీ తిరుగుతూంటాడు.మరో ప్రక్క యూ ట్యూబ్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సి.ఐ విక్రమ్ (సుబ్బరాజు)ఎవరు ఈ పని చేస్తున్నారంటూ ఎంక్వైరీ ప్రారంభిస్తాడు.ఆయనకి కాన్సర్ తో చనిపోబోతున్న కూతురు.అదో విషాద గాధ. ఇలా ఎడా పెడా చావులతో కధ నడుస్తూండగా అంతవరకూ కోమాలో ఉన్న అభి తల్లి చనిపోతుంది. దాంతో జీవితం మీద విరక్తికలిగి(అప్పటికి మనకీ విరక్తి కలుగుతుందనుకోండి)ఆత్మ హత్య చేసుకోవాలని తన వీడియో కూడా తీసి యూట్యూబ్ లో పెట్టమని ఆమెనే పిలుస్తాడు.అప్పుడేం జరిగింది.అభి ఆత్మహత్య చేసుకున్నాడా.సిఐ విక్రమ్ ఈ కేసుని ఎలా ఛేదించాడు.మీనాక్షి దొరికిపోయిందా..అభి ప్రొఫెషనల్ కిల్లర్ గా మారటానికి కారణమేంటి అనేది తెలుసుకోవాలని ఆసక్తి ఉంటే తెరపై చూడాల్సిందే.

  ప్రారంభంలోనే ఇలియానా ఆత్మహత్యను చూపెట్టి సినిమాను ప్రారంభించటంతో బాగానే హుక్ చేయగలిగాడు పూరి జగన్నాధ్.అయితే ఆ తర్వాత తను వేసుకున్న ముడి కథకు ఏ మేరకు ఉపయోగపడింది అన్నదే డీల్ చేయటంలో చతికిలపడ్డాడు.అలాగే హీరోకో ప్లాష్ బ్యాక్,హీరోయిన్ కో ఫ్లాష్ బ్యాక్ అనుకుని,దానికి ఈ ఆత్మహత్యల నేపధ్యం ఎన్నుకుని పూరి ఈ కథ తయారు చేసాడని అర్దం అవుతుంది.అయితే ప్రేక్షకుడు కేవలం ఫ్లాష్ బ్యాక్ లు చూడటానికే ధియోటర్ కి వెళ్లడు కదా.(వాడికీ ఎన్నో ప్లాష్ బ్యాక్ లు..మరెన్నో సమస్యలు.వాటిని మర్చిపోవటాకే అక్కడికి వస్తూంటాడు)దాంతో ప్రధాన పాత్రల సంఘర్షణ,వాటి నుంచి పుట్టే రిజల్యూషన్ చూడటానికే ప్రాధాన్యత ఇస్తాం.అంతేగాక ప్రధాన పాత్రలు రెండింటి మధ్యా కెమిస్ట్రీ ఎక్కడా కనపడదు.ఇలియానా పాత్ర ఎప్పుడూ సీరియస్ గా జీవితంలో ఏదో పొగొట్టుకున్నట్లుగా ప్రవర్తిస్తూంటుంది.ఆమెనుంచి మరేదో ఎక్సపెక్ట్ చేసి వచ్చిన ప్రేక్షకుడు ఇది జీర్ణించుకోలేని విషయం.

  సర్లేండి ఇదో ప్రయోగ చిత్రం...ఆత్మహత్యలు లాంటి బర్నింగ్ టాపిక్ ని డీల్ చేస్తున్నాడు..కమర్షియల్ సినిమాలా చూడకూడదు అని సర్ది చెప్పుకుందామనుకున్నా ఎంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారో లెక్కలు తప్ప ఒక్క పనికొచ్చే విషయం చర్చించడు.ఆత్మహత్యలు ఎందుకు చేసుకోవాలనుకుంటారు.ఎవరిది తప్పు.ఎలా నివారించవచ్చు అన్న ఏంగిల్ లో కథ,కథనం నడవదు.ఇది చాలదన్నట్లు విలన్ (అభిమన్యుసింగ్) ని పెట్టి ఎనభై ల నాటి కథలాగా హీరో తల్లి తండ్రులను చంపాడు..అతనిపై హీరో రివేంజ్ తీర్చుకోవాలి అన్నట్లు సబ్ ప్లాట్ నడుస్తూంటుంది.పోనీ అదైనా పెరెపక్ట్ గా చేసారా అంటే లేదనే చెప్పాలి.విలన్ తనే వెతుక్కుంటూ హీరో దగ్గరకు వస్తాడు కానీ,హీరో ఎప్పుడూ తన తల్లి తండ్రులను చంపినవారిని మట్టు పెట్టాలి అనే ఆలోచనతో ఉండడు.దాంతో హీరో పాత్ర ప్యాసివ్ గా మారుతుంది.విలన్ చేష్టలకు స్పందించటం తప్ప తనే ఎధురు వెళ్ళి ఛాలెంజ్ విసరటం ఉండదు.కేవలం మొదటి సీన్,ఇంటర్వెల్ సీన్,క్లైమాక్స్ సీన్ అనుకుని అల్లిన ఈ కథలో కథ,కథనం లే సమస్యలుగా మారి ప్రేక్షకుడుకి సహన పరీక్ష పెడతాయి.దానికి తోడు పూరీ సినిమాల్లో హైలెట్ గా నిలిచే కామిడీ ఈ చిత్రంలో చాలా నీచంగా,అసభ్యంగా ఉంది.అలీ,ముమైత్ ల ట్రాక్ అస్సలు పేలలేదు.

  ఇవన్నీ ప్రక్కన పెడితే టెక్నికల్ గా ఈ చిత్రం నిరాశపరచదు.ముఖ్యంగా కెమెరా వర్క్ అద్బుతంగా ఉంటుంది.ఎడిటింగ్ చాలా షార్ప్ గా చేసారు.పాటల్లో రెండు బాగున్నాయి.నటన విషయానికి వస్తే ఇలియానా అందాలు పరచకపోయినా ఎమోషన్స్ బాగా పండించింది.రాణా పెద్దగా మార్పేమీ లేదు.ఎనీ ఎమోషన్ సింగిల్ రియాక్షన్ అన్నట్లు చేసుకుపోయాడు.విలన్ గా చేసిన రక్త చరిత్ర ఫేమ్ అభిమన్యు సింగ్ మాత్రం ఈ చిత్రంలో అంతగా రాణించలేదు.నిర్మాణవిలువలు బాగున్న ఈ చిత్రంలో డైలాగులు కొన్ని చోట్ల బాగా పేలాయి.

  ఫైనల్ గా బలహీన మనస్కులు..సినిమాలు చూసి నిజమని నమ్మేవారు ఈ చిత్రానికి వెళ్ళకపోవటమే మేలు.ఎందుకంటే సినిమా పూర్తిగా చూసిన తర్వాత విరక్తి చెంది ఏదన్నా చేసుకుందాం ఎలాగూ ఇలియానా చివరి క్షణాల్లో వస్తుంది అనుకునే ప్రమాదం ఉంది కాబట్టి.

  English summary
  Rana's second film Nenu Naa rakshasi released today.In this film Abhi (Rana) is a professional killer who falls in love with Meenakshi (Ileana) in the first sight. She has a strange habit of shooting live suicides and uploads them on Youtube.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X