twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెదబాబు - సమీక్ష

    By Staff
    |

    Pedababu
    చిత్రం: పెదబాబు
    నటీనటులు: జగపతిబాబు, కళ్యాణి, సుహాసిని,
    కె.విశ్వనాథ్‌, శరత్‌బాబు, సునీల్‌ తదితరులు
    సంగీతం: చక్రి
    నిర్మాత: ఎం.ఎల్‌.కుమార్‌చౌదరి
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పరుచూరి మురళి

    జగపతిబాబు గెటప్‌ తప్ప ఇసుమంత కూడా ఆసక్తి కలిగించని చిత్రం - పెదబాబు. మరీ ఓల్డ్‌ఫ్యాషన్‌ మూవీ. తల్లి, కొడుకుల సెంటిమెంట్‌ ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం బహుశా, బి, సి సెంటర్లలో ఉండే మహిళా ప్రేక్షకులనుద్దేశించి తీసి ఉంటారు. ఆ సెంటిమెంట్‌ మహిళాప్రేక్షకులను కంటతడిపెట్టించి కాసులు కురిపిస్తుందనే భ్రమ లేదా భావనతో ఈ సినిమా తీసివుంటారు. వారి సంగతేమోగానీ, మనలాంటి మామూలు ప్రేక్షకులు ఈ సినిమాను భరించడం కష్టమే.

    'పెదరాయుడు' చిత్రం తర్వాత 'హీరో ఓ ఊరి పెద్ద. ఆయనను అందరూ ఆదరిస్తారు. హీరో ఊరి ప్రయోజనం కోసమే బతుకుతుంటాడు..'వంటి చిత్రాలు లెక్కకుమించి వచ్చాయి. ఆ తరహా హీరో పాత్ర జగపతిబాబుది ఇందులో. ఆయన పేరు పెదబాబు. మెడలో రుద్రాక్షమాలలు, బంగారంతో చేసిన చెయిన్‌లు, ఉంగరాలతో ఎప్పుడూ శివపూజ చేసే 'పెదబాబు'కు ఒక ప్లాష్‌బ్యాక్‌ ఉందని సినిమా మొదట్నుంచి మనకు తెలుస్తూ ఉంటుంది.

    ఆ ఫ్లాష్‌బ్యాక్‌ ఏమిటో మనకు తెలిసే లోపు..పెదబాబు ఊరి కోసం చేసే పనులను చూపించడం, సునీల్‌తో కామెడీ పెట్టించడం, సుహాసిని డీప్‌గా హీరోవైపు చూస్తూ 'సెంటిమెంట్‌ పండించడం' అయిపోతాయి. సుహాసిని పెదబాబును తన పెద్దకొడుకు అని అంటూ ఉంటుంది. కానీ హీరోగారు మాత్రం తనకు ఏ బంధం లేదంటాడు. అలా అనడానికి కారణం ఏమిటంటే..పాతికేళ్ళు వెనక్కి వెళ్ళాలి. సుహాసిని ఓ మోతుబరి రైతు కుమార్తె.

    ఆమె భర్త అకాలంగా మరణిస్తాడు. ఐదేళ్ళ కుమారుడు (పెదబాబు) ఉన్నా, తిరిగి ఆమెకు తన దగ్గర పనిచేసే శరత్‌బాబుతో విశ్వనాథ్‌ పెళ్ళి జరిపిస్తాడు. పెళ్ళి నిశ్చియించిన పూజారి పెదబాబు వల్ల ఆమెకు మరణం సంభవిస్తుందని, పిల్లాడిని ఆమె నుంచి వేరు చేయాలని చెపుతాడు. ఐదేళ్ళ పెదబాబు అప్పుడే స్పందించి 'త్యాగం' చేస్తాడు. అప్పట్నుంచీ, తల్లి ఆయుష్షు కోసం.. ఆమెకి దూరంగా ఉంటూ 'బంధం' లేదంటూ ఉంటాడు. ఫ్లాష్‌బ్యాక్‌ పూర్తయ్యాక, హీరోగారి తన చెల్లిలిని ప్రేమించిన వాడికే పెళ్ళి చేసే భాద్యతను తీసుకొని పూర్తి చేస్తాడు.

    ఆ సందర్భంగా జరిగిన ఘటనల పరిణామంతో సుహాసిని స్పృహ తప్పిపడిపోవడం, చివరి దశలో తల్లికి తులసి నీరు తాగించేందుకు పెదబాబు రావడం, చలించిపోయి..'అమ్మా..' అని కేక వేయడంతో సుహాసినిలో చలనం కలగడంతో సినిమా ముగుస్తుంది.

    ఇలాంటి పాతకాలం నాటి కథకు, దర్శకుడు పరుచూరి మురళి ('నీస్నేహం'తో దర్శకుడిగా పరిచయం అయ్యాడు) నాసిరకం ట్రీట్‌మెంట్‌ తోడయ్యింది. సునీల్‌ కామెడీ ఫర్వాలేదు. జగపతిబాబు కన్నా అతడికే సీన్లు ఎక్కువ. హీరోయిన్‌ కళ్యాణిది రోటీన్‌ పాత్ర. ఇలాంటి పాత్రలు, సినిమాలు జగపతిబాబకు ప్రథమం కాబోలు కానీ, ప్రేక్షకులకు మాత్రం కొత్త కాదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X